కరోనా టెస్ట్ కోసం స్వాబ్ తీశారు.. పనికిరాలేదని చెప్పడం మరిచారు.. వైద్యం అందక..!

ABN , First Publish Date - 2020-07-23T17:49:20+05:30 IST

‘ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని అత్యవసర వైద్యం కోసం రుయాస్పత్రికి వచ్చాం. కొవిడ్‌ పరీక్షలకని స్వాబ్‌ తీశారు. ఆ రిపోర్టు కోసం నాలుగు రోజులు వైద్యం చేయలేదు. దీంతో మా నాన్న చనిపోయాడు.

కరోనా టెస్ట్ కోసం స్వాబ్ తీశారు.. పనికిరాలేదని చెప్పడం మరిచారు.. వైద్యం అందక..!

ఆ స్వాబ్‌ పనికిరాలేదట..! 

సకాలంలో చెప్పక.. అత్యవసర వైద్యం అందక 

రుయాలో మృతి చెందిన జిల్లావాసి 

రెండు రోజులుగా మృతదేహం నుంచి స్వాబ్‌ సేకరించని వైనం 


తిరుపతి/కడప(ఆంధ్రజ్యోతి): ‘ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని అత్యవసర వైద్యం కోసం రుయాస్పత్రికి వచ్చాం. కొవిడ్‌ పరీక్షలకని స్వాబ్‌ తీశారు. ఆ రిపోర్టు కోసం నాలుగు రోజులు వైద్యం చేయలేదు. దీంతో మా నాన్న చనిపోయాడు. కనీసం వెంటిలేటర్‌ పెట్టున్నా బతికేవాడు’ అంటూ సురేష్‌ బుధవారం ఆవేదన వ్యక్తంచేశారు. బాధితుడు తెలిపిన ప్రకారం.. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ నంద్యాల చెంగయ్య బీపీ, షుగర్‌తో బాధపడుతూ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి వచ్చారు. ఆయన కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని ఆ డాక్టరు రుయాస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో ఈనెల 17న రుయా అత్యవసర విభాగానికి వచ్చారు. అప్పటికే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో కొవిడ్‌ నిబంధనల మేరకు సస్పెక్టెడ్‌ వార్డుకు రెఫర్‌ చేశారు. స్వాబ్‌ తీసి ల్యాబ్‌కు పంపించారు. 


రిపోర్టు వచ్చాక వైద్యం అందిస్తామని డాక్టర్లు చెప్పారు. నాలుగు రోజులైనా రిపోర్టు రాలేదు. అదే సమయంలో చెంగయ్యకు శ్వాస సమస్య ఎక్కువై మంగళవారం సాయంత్రం మృతి చెందారు. కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు ఉంటేనే మృతదేహం ఇస్తామని డాక్టర్లు స్పష్టం చేశారు. రిపోర్టుకోసం ల్యాబ్‌కు వెళ్లి అడగ్గా.. ఆ పేరుతో స్వాబ్‌ రాలేదని చెప్పారు. సస్పెక్టెడ్‌ వార్డులో డాక్టర్లను అడగ్గా 17వ తేది శాంపిళ్లు పనికిరాకుండా పోయాయని, మళ్లీ స్వాబ్‌ ఇవ్వాలని చెప్పారు. రెండోసారి స్వాబ్‌ తీసుకునేందుకు బుధవారం రాత్రి వరకు ఎవరూ రాలేదని సురేష్‌ అన్నారు. ‘అత్యవసర వైద్యం కోసం వస్తే.. సకాలంలో స్వాబ్‌ తీసుకున్నా పంపలేదు. సత్వరం చికిత్స అందించలేదు. కనీసం వెంటిలేటర్‌ పెట్టున్నా మా నాన్న బతికుండేవాడు’ అంటూ ఆయన వాపోయారు. కాగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు మృతిచెందిన చెంగయ్యకు రెండోసారి శ్వాబ్‌ ఎప్పుడు తీస్తారో? మృతదేహం ఎప్పుడిస్తారో? అని కుటుంబీకులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. 

Updated Date - 2020-07-23T17:49:20+05:30 IST