Abn logo
Jul 4 2020 @ 00:54AM

ఆద్యుడు దొడ్డి కొమురయ్య

జనగామ జిల్లాకు, ఏదైన ఒక సాగునీటి ప్రాజెక్ట్‌కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి. హైదరాబాదులో ఆయన స్మారక మందిరాన్ని నిర్మించాలి. కొమురయ్య అమరత్వం పొందిన జూలై4ను ‘అమరవీరుల దినం’గా ప్రకటించాలి.


ప్రపంచ చరిత్రలో ఏ విప్లవాన్ని, ఉద్యమాన్ని, యుద్ధాన్ని, తిరుగుబాటును చూసినా అవి రావడానికి, ఉవ్వెత్తున ఎగిసిపడడానికి, తక్షణంగా మలుపుతిప్పిన సంఘటనలు మనకు కొన్ని కనబడతాయి. అమెరికా విప్లవానికి బోస్టన్‌ టీ పార్టీ, రష్యా విప్లవానికి బ్లడీ సండే, మొదటి ప్రపంచ యుద్ధానికి ఫెర్డినాండ్‌ హత్య, 1857 సిపాయిల తిరుగుబాటుకు జంతు చర్మాన్ని తూటాలకు వాడడం ఏ విధంగా తక్షణ కారణమో అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వం అంతే కారణం. విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు, పద్దూ లేదు. పరమ కిరాతకుడు. అతని తల్లి జానమ్మ(జానకీదేవి) కొడుకును మించిన క్రూరురాలు. విసునూరు గడిలో రామచంద్రారెడ్డి, కడివెండిలో జానమ్మ వుండేవారు. అన్ని రకాలుగా ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించి, దొరసాని అని కాకుండా ప్రజలచే ‘దొర’ అని పిలిపించుకుంది. దొర గూండాల గుంపు నాయకులు మిస్కీనలీ, అబ్బాస్‌ అలీ. గ్రామంలో ఒక మందకు వెట్టిగా గొర్రె లేదా మేకను జానమ్మకు ఇచ్చే విధానాన్ని దొడ్డి గట్టమ్మ కొండయ్యల కుమారుడైన కురుమ సామాజిక వర్గానికి చెందిన దొడ్డి మల్లయ్య వ్యతిరేకించి తమ వారిని చైతన్య పర్చాడు. దీంతో మల్లయ్యను చితక్కొట్టాలని రాంచంద్రారెడ్డి, జానమ్మ తన అనచరురాలైన ముంజ రామక్కను ప్రేరేపించి మల్లయ్యపై తప్పుడు కేసుపెట్టి, లొంగిరాకపోవడంతో అతన్ని చితకబాదడానికి ప్రయత్నించారు. 


భువనగిరిలో 1944 ఆంధ్రమహాసభ (సంఘం) సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. వీరి దోపిడికి, దుర్మార్గాలకు విసిగిపోయిన ఊరి జనమంతా ఒక్కో ‘అణా’ చెల్లించి సంఘంలో జేరి, గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారు. 1944 అక్టోబరు 3న గ్రామ పెద్దరైతు దావుద్‌రెడ్డి అధ్యక్షతన ఆయన ఇంట్లో సమావేశం పెట్టగా ముఖ్యఅతిధి¸గా పాల్గొన్న ఆరుట్ల రాంచంద్రారెడ్డి సమక్షంలో ఆంధ్రమహాసభ కడివెండి గ్రామ నూతన కమిటీ ఏర్పడింది. అధ్యక్షులుగా దావుద్‌రెడ్డి, కార్యదర్శిగా నల్లా నర్సింహులు, కార్యవర్గ సభ్యులుగా ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, దొడ్డి మల్లయ్య, మాచర్ల కొండయ్య, మచ్చ రామయ్యలు ఎన్నికయ్యారు. మాశట్టి రాంచంద్రయ్య ఇల్లు సంఘ కార్యాలయం. తరచూ జరిగే సమావేశాల్లో గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునేవారు. గ్రామకమిటితోపాటు కొండల్‌రెడ్డి, పడమటింటి సాలయ్య, పైండ్ల యాదగిరి, జంపాల లింగయ్య లాంటి యువ కిశోరాలు ఉద్యమంలో చురుకుగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. సంఘం అండతో జానమ్మకు పన్నులు కట్టడం మానేశారు. పన్నులు చెల్లించని వారిపైనా ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమురయ్య కూడా అండగా నిలబడ్డాడు. విస్నూరు దొర ఉద్యమాన్ని అణిచి వేయాలని తలచి, పోలీసులను ఉపయోగించి కారణం లేకుండానే సంఘం నాయకుల్ని అరెస్టు చేయించి, సంఘంలో పని చేయొద్దని హెచ్చరించి వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. దేశ్‌ముఖ్‌ బెదిరింపులకు, దొరసాని కక్ష సాధింపు చర్యలకు భయపడకుండా కార్యకర్తలు ఐక్యతను చాటి ఆమె అక్రమాలపై సంఘం ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాన్ని చేపట్టగా అధికారులు దిగొచ్చి జానమ్మ వద్ద ఉన్న 80 పుట్ల వడ్లను జప్తు చేయడంతో ఆమెకు అవమానం ఎదురైంది.


ఈ అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకులుగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులును హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశ్‌ముఖ్‌ అనచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గూండాలు కడవెండి గ్రామంలోకి రాగా, వీరికి విస్నూరు పోలీసులు రక్షణ కవచంలా నిలవడంతో చీకటి పడే సమయంలో గూండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్ల పైకి రాళ్ళు రువ్వడం ప్రారంభించగా చాలామంది ఇండ్ల పెంకులు పగిలిపోయాయి. ఈ కుట్ర నాయకులకు ముందే తెలువడంతో దేశ్‌ముఖ్‌ చర్యలను ఎదుర్కోనేందుకు సిద్ధమైంది సంఘం. ఆర్గనైజర్‌ రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ‘ఆంధ్ర మహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ వారి కుట్రలకు వ్యతిరేకంగా ర్యాలీగా బయల్దేరారు. నాయకత్వం ముందు వరుసలో ఉండగా కార్యకర్తలు, జనం వారి అడుగుల్లో అడుగేస్తూ ప్రభంజనంలా కదిలారు. గుండాలకు వెన్నులో చలి మొదలైంది. గొర్రెలను ఊళ్ళోకి తోలుకొచ్చి దొడ్డిలోకి చేర్చి, ఇంటిలోకి వెళ్ళి భోజనం చేస్తున్న సమయంలో ర్యాలీగా వెలుతున్న ప్రజల నినాదాలు వినబడి దొడ్డి కొమురయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడు. అక్కడ గడీ పక్కనే దాక్కున్న గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గడీని సమీపించగానే జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య పొట్టలోకి దూసుకుపోగా బయటకు వస్తున్న పేగులను వత్తి పెడుతూ, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగి తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైంది. దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు. నియంత నిజాం పాలన అంతానికి, భారత్‌లో హైదరాబాద్‌ రాజ్యం విలీనమవ్వడానికి, పి.వి భూసంస్కరణల చట్టం తీసుకురావడానికి నాంది పలికిన కొమురయ్య పేరును జనగామ జిల్లాకు, ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్ట్‌కు కూడా పెట్టాలి, హైదరాబాద్‌లో కొమరయ్య స్మారక మందిరాన్ని నిర్మించాలి. ఆయన అమరత్వం పొందిన రోజైన జూలై 4ను ‘అమరవీరుల దినం’ ప్రకటించాలి.


-ఆస్నాల శ్రీనివాస్‌, ‌ ఏరుకొండ నరసింహుడు, దొడ్డి చంద్రం 

దొడ్డి కొమురయ్య ఫౌండేషన్‌

Advertisement
Advertisement
Advertisement