Abn logo
Jun 30 2020 @ 00:00AM

భయం వద్దు... భరోసా ఉంది!

  • రేపు జాతీయ వైద్యుల దినోత్సవం


కరోనా కాలం ఇది! కరోనా నుంచి రక్షణలో భాగంగా.... కొన్ని చికిత్సలు వాయిదా పడ్డాయి, కొందరి ఆరోగ్య స్థితులు ప్రశ్నార్ధకంగా మారాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో ఎలాంటి వైద్యాన్ని ఆశ్రయించాలో తెలియని అయోమయమే అంతటా! ఇలాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులకు అనుభవజ్ఞులైన వైద్యులు సూచిస్తున్న పరిష్కారాల మార్గాలు...ఓల్డేజ్‌ కేర్‌


కరోనా వైరస్‌ను ఎంత కాలం భరించాలి? 

టీకా కనుగొనేలోపు దీని నుంచి రక్షణ పొందే మార్గాలేవి? 

పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


కరోనా సమూలంగా అంతరించిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో మసలుకోక తప్పదు. ఈ వైరస్‌ నుంచి రక్షణ కల్పించే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నా, టీకా కనుగొనడానికి కనీసం రెండేళ్లు పట్టవచ్చని శాస్త్రవేత్తల అంచనా! అయితే అంతమాత్రాన కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో బతకడం సరి కాదు. ఆ వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. 

  1. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యాధినిరోధకశక్తి పెంచుకునే అలవాట్లు అలవరుచుకోవాలి. 
  2. ఎక్కువసేపు కదలకుండా కూర్చునే జీవనశైలి మార్చుకుని, రోజులో కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. 
  3. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. 
  4. వ్యాధినిరోధకశక్తి ఒకటి రెండు రోజుల్లో చేకూరదు. అందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఇందుకోసం క్రమబద్ధమైన జీవనశైలిని ఇప్పటినుంచే మొదలుపెట్టాలి.  మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పెద్దల విషయంలో తలెత్తే చిన్నా చితకా రుగ్మతలను అలక్ష్యం చేయకూడదు. జలుబును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అది అలర్జీకి సంబంధించినదీ, కానిదీ కచ్చితంగా నిర్ధారించుకోవలసిందే! సాధారణంగా అలర్జీకి సంబంధించిన జలుబు మందులు వాడితే రెండు రోజుల్లో అదుపులోకి వస్తుంది. అవసరమైతే యాంటీ బయాటిక్‌ మందులు కూడా వాడవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత సమయంలో పెద్దల్లో కనిపించే లక్షణాలు కరోనాకు సంబంధించనవి కావని నిర్ధరించుకోవడం కోసం కరోనా పరీక్ష చేయంచక తప్పదు. అయితే పరీక్ష కోసం తీసుకువెళ్లేటప్పుడు వైరస్‌ సోకకుండా సామాజిక దూరం పాటించడం, ఎన్‌ 95 మాస్క్‌ ధరించడం లాంటి జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఫలితాన్ని బట్టి వైద్యులు సూచించే చికిత్సను ఇప్పించాలి. 
  5. ఇక పెద్దలు ఇంట్లో ఉన్నప్పుడు, మిగతా కుటుంబసభ్యులందరూ రెట్టింపు అప్రమత్తంగా వ్యవహరించాలి. 
  6. కరోనా సోకే వీలు లేకుండా, వారి కోసం ప్రత్యేక గది కేటాయించాలి. తరచుగా ఇతరులు ఆ గదిలోకి వెళ్లి, వారితో దగ్గరగా మసలడం లాంటివి చేయకూడదు. 
  7. కుటుంబంలో యుక్తవయసులో ఉన్న ఒక వ్యక్తి వారి బాగోగులు చూసుకోవాలి. 
  8. పెద్దలతో దగ్గరగా మసలేటప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. వారు ఉండే గది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. - వారు అత్యవసరమైతే తప్ప గది దాటి బయటకు రాకుండా చూసుకోవాలి. పెద్దల విషయంలో ఈ జాగ్రత్తలు కరోనా వాతావరణం సద్దుమణిగే వరకూ పాటించక తప్పదు.

-డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు

రేడియాలజిస్ట్‌


గైనిక్‌ కేర్‌


కరోనా భయానక వాతావరణం సద్దుమణిగే సమయం కనుచూపుమేరలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో నవదంపతులమైన మేం సంతానం పొందడానికి ఎలా ప్లాన్‌ చేసుకోవాలి? అసలు ఈ వాతావరణంలో గర్భం దాల్చడం సరైన నిర్ణయమేనా? 


