ఆశలు వదులుకోండి.. అవయవాలు దానం చేయండని డాక్టర్లే చెప్పారు.. కానీ ఐదేళ్ల తర్వాత ఈ నటి పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2021-08-14T00:13:35+05:30 IST

ఆమె ఒక నటి. డ్యాన్స్ కొరియోగ్రాఫర్. తన డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె.. ఇప్పుడు మంచానికే పరిమితమైంది.

ఆశలు వదులుకోండి.. అవయవాలు దానం చేయండని డాక్టర్లే చెప్పారు.. కానీ ఐదేళ్ల తర్వాత ఈ నటి పరిస్థితి ఎలా ఉందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఒక నటి. డ్యాన్స్ కొరియోగ్రాఫర్. తన డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె.. ఇప్పుడు మంచానికే పరిమితమైంది. ఆమె పేరు డాలీ బెర్రీ మీర్చందానీ. ఆమె మళ్లీ మామూలు మనిషి అవడానికి ఎటువంటి ఛాన్స్ లేదని డాక్టర్లు తేల్చేశారు. ఆమె అవయవాలు దానం చేస్తే మరో నలుగురి ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని ఆ కుటుంబానికి చెప్పారు. కానీ డాలీ కుటుంబం దానికి అంగీకరించలేదు. డాలీ బాగోగులు తామే చూసుకుంటామని చెప్పి ఇంటికి తెచ్చేసుకున్నారు. అప్పటి నుంచి డాలీ మంచానికే పరిమితమై ఉంది.


భారీ పాత్రలు, అద్భుతమైన గుర్తింపు లేకపోయినా.. సాఫీగా తన జీవితం సాగిపోతుంది. అలాంటి సమయంలో 2015లో నితిన్ మీర్చందాని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి ఆమె జీవితాన్ని దుర్భరం చేసింది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే. భర్త ఆమెను మానసికంగా చాలా హింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆమె నెల తప్పింది. 2016 ఫిబ్రవరిలో గర్భస్రావమైపోయింది. దీంతో ఆమె మానసికంగా మరింత డిస్టర్బ్ అయింది. ఈ క్రమంలో డాలీ పుట్టినరోజు జరుపుకోవడానికి చెల్లెళ్లు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.


అలా తీసుకొచ్చిన సమయంలోనే మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉన్న డాలీ.. బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది. ఆమె బ్రతికే ఉంది కానీ, కదల్లేని పరిస్థితి. డాలీ మామూలు మనిషి అవడం జరగదని డాక్టర్లు కూడా తేల్చేశారు. ఆమె అవయవాలు ఎవరికైనా దానం చేసేస్తే మంచిదని సూచించారు. కానీ డాలీ కుటుంబం మాత్రం దీనికి అంగీకరించలేదు. ఆమెను తామే చూసుకుంటామని చెప్పి ఇంటికి తీసుకొచ్చేశారు.


ఐదేళ్లుగా డాలీ మంచానికే పరిమితమైంది. ఒకప్పుడు నవ్వుతూ తుళ్లుతూ అల్లరిగా తిరిగిన ఆమె.. ఇప్పుడు ఎలుకలు వచ్చి తన చెవులు కొరుకుతున్నా కదల్లేని స్థితిలో ఉంది. ఎలుకలు కొరికిన గాయాలకు చీమలు పట్టి పీకుతున్నా కనీసం చిన్న శబ్దం కూడా చేయడం లేదు. ఇది చూసిన డాలీ తల్లి, చెల్లెళ్లకు ఏడుపొక్కటే తక్కువ. ఎలుకలు డాలీ వద్దకు రాకుండా ఉండేందుకు తాము ఆమె పక్కనే పడుకోవడం అలవాటైపోయిందని డాలీ చెల్లెళ్లు చెప్తున్నారు.


ఈ క్రమంలో డాలీ భర్త నితిన్‌పై కూడా ఈ కుటుంబం కేసు వేసింది. ఈ ప్రమాదం తర్వాత డాలీ 60 రోజులపాటు కోమాలో ఉంది. ఆ తర్వాత మరో నెలరోజులు ఆక్సిజన్ సప్లై ఇవ్వాల్సి వచ్చింది. దీనంతటికీ కలిపి మొత్తం రూ.25 లక్షల బిల్లు అయింది. ఆ తర్వాత ప్రతినెలా ఆమె చికిత్స కోసం రూ.50వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలా 2016 సెప్టెంబరు నుంచి 2020 ఆగస్టు వరకూ జరిగింది. ప్రతిరోజూ వైద్యులు ఇంటికొచ్చి డాలీ కాళ్లూ చేతులు కదిలిస్తూ ఫిజియోథెరపీ ఇచ్చేవారు. కరోనా కారణంగా దీన్ని కూడా గతేడాది ఆపేశారు.

Updated Date - 2021-08-14T00:13:35+05:30 IST