Abn logo
Sep 25 2021 @ 00:23AM

సలపరించే గాయానికి పాతికేళ్లు!

పేదల పాలిట నారాయణుడిగా గుర్తింపు

నడిరోడ్డుపై హత్యచేసిన ‘రాజ్యం’

‘మర్లబడ్డ మొగిలిచర్ల’ జ్ఞాపకంగా పదిలం


హనుమకొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్యో నారాయణో హరి.. అన్నది నానుడైతే... ప్రజలే దేవుళ్లని, పల్లెలే దేవాలయాలనీ నమ్మిన నిజమైన ప్రజావైద్యుడు డాక్టర్‌ ఆమెడ నారాయణ. అగంతకులుగా చెబుతున్న రాజ్యం కాల్పుల్లో  నారాయణ మృతిచెంది శనివారం (సెప్టెంబరు 25) నాటికి  25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.  


గ్రామీణ నేపథ్యం

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నారాయణకు పల్లె ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలుసు. తన అవసరం గ్రామాల్లోనే ఉందని సంపూర్ణంగా విశ్వసించాడు. ఎంబీబీఎస్‌ పూర్తికాగానే వరంగల్‌ జిల్లా మొగిలిచెర్లలో పిల్లల వైద్యు డు డాక్టర్‌ రామనాథం చేతుల మీదుగా ప్రజావైద్యశాలను ప్రారంభింపచేశాడు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో మొగిలిచెర్లలోనే భార్యా బిడ్డలతో మకాం పెట్టాడు. మొగిలిచెర్ల సమీప 40 గ్రామాల ప్రజలకు వైద్యం అందచేసిన డాక్టర్‌గా వారి గుండెల్లో నిలిచాడు. పదిహేనేళ్లపాటు పల్లెలకు అంకితమై ఆహర్నిశలు వైద్యసేవలు అందిస్తున్న క్రమంలో డాక్టర్‌ నారాయణను 1996 సెప్టెంబర్‌ 25న గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. 


పేదరికాన్ని జయించి..

1957లో కురవి గ్రామంలో తల్లిదండ్రులు మహాలక్ష్మి, ముత్తయ్యలకు నారాయణ జన్మించారు. ఆరుగురు సంతానంలో ఆయన రెండోవాడు. కురవిలో 10వ తరగతి పూర్తి చేశాడు. మహబూబాబాద్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తయిన తర్వాత హన్మకొండ ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజీలో డిగ్రీలో చేరాడు. డిగ్రీ చదువుతుండగానే మెడికల్‌ ఎంట్రెన్స్‌ రాసి కాకతీయ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాడు. 


ప్రజావైద్యశాల

హన్మకొండ నుంచి మొగిలిచెర్లలోని తన ప్రజావైద్యశాలకు నారాయణ ప్రతీ రోజు ఉదయం 6 గంటలకే బయ లు దేరి రాత్రి 9 గంటల వరకు రోగులకు సేవలు అందించేవారు. ప్రయాణంలో కూడా మార్గంమధ్యలో రోగులు కనబడితే ఆగి వారిని పరీక్షించి మందులిచ్చే స్వభావం ఆయనది. ఆయనను చంపాలని పధకం వేసుకున్నవారు దీనిని అవకాశంగా తీసుకున్నారు. డాక్టర్‌ నారాయణ రోజువారిలా ఉదయం స్కూటర్‌పై మొగిలిచెర్లకు బయలు దేరాడు. మార్గంమధ్యలో ఏనుమాముల మార్కెట్‌ వద్ద రోడ్డు పక్కన కాపుకాసిన అగంతకుల్లో ఒకరు ఎదురువచ్చి, కడుపునొప్పితో విలవిలాడుతున్నట్టు నటించాడు. నిజమేనని నమ్మిన నారాయణ ఆగి పరీక్ష చేస్తుండగా వెనుక నుంచి ఆయనపై తూటాల వర్షం కురిసింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. నారాయణ హత్యావార్త దావానలంలా వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిమంది తరలివచ్చి నిరసన ప్రకటించారు. మొగిలిచెర్ల సంఘటన తాలూకూ అమానవీయ దృశ్యంతో ప్రజల మ నుసుకు కలిగిన గాయం అప్పటికీ పచ్చిగానే ఉంది.