తొమ్మిదేళ్ల బాలికకు కడుపు నొప్పి.. మొదట తేలిగ్గా తీసుకున్నారు.. చివరగా పెద్దాసుపత్రిలో చూపిస్తే అసలు విషయం తెలిసింది...

ABN , First Publish Date - 2021-12-01T21:56:54+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల బాలికకు చాలా ఏళ్లుగా కడుపు నొప్పి ఉంది. మొదట్లో తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. అయితే...

తొమ్మిదేళ్ల బాలికకు కడుపు నొప్పి.. మొదట తేలిగ్గా తీసుకున్నారు.. చివరగా పెద్దాసుపత్రిలో చూపిస్తే అసలు విషయం తెలిసింది...
ప్రతీకాత్మక చిత్రం

ఏమవుతుందిలే అనుకుని తేలిగ్గా తీసుకునే సమస్యలు.. ఒక్కోసారి చాలా పెద్దవి అవుతుంటాయి. మొదట్లోనే మేలుకుంటే రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. కానీ చాలా మంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తీరా సమస్య ముదిరిపోయాక.. వైద్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా ప్రాణాలు దక్కుతాయని గ్యారంటీ ఉండదు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే... ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల బాలికకు చాలా ఏళ్లుగా కడుపు నొప్పి ఉంది. మొదట్లో తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. అయితే సమస్య రోజురోజుకూ పెరుగుతుండడంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరిశీలించిన వైద్యులు షాక్ అయ్యారు... వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు చిన్నప్పటి నుంచీ కడుపు నొప్పి ఉంది. సాధారణంగా వచ్చే నొప్పి అనుకుని, మొదట్లో టాబ్లెట్స్ మింగించేవారు. తగ్గుతూ పెరుగుతూ ఉండడంతో.. స్థానికంగా ఉండే చిన్న చిన్న వైద్యులకు చూపించారు. వారు ఇచ్చిన టాబ్లెట్స్ రోజూ మింగిస్తూ ఉండేవారు. కొన్నాళ్లు తగ్గినా.. మళ్లీ నొప్పి తిరగబెడుతుండేది. మధ్య మధ్యలో నాటు మందులు తినిపించేవారు. మూఢనమ్మకాలతో భూత వైద్యులను సంప్రదించి, ఏవేవో పూజలు కూడా చేయిస్తుండేవారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండేది కాదు. ఇలా తొమ్మిదేళ్ల వరకు ఆ బాలిక నరకయాతన అనుభవించింది.


ఇటీవల ముంబైలోని సీయాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులను కలిసి, బాలిక సమస్యను వివరించారు. పరిశీలించిన వైద్యులు.. బాలికకు వివిధ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు చూసి వైద్యులే షాక్ అయ్యారు. తల్లిదండ్రులను పిలిపించి, బాలికకు వచ్చింది సాధారణ కడుపు నొప్పి కాదని.. ఆమె కడుపులో చనిపోయిన శిశువు ఉందని, దీని కారణంగానే నొప్పి వస్తోందని చెప్పారు.  ఈ మాట వినగానే బాలిక తల్లిదండ్రులు.. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నపిల్ల కడుపులో శిశువు ఉండడం ఏంటని.. వైద్యులను ప్రశ్నించారు.


బాలిక తల్లి గర్భంతో ఉన్నపుడు.. కవలలు ఉన్నారని. శిశువులు రూపాంతరం చెందుతున్న క్రమంలో ఓ శిశువు చనిపోయి.. ఇంకో శిశువులో కలిసిపోయిందని వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుందని పేర్కొన్నారు. అనంతంరం శస్త్రచికిత్స చేసి, అతి కష్టం మీద మృత శిశువును బయటికి తీశారు. మొదట్లోనే పెద్దాసుపత్రిలో చూపించి ఉంటే.. బాలికకు ఇన్నేళ్ల నరకయాతన ఉండేది కాదని ఆస్పత్రి వైద్యుడు జోషి తెలిపారు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదని బాలిక తల్లిదండ్రులకు సూచించారు.

Updated Date - 2021-12-01T21:56:54+05:30 IST