‘దళిత బంధు’ను విమర్శించే అర్హత ఉందా?

ABN , First Publish Date - 2021-07-29T07:14:50+05:30 IST

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఘననివాళి అర్పించారు. ఆ రోజే దళిత అభివృద్ధికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలి...

‘దళిత బంధు’ను విమర్శించే అర్హత ఉందా?

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఘననివాళి అర్పించారు. ఆ రోజే దళిత అభివృద్ధికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలి. ఈ సందర్భంగా మా స్వీయానుభవం ఒకటి ఉదాహరించాలి. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అసెంబ్లీలో సమావేశమైన దళిత ఎమ్మెల్యేలందరం అంబేద్కర్ స్మృతికి చిహ్నంగా 125 అడుగుల విగ్రహన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌కు తెలిపాం. విగ్రహన్ని పెట్టడం పెద్ద సమస్య కాదనీ, అది తప్పకుండా జరుగుతుందనీ, దానితోపాటు అంబేడ్కర్ ఆశయ సాధన మన ముఖ్య కర్తవ్యం కావాలని కేసీఆర్ హితబోధ చేశారు. అంతటితో ఆగక ఆ క్షణమే దళితులకు విద్య అందించడమన్న అంబేద్కర్ కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 125వ జయంతి సందర్భంగా దళిత విద్యార్థుల కోసం 125 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వాటిని అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం పదహారు వందలకుపైగా గురుకులాలను ఏర్పాటు చేసింది. తెలంగాణవస్తే ఏమొస్తది అనుకున్న దళితులకు గురుకులాల విద్యా వ్యవస్థతోపాటు, విదేశాల్లో చదువుకునే దళిత విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దళితులతో ప్రారంభమైన ఈ పథకం ఆ తర్వాత ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వర్తింపచేశారు. దళిత సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకునే పార్టీల నేతలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత ప్రభుత్వాలు దళితుల అభివృద్ధిని ఎన్నికల ఎజెండాగా మాత్రమే చూపాయి. పథకాలను రూపొందించి అమలు చేయడంతో విఫలమయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్రణాళిక చట్టాన్ని అమలులో ముందుకు తీసుకుపోలేకపోయాయి. ఆ చట్టం అమలుకు నియమ నిబంధనలను రూపొందించకపోగా, కనీసం నోడల్ అధికారిని కూడా నియమించకుండా గాలికొదిలేశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నియమ నిబంధనలలో మార్పులు చేసి, చట్టం సమర్థవంతంగా అమలు కావాలనే చిత్తశుద్ధితో మిగిలిపోయిన నిధులను సైతం కేరీ ఫార్వార్డ్ చేయాలనే నిబంధనను కొత్తగా చేర్చారు కేసీఆర్.


రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి బృహత్తర పథకాలను విజయవంతంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్, దళిత జనజీవనంలోనూ ఒక గుణాత్మక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో దళిత బంధు పథకం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 18 లక్షల 89 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు సమాచారం ఉన్నది. వారి జీవితాల్లో వెలుగుల కోసం కేసీఆర్ విస్తృతమైన సమాలోచనలు చేసి, దళిత ఎమ్మెల్యేలతో దాదాపు పది గంటలపాటు సమావేశమై దళిత బంధు పథకంపై నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష పార్టీలతో భేటీ, మేధావుల నుంచి అభిప్రాయాల సేకరణ, సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంపై కూడా విమర్శలు చేయడం జుగుప్సాకరం. ఈ పథకాన్ని అడ్డుకోవటమంటే దళిత సంక్షేమాన్ని అడ్డుకోవడమే. 


ఈ పథకాన్ని దశలవారీగా మూడు నాలుగేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్క దళిత కుటుంబంలో శాశ్వతంగా మార్పు రావాలంటే ప్రభుత్వం ఇచ్చేది పెద్ద మొత్తం కావాలనీ, తదనుగుణంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను ఇవ్వాలనీ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. కాళ్ళూ చేతులూ మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తించేట్టు చేస్తామనీ, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.1లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‍లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. పథకం విజయవంతం అయ్యేందుకు పట్టుదలతో అందరం కలిసి కృషి చేద్దామని దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలుగా మేము దళిత కుటుంబాలకు లక్షనో రెండు లక్షలో ఇచ్చి ఆదుకోవాలని అంటే- కాదు కాదు, లక్ష రెండు లక్షలతో దళిత కుటుంబాల అభివృద్ధి జరుగదనీ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలనీ స్పష్టంగా చెప్పిన కేసీఆర్ ఆ మాట ప్రకారమే దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. 


భూమిలేని దళిత కుటుంబాలకు రైతు బీమా వర్తించడం లేదు. భూమి లేనటువంటి దళిత కుటుంబాలు ఆ యాజమానిని కోల్పోతే అనాథగా మిగలకుండా ఆ కుటుంబ యాజమానికి రైతు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకొని పెద్ద మనసు చాటుకున్నారు. ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయగానే రైతు బీమా వర్తింపుపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. దళితులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపుల్లో కూడా దళితులకు ప్రత్యేక కోటా కేటాయించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‍పై విమర్శలు చేయడమంటే ఆ విమర్శకులకు దళిత అభివృద్ధి పట్టదనే అనుకోవాలి. వీటితోపాటు ప్రభుత్వం కేటాయించే వ్యాపార, వాణిజ్య భవనాల్లో కూడా దళితులకు ప్రత్యేక కోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇవేగాక దళితులకు మూడెకరాల భూమిని విజయవంతంగా పంపిణీ చేశారు. ఆర్థికంగా పటిష్టమైన నాడే దళితులు వివక్ష నుంచి దూరమవుతారన్నది సీఎం అభిప్రాయం. దళిత బంధును హుజూరాబాబాద్ విజయవంతం చేస్తే, తెలంగాణవ్యాప్తంగా దళితులకు పథకంపై అవగాహన కల్పించ వచ్చన్నారు. దళిత బంధు కార్యక్రమం సఫలీకృతం అయితే దళితుల అభివృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు పడతాయని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారు. నైపుణ్యం, ప్రతిభ వున్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల ఉంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమని, లింగ వివక్ష పేరుతో మహిళలను అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం దుర్మార్గమనీ హుజురాబాద్ నుంచి దళితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేసీఆర్ చెప్పడాన్ని బట్టి ఆయనకు దళిత సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అర్థమవుతుంది.


దళితులు ఎంతగానో హర్షిస్తున్న పథకాన్ని వ్యతిరేకిస్తున్నవారు దళిత వ్యతిరేకులన్న నిజాన్ని ప్రజలే గ్రహించాలి. దళిత అభివృద్ధి కోసం దేశంలోనే లేని పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువస్తుంటే, ప్రతిపక్షాలు అడ్డుకోవడం వెనుక ఎజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలి. దళిత బంధుకు యాభై వేల కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తారని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలను కేవలం ప్రతిపక్షమనిపించుకునేందుకు చేస్తున్నారనుకోవాలి, లేక దళిత అభివృద్ధిపై వారికున్న వ్యతిరేకతను రకరకాల ముసుగుల్లో దాస్తున్నారనుకోవాలి. దళిత సాధికారత లక్ష్యంగా కేసీఆర్ తీర్చిదిద్దిన దళిత బంధు పథకాన్ని విమర్శించటమంటే అంబేద్కర్ ఆకాంక్షలను తప్పుపట్టడమే అవుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా తెలంగాణ దళిత సమగ్ర అభివృద్ధి గమ్యంగా ముందుకు సాగిపోతున్న సీఎం కేసీఆర్ అభినవ అంబేడ్కర్‍గా కనిపిస్తున్నారు. 

డా. గాదరి కిశోర్ కుమార్

శాసనసభ్యులు, తుంగతుర్తి

Updated Date - 2021-07-29T07:14:50+05:30 IST