గర్భిణుల మీద కరోనా ప్రభావం గురించి ఇప్పటివరకూ కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే ఈ మహమ్మారి ఎప్పటికి అంతం అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి కొత్తగా పెళ్లైన 30 ఏళ్ల లోపు వారు ఆలస్యం చేయకుండా, గర్భం దాల్చడమే మేలు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నా, వాటికీ చికిత్సలు ఉన్నాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ విడాకులు తీసుకుని, రెండవ పెళ్లితో గర్భం దాల్చాలనుకునేవాళ్లు, ఆలస్యంగా కరోనా తీవ్రత తగ్గిన తర్వాత గర్భం దాల్చాలనుకునే 40 ఏళ్లు పైబడిన మహిళలు ‘ఊసైట్‌ ఫ్రీజింగ్‌’ విధానాన్ని ఆశ్రయించవచ్చు.


పెరిగే వయసుతో పాటు అండాల నాణ్యత తగ్గుతుంది కాబట్టి అండాలను నిల్వ చేసుకుని, తర్వాత గర్భం దాల్చే ఊసైట్‌ ఫ్రీజింగ్‌ వెసులుబాటును ఎంచుకోవచ్చు. అలాగే కరోనా ప్రభావం నుంచి తప్పించుకుని, పండంటి బిడ్డను ప్రసవించాలి అనుకుంటే, గర్భం దాల్చిన తర్వాత గర్భస్థ పిండాన్ని క్రయోజెనిక్‌ పద్ధతిలో ఫ్రీజ్‌ చేసే విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఈ విధానంతో కరోనా తీవ్రత తగ్గేవరకూ ఆగి, తర్వాత పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టి, సహజసిద్ధంగా బిడ్డను కనే వీలుంది. ఇది సురక్షితమైనదని రుజువు కూడా అయింది. కాబట్టి ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఏది ఏమైన ఈ కరోనా కాలంలో గర్భిణిలు రెట్టింపు జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండాలి.


-డాక్టర్‌ శశికళ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌


కేన్సర్‌ కేర్‌


కేన్సర్‌ వైద్యంలో కీమోథెరపీకి వాడే మందులకు లాక్‌డౌన్‌ కారణంగా కొరత ఉంది. ఇలాంటప్పుడు సమయానికి కీమో అందుతుందా, లేదా? అని భయంగా ఉంది!


లాక్‌డౌన్‌, తదనంతర పరిణామాలకు తగ్గట్టు కేన్సర్‌ రోగులకు కీమోథెరపీ చికిత్సలో వైద్యులు కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఇంజెక్షన్‌ కీమోథెరపీ మందుల విషయంలో ఓ ప్రాధాన్య క్రమాన్ని వైద్యులు అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంకాలజీలు కొన్ని మార్గదర్శకాలను సూచించాయి. వీటి ప్రకారం తీవ్రం, మధ్యస్థం, స్వల్పం.... ఇలా వ్యాధి త్రీవతలను బట్టి రోగులను వర్గీకరించి, ఆ క్రమంలో కీమోథెరపీ చికిత్సలో ప్రాధాన్యక్రమాన్ని పాటిస్తున్నాం. ఉదాహరణకు... కొత్తగా కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ జరిగిన రోగుల కంటే పూర్వం నుంచీ కేన్సర్‌ చికిత్స పొందుతున్న రోగులకే కీమోథెరపీ ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. చికిత్స కోసం వేచి ఉంచదగిన రోగులు, ప్రత్యామ్నాయ మందులతో వ్యాధిని అదుపులో ఉంచదగిన రోగులు... ఇలా కేన్సర్‌ రోగులను వర్గీకరించి చికిత్స అందిస్తున్నాం. కొంతమంది రోగుల్లో కేన్సర్‌ శరీరమంతా పాకిపోయి ఉండవచ్చు. ఇలాంటప్పుడు వీరికి కీమో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరికైతే కీమోతో ప్రయోజనం ఉంటుందో, ఎవరికైతే కీమో ఇవ్వడం అత్యవసరమో, వారికే ప్రాధాన్యం ఇచ్చే పద్ధతిని అనుసరిస్తున్నాం. చిన్న కేన్సర్‌ కణితి ఉండి, సర్జరీతో దాన్ని తొలగించిన వారికి ఇంజెక్షన్‌ కీమో థెరపీకి బదులుగా టెమాక్సిఫీన్‌, లిట్రజాల్‌ అనే ప్రత్యామ్నాయ నోటి మాత్రలు సూచిస్తున్నాం. ఇలా హై రిస్క్‌, ఇంటీర్మీడియట్‌ రిస్క్‌, లో రిస్క్‌... మూడు విభాగాలుగా రోగులను విభజించి, అందుకు తగ్గట్టు కీమోథెరపీని అందిస్తున్నాం. కాబట్టి రోగులు కీమోథెరపీ గురించి కంగారుపడవలసిన అవసరం లేదు. 


