డాక్టర్లకు వైద్యం చేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-06-10T05:30:00+05:30 IST

కరోనా సమయంలో వెంటాడుతున్న అతిపెద్ద సమస్య... మానసిక ఒత్తిడి. సామాన్యుడే కాదు... అనుక్షణం రోగితోనే ఉండి కరోనాతో యుద్ధం చేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు. మృత్యువుతో పోరాడి గుండె ఆగిపోయిన దృశ్యాలెన్నిటినో చూసి మనోవేదనకు

డాక్టర్లకు వైద్యం చేస్తున్నారు!

కరోనా సమయంలో వెంటాడుతున్న అతిపెద్ద సమస్య... మానసిక ఒత్తిడి. సామాన్యుడే కాదు... అనుక్షణం రోగితోనే ఉండి కరోనాతో యుద్ధం చేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు. మృత్యువుతో పోరాడి గుండె ఆగిపోయిన దృశ్యాలెన్నిటినో చూసి మనోవేదనకు గురవుతున్నారు. మరి వారిని పట్టించుకొనేది ఎవరు? మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధిక బపట్‌. 500లకు పైగా నిపుణులతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ మనసు గాయాలకు మందు వేస్తున్నారు.


‘‘మార్చి మాసం... చివరి వారం... కరోనా రెండో దశ.... దేశమంతటా ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. నిరంతరం కొవిడ్‌ రోగుల సేవలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మునిగితేలుతున్నారు. ఊపిరి తీసుకొనే సమయం కూడా దొరకనంత పని. మరోపక్క మరణమృదంగం. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది... కరోనా రోగులకు చికిత్స చేస్తూ వందల మంది బలయ్యారు. ఇది నన్ను ఎంతో బాధించింది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారియర్స్‌ మనోవేదన కొంతైనా తగ్గించాలనుకున్నాను. అందులో భాగంగానే మొదట ప్రతి మంగళవారం వారి కోసం కేటాయించాను. దిగాక కానీ తెలియలేదు... తీవ్రత ఎంతో! కరోనా పేషెంట్లకు దగ్గరి నుంచి సేవలు అందించే డాక్టర్లు, థెరపిస్ట్‌లు, ఇతర విభాగాలవారు ఎంతో మంది నా అపాయింట్‌మెంట్‌ కోసం క్యూ కట్టారు. ఇది నన్ను దిగ్ర్భాంతికి గురిచేసింది.   


ఒక్కరితో అయ్యేది కాదని... 

నా దగ్గరకు వచ్చిన వైద్య సిబ్బంది తమ కష్టాలు చెబుతుంటే మన ఆరోగ్య వ్యవస్థ ఇంత దుర్భర స్థితిలో ఉందా అనిపించింది. విరామం లేని విధులు, కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రులు, మృతులను లెక్కపెట్టుకోవడం తప్ప వైద్యం అందించలేని పరిస్థితులు... ఇలాంటి విపత్కర దృశ్యాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నందుకు తమను తాము నిందించుకొంటున్నవారు ఎంతోమంది. వ్యవస్థలోని లోపాలకు తాము బలవుతున్నామని బాధపడేవారూ ఉన్నారు. వారి మనసుకు అయిన గాయాల్ని మాన్పించాలంటే వారంలో ఒక్క రోజు కేటాయిస్తేనో, నా ఒక్కదానివల్లో అయ్యే పని కాదని అర్థమైంది. 


500 మంది వాలంటీర్ల నెట్‌వర్క్‌... 

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?అని ఆలోచిస్తున్న సమయంలోనే నా సైకాలజిస్ట్‌ స్నేహితురాలు డాక్టర్‌ ఉమ సి మిల్‌నర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తను అమెరికాలోని ‘లెస్లే యూనివర్సిటీ’ సైకాలజీ అండ్‌ అప్లైడ్‌ థెరపీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. అక్కడ కూడా ఇలాంటి సమస్యలే తన దృష్టికి వచ్చాయని చెప్పింది. దీంతో ఇద్దరం కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకు ఒక వ్యవస్థ నిర్మించాలనుకున్నాం. ఆ ఆలోచనకు రూపమే ‘ఇండియర్‌’ (ఇండియన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ది డయాస్పొరా ఫర్‌ ఎసెన్షియల్‌ ఎయిడ్‌ అండ్‌ రిలీఫ్‌). ఏప్రిల్‌లో దీన్ని ప్రారంభించాం.


