వారి త్యాగాన్ని గుర్తించండి!

ABN , First Publish Date - 2020-03-21T06:17:51+05:30 IST

కరోనా... ఈ పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే వేలాది మందిని బలిగొన్న ఈ వైరస్‌ ఇంకా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా రోగులను నిత్యం పర్యవేక్షిస్తున్న డాక్టర్లు, నర్సుల మీద పనిభారం రెండింతలయ్యింది

వారి త్యాగాన్ని గుర్తించండి!

కరోనా... ఈ పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే వేలాది మందిని బలిగొన్న ఈ వైరస్‌ ఇంకా ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా రోగులను నిత్యం పర్యవేక్షిస్తున్న డాక్టర్లు, నర్సుల మీద పనిభారం రెండింతలయ్యింది. ఈ మధ్యనే కరోనా సోకిన వాళ్లకు క్వారెంటైన్‌ సెంటర్‌లో సేవలు చేస్తూ అలసిపోయి కంప్యూటర్‌ కీ బోర్డ్‌ మీదే నిద్రించిన ఇటలీకి చెందిన నర్స్‌ ఫోటో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్య చికిత్స అందిస్తున్న ఒక డాక్టర్‌ భార్య ట్విట్టర్‌ వేదికగా కరోనా వైరస్‌ ఉనికి తెలిసిన రోజు నుంచి తమ జీవితం ఎలా మారిపోయిందో పంచుకున్నారిలా...

అమెరికాలోని అట్లాంటాలో ఉండే రేచల్‌ పాట్జర్‌ భర్త వృత్తిరీత్యా డాక్టర్‌. కోవిడ్‌-19 వైరస్‌ వెలుగులోకి రావడం మొదలు వారి కుటుంబ జీవితం ఎలా మారిందో ఆమె ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. ‘‘మావారు ఎమర్జెన్సీ విభాగంలో ఫిజీషియన్‌. కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. దాంతో కష్టమైనప్పటికీ కుటుంబమంతా ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందరం మా గ్యారేజీలోని అపార్ట్‌మెంట్‌కు మారాం. ఆయన మాత్రం కరోనా రోగులకు వైద్యం చేస్తూ అక్కడే ఉంటున్నారు’’ అని ఆవేదనతో తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు హెల్త్‌ సర్వీస్‌ రీసెర్చర్‌గా ఉన్న రేచల్‌. 


ఆవేదన, బాధ్యత కలగలసిన ట్వీట్‌...

రేచల్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో మూడు వారాల వయసున్న బాబు ఉన్నాడు. తన పిల్లలకు కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేచల్‌. ‘‘మావారు మా చిన్న బాబును మురిపెంగా ఎత్తుకొని, పెద్ద పిల్లలతో సరదాగా ఆడుకునేందుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అని ఆలోచిస్తే బాధేస్తోంది. వైద్యరంగంలో ఉన్నవారు ప్రజల కోసం చేసే త్యాగానికి ఇదొక ఉదాహరణ. అందరూ కరోనా వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. తమ కుటుంబానికి దూరంగా ఉంటూ రేయింబవళ్లు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సుల త్యాగాన్ని గుర్తించండి. వారికి తప్పకుండా థ్యాంక్స్‌ చెప్పండి’’ అని ట్విట్టర్లో రేచల్‌ చేసిన పోస్ట్‌ ఎంతోమందిని కదిలించింది. ఆవేదన, సామాజిక బాధ్యతతో కూడిన ఆమె ట్వీట్‌ను 5 లక్షల మందికి పైగా లైక్‌ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌ అయింది. వేలాది మంది ఆమె భర్తకు ‘థ్యాంక్స్‌’ చెబుతూ కామెంట్లు పెట్టారు. 

Updated Date - 2020-03-21T06:17:51+05:30 IST