-డాక్టర్‌ సచిన్‌ మర్ద,  బ్రెస్ట్‌ కేన్సర్‌ స్పెషలిస్ట్‌, హైదరాబాద్‌


ఫిజియోథెరపీ


కీళ్ల మార్పిడి సర్జరీ తర్వాత తప్పనిసరిగా కొంత కాలం ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. అయితే కరోనా సోకుతుందనే కారణంతో ఫిజియోథెరపీ సెంటర్లకు వెళ్లలేని వాళ్లం ఏం చేయాలి? ఇంట్లోనే ఈ వ్యాయామాలు చేసుకునే వీలుందా? 


కీళ్ల మార్పిడి సర్జరీలు చేయించుకున్న వారికీ, వారి కుటుంబసభ్యులకూ సర్జరీ తర్వాత ఇంట్లో ఎలాంటి ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయాలో వైద్యులు వివరిస్తారు. అలాగే నేరుగా ఇంటికే ఫిజియోథెరపిస్టులను పంపించి, వ్యాయామాలు సాధన చేయించే సేవలనూ ఆస్పత్రులు అందిస్తున్నాయి. ఒకవేళ ఫిజియోథెరపిస్టులు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, ఆ కోవకు చెందిన వారికి, వీడియో కాల్‌ ద్వారా ఫిజియోథెరపీ వ్యాయామాల సూచనలను వైద్యులు అందిస్తున్నారు. అలాగే ఫిజియోథెరపీ వ్యాయామాలకు సంబంధించిన ప్రింటెడ్‌ మెటీరియల్‌, వ్యాయామాలతో కూడిన వీడియోలు తీయించి, ఆ వీడియో క్యాప్సూల్స్‌ను వైద్యులు రోగులకు అందిస్తున్నారు. అయితే ఫిజియోథెరపిస్ట్‌ చేయించే వ్యాయామాలకూ, సొంతంగా చేసే వ్యాయామాలకూ స్వల్పంగా తేడా ఉండవచ్చు. అయినా కీళ్ల కదలికలు ముఖ్యం కాబట్టి, ఇంట్లో కుటుంబసభ్యులు చేయించే వ్యాయామాలు కూడా ఫలితాన్ని చూపిస్తాయి. కాబట్టి కీళ్ల మార్పిడి చేయించుకున్నవాళ్లు, ఇతరత్రా ఎముకల సంబంధిత వ్యాయామాలు అవసరమైన వాళ్లు వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసుకోవచ్చు.


-డాక్టర్‌ గురవారెడ్డి, చీఫ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌


డెంటల్‌ కేర్‌


పిప్పిపళ్లకు రూట్‌ కెనాల్‌ ట్రీట్మెంట్‌ అవసరమన్నారు. నోట్లో పరికరాలు జొప్పించి చేసే దంత చికిత్సల ద్వారా కరోనా సోకుతుందేమో అని భయంగా ఉంది. దాంతో చికిత్సను వాయిదా వేసుకోలేక, కరోనా భయంతో చికిత్స తీసుకోలేక నరకయాతన పడుతున్నా. ఏం చేయమంటారు? 


తట్టుకోలేనంత నొప్పి ఉండే దంత సమస్యలకు తక్షణ చికిత్సలు అందించడానికి వీలుగా డెంటల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికన్‌ డెంటల్‌ అసోసియేషన్‌లు కొన్ని మార్గదర్శకాలను సూచించాయి. శరీరాన్ని పూర్తిగా కప్పే పి.పి.ఇ సూట్‌, ముఖానికి మాస్క్‌, ఫేస్‌ షీల్డ్‌ వైద్యులు తప్పనిసరిగా ధరించి వైద్యం చేసే విధానాన్ని అనుసరిస్తున్నాం. వరుసగా రోగులను పరీక్షించేటప్పుడు, ఒకరి నుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్‌ సోకే వీలు లేకుండా కొన్ని నియమాలూ పాటిస్తున్నాం. సర్ఫేస్‌ డిస్‌ ఇన్‌ఫెక్షన్‌, డీ ఫాగింగ్‌ (ఫ్లోరిన్‌ డయాక్సైడ్‌, లేదా సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌లతో) చేయడం వల్ల ఉపరితలాలు, పరిసరాల్లోని గాలిలో కలిసిన కరోనా వైరస్‌ మరణిస్తుంది. అలాగే అలా్ట్రవయొలెట్‌ కిరణాలతో, హెపాఫిల్టర్స్‌, నెగిటివ్‌ అయాన్‌ రిలీజ్‌లతో దంత చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్‌ చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి దంత చికిత్సల గురించీ భయపడవలసిన అవసరం లేదు. కరోనా వ్యాపించిన ప్రారంభంలో రూట్‌కెనాల్‌ ట్రీట్మెంట్‌ అవసరమైన సందర్భాల్లో ఏకంగా దంతాన్ని పీకేసే చికిత్సను అనుసరించాం. కానీ ఇప్పుడు ఈ సౌలభ్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీకు అవసరమైన చికిత్సను నిర్భయంగా చేయించుకోవచ్చు. కాబట్టి కరోనా సోకుతుందనే భయాన్ని వీడి, వెంటనే చికిత్స చేయించుకోండి.


-డాక్టర్‌. వికాస్‌ గౌడ్‌, దంత వైద్యులు


మెంటల్‌ కేర్‌


కరోనాతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమవడం, ఆర్థిక ఒడుదొడుకులు మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనసుకు సాంత్వన చేకూరాలంటే ఏం చేయాలి? 


మానసిక ఒత్తిడి తొలగడం కోసం సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రత్యేకంగా రూపొందిన యోగా సాధన సింహక్రియ. దీనికి పట్టే సమయం కేవలం మూడు నిమిషాలే! ఈ క్రియను సాధన చేయడం వల్ల శ్వాసవ్యవస్థ బలపడడంతో పాటు, వ్యాధినిరోధకశక్తి కూడా మెరుగవుతుంది. కాబట్టి కరోనా వైరస్‌ను కట్టడి చేయవలసిన ఈ సమయంలో రోజుకు రెండు నుంచి మూడుసార్లు సింహ క్రియ సాధన చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈషా క్రియ, ఈషా ఉపయోగ, ఇన్‌ఫినిటీ మెడిటేషన్‌లు కూడా కలిపి సాధన చేస్తే రెట్టింపు ప్రయోజనం దక్కుతుంది. ఈషా ఉపయోగ సాధనలో భాగంగా డైరెక్షనల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్మ్‌, నెక్‌ ప్రాక్టీసెస్‌, యోగనమస్కార్‌, నాడీ శుద్ధి, నాదయోగ వ్యాయామాలు ఉంటాయి. ఈ వ్యాయామాల తర్వాత ఈషా క్రియ, సింహ క్రియ, ఇన్‌ఫినిటీ మెడిటేషన్‌లను వరుస క్రమంలో సాఽధన చేయాలి. ఈ వ్యాయామాలన్నింటికీ 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఒకేసారి వ్యాయామాలన్నీ చేసే సమయం లేనివారు రోజులో వీలున్న సమయాల్లో, వీటిని విడివిడిగా కూడా సాధన చేయవచ్చు. 


-ఉషా ముర్తినేని హఠయోగా శిక్షకులు


సెక్సువల్‌ కౌన్సెలింగ్‌


లైంగిక కలయికతో కరోనా వైరస్‌ సోకే వీలుందా? ఒకవేళ ఈ వైరస్‌ సోకినా లక్షణాలు బయల్పడకుండా, అంతర్గతంగా లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వీలుందా? వీర్యకణాలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు లాంటివి కరోనా ప్రభావాలుగా భావించవచ్చా? 

కరోనా ఏ మేరకు ఆరోగ్యవంతుల లైంగిక ఆరోగ్యం మీద ప్రభావం చూపించగలదు? 


కరోనా వైరస్‌ లైంగిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే పూర్తి ఆరోగ్యవంతులకు కరోనా సోకినా దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బయల్పడవచ్చు, బయల్పడకపోవచ్చు. అయితే ఈ లక్షణాలు బయల్పడనంత మాత్రాన కరోనా ఆరోగ్యాన్ని నష్టపరచలేదని అనుకోవడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఈ వైరస్‌ పురుషుల్లో అంతర్గతంగా వారి వృషణాల మీద ప్రభావం చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఫలితంగా పురుష హార్మోన్లలో హెచ్చుతగ్గులు, తత్ఫలితంగా అంగస్తంభన సమస్యలు, వీర్యకణాల సంఖ్య తగ్గుదల లాంటివి చోటుచేసుకుంటాయి. కాబట్టి ఈ ఇబ్బందులు తలెత్తితే, కరోనా సోకిందని భావించి వైద్యులను కలిసి హార్మోన్‌ పరీక్ష, వీర్య పరీక్ష చేయించుకోవడం అవసరం. ఈ రెండు సమస్యలకూ సమర్థమైన చికిత్సలు ఉన్నాయి. కాబట్టి అంతకు ముందు లేని లైంగిక సమస్య కొత్తగా తలెత్తితే వైద్యులను కలిసి, చికిత్స తీసుకోవాలి.


-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌


Advertisement
Advertisement
Advertisement