ఉమ అమెరికాలో ఉంటున్నా భారత కాలమానం ప్రకారం రోజుకు పన్నెండు గంటలు దీని కోసం పని చేస్తోంది. తనకు పరిచయం ఉన్న రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌ సహకారంతో 48 గంటల్లోనే 200 మందికి పైగా వాలంటీర్లను మా నెట్‌వర్క్‌లో చేర్పించింది. ఇద్దరం కలిసి వారంలో ఏడు వందలకు పైగా వాలంటీర్లను ఇందులో భాగస్వాములను చేయగలిగాం. వీరిలో వివిధ దేశాలకు చెందిన సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్లు, థెరపిస్ట్‌లు, సోషల్‌ వర్కర్లు, రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌... ఒకరేమిటి అన్ని విభాగాలవారూ ఉన్నారు. కేవలం మానసిక నిపుణులే 507 మంది. 


సేవలు ఎలా పొందాలంటే... 

‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ) ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం కరోనా సెకండ్‌వేవ్‌లో 513 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇది అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మా సేవలు ప్రారంభించాం. ఈ సేవలు పొందాలనుకొనే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ‘ఇండియర్‌.ఆర్గ్‌’లోకి వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అంటే వైద్య సిబ్బంది, పాత్రికేయులు, బ్యాంకర్లు, టీచర్లు, పోలీస్‌లు, కరోనా వాలంటీర్లు. ఒక సెషన్‌ 30 నిమిషాలు నడుస్తుంది. కరోనా బారిన పడ్డ కుటుంబాలకు గ్రూప్‌ సెషన్స్‌ కూడా ఉన్నాయి. యూజర్లు చెప్పింది శ్రద్ధగా విని, నిపుణులు తగిన సలహాలు ఇస్తారు. అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. భావోద్వేగాలతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఎంతో జాగ్రత్తగా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. మా సేవల్ని ‘మానసిక అత్యవసర చికిత్స’ (సైకలాజికల్‌ ఫస్ట్‌ఎయిడ్‌: పీఎఫ్‌ఏ)గా పేర్కొంటున్నాం. దీని కోసం ఎలాంటి చార్జీ వసూలు చేయడంలేదు. 


ఆమెకు ఆమే సాటి... 

పుణెకు చెందిన డాక్టర్‌ రాధిక బపట్‌ అంతర్జాతీయంగా పేరు పొందిన సైకాలజిస్ట్‌. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ సైన్స్‌’ నుంచి ‘యంగ్‌ ఎమర్జింగ్‌ సైకాలజిస్ట్‌’ అవార్డ్‌ పొందారు. నెదర్లాండ్స్‌లోని ప్రతిష్టాత్మక ‘లైడెన్‌ యూనివర్సిటీ’లో సోషల్‌ బిహేవియరల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఆమె న్యూయార్క్‌లోని ‘ఆల్బర్ట్‌ ఎలిస్‌ ఇనిస్టిట్యూట్‌’లో శిక్షణ తీసుకున్నారు. అవార్డులెన్నో గెలుచుకున్నారు. దేశవిదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో గౌరవ ఉపన్యాసాలు ఇచ్చారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైకాలజీ విభాగ అధిపతిగా సేవలు అందించారు.


ముందుకు సాగితేనే మనుగడ... 

‘పీఎఫ్‌ఏ’ లక్ష్యం ఒక్కటే... ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా దిగ్ర్భాంతికి లోనవుతారు. అంతులేని దుఃఖం, మానసిక ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ముఖ్యంగా ఒకరి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించి విఫలమైతే ఆ బాధ మరింత తీవ్రంగా, గుండెల్ని పిండేస్తుంది. శరీరానికి గాయమైతే మందులతో మాన్పవచ్చు. కానీ ఇది మనసుకు తగిలిన గాయం. భావోద్వేగాలతో ముడిపడిన ఇలాంటి సందర్భాల్లో ముందుగా చేయాల్సింది వారిని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రించడం. ఇవన్నీ వృత్తిగత జీవితంలో భాగమేనని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని చెబుతాం. ఇక్కడ కష్టమైన అంశమేమంటే... కౌన్సెలింగ్‌ సమయంలో భావోద్వేగాలకు గురికాకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం. మా సేవలు ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం తదితర 20 భాషల్లో అందిస్తున్నాం. 

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST