Abn logo
Jul 5 2020 @ 05:05AM

తప్పెవరిది?

వివాదం వెనుక ఆంతర్యమేంటి?

నాలుగు గోడల మధ్య సంభాషణను బయటకు చేర్చిందెవరు?

అవమానం అంటూ మెసేజ్‌లు పెట్టిందెవరు?

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికేనా?

క్లిష్ట పరిస్థితుల్లో వైద్యవర్గాల ఆందోళనపై పెదవి విరుపు


అనంతపురం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కరోనా కోరల్లో చిక్కుకున్న జిల్లాను గట్టెక్కించాల్సిన అధికారులు రోడ్డెక్కి నిరసనలకు దిగటం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కట్లేదు. సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమయంలో బేషజాలకుపోయి రచ్చకెక్కటం దుమారం రేపుతోంది. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ మధ్య సంభాషణ నాలుగు గోడల మధ్య జరిగిన విషయం తెలిసిందే. అక్కడ ఏం జరిగిందన్న నిజం బయటకు పొక్కాలంటే డీఎంహెచ్‌ఓ అయినా చెప్పాలి, జాయింట్‌ కలెక్టరైనా నోరు విప్పాలి. వారిద్దరూ బహిరంగంగా నోరు విప్పలేదు.


మరి ఈ నేపథ్యంలో వైద్యవర్గాలు డీఎంహెచ్‌ఓను అవమాన పరిచారంటూ క్షణాల్లో రోడ్డుకెక్కటం చూస్తే పలు సందేహాలు కలగకమానవు. డీఎంహెచ్‌ఓను జేసీ అవమానపరిచి ఉంటే ఆ విషయాన్ని ఆయనే స్వయంగా జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సింది. మరి ఆయన అలా చేయలేదు. వైద్యవర్గాలు మాత్రం జేసీ డాక్టర్‌ సిరి క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలకు దిగటం దేనికి సంకేతమన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనా బాధితుల కు ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది సేవలంది స్తున్నారని వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇలాంటి తరు ణంలో అందులోనూ కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తు న్న పరిస్థితుల్లో ఆందోళనలకు ఆస్కారం ఇవ్వటంపై ప్రజ లు పెదవి విరుస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరి శీలిస్తే వివాదం తెరపైకి తీసుకురావటం వెనుక ఏదో వ్యవహారం దాగుందన్న అనుమానాలు కలుగుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.


అక్కడ అసలేం జరిగింది?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతో కలిసి ఈనెల 3న మధ్యాహ్నం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వెళ్లారు. వారు అక్కడికి చేరుకునే సమయానికి డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌ కార్యాలయం బయట ఉన్నారు. ఆ తరువాత అందరూ కలిసి చాంబర్‌కు వెళ్లారు. డీఎంహెచ్‌ఓ కుర్చీలో జేసీ కూర్చోగా.. ఆ పక్కనే ఇంకొక కుర్చీలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కూర్చున్నారు. ఆ సమయంలో అదనపు డీఎంహెచ్‌ఓ పద్మావతి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో జేసీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌.. కొవిడ్‌-19కు సంబంధించిన సమాచారంపై డీఎంహెచ్‌ఓతో చర్చించినట్లు తెలుస్తోంది. పాజిటివ్‌ వ్యక్తులను ఆస్పత్రులకు తరలించటం, వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తులను డిశ్చార్జ్‌ చేయటంలో ఆలస్యంపై చర్చించినట్లు సమా చారం. అదే విషయాన్ని 108 అంబులెన్స్‌ల కో-ఆర్డినేటర్‌తోనూ మాట్లాడారు. ఈ క్రమంలోనే డీఎంహెచ్‌ఓ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయినట్లు తెలిసింది.


అయినప్పటికీ 108 కో-ఆర్డినేటర్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓతో మాట్లాడారు. ఆ తరువాత కొద్దిసేపటికి డీఎంహెచ్‌ఓ ఎక్కడని జేసీ వాకబు చేశారు. వెళ్లిపోయాడని తెలియటంతో అక్కడి నుంచి వారు బయటకు వచ్చారు. ఈలోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని గదులన్నింటికీ తాళాలు వేసి ఉండటాన్ని గమనించారు. అంతలో అక్కడికి అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఓ ఒకరు జేసీ వద్దకు వెళ్లారు. డీఎంహెచ్‌ఓ అవమానం జరిగిందంటూ వెళ్లిపోయారు మేడమ్‌ ఏం జరిగిందని అడిగారు. ఏం జరగలేదని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా ఆమె వెళ్లిపోగానే వైద్యులు, సిబ్బందికి మెసేజ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది. డీఎంహెచ్‌ఓను జేసీ అవమానపరిచారనీ, క్షమాపణలు చెప్పాలంటూ అందోళనలు చేయాలని ఆ మెసేజ్‌ల సారాంశం. దీంతో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కారు. అలా ఈ వివాదం రచ్చకెక్కింది. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో కుర్చీల్లేవా?

నిలబెట్టి మాట్లాడారన్న విమర్శల నేపథ్యంలోనే డీఎం హెచ్‌ఓకు అవమానం జరిగిందంటూ వైద్యులు, ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చేస్తున్న విషయం తెలిసిం దే. జేసీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌.. డీఎంహెచ్‌ఓ చాంబర్‌కు వెళ్లిన సందర్భంలో జేసీ.. డీఎంహెచ్‌ఓ కుర్చీలో, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆ పక్కనున్న కుర్చీలో కూర్చున్నారు. అదే చాంబర్‌లో అదనపు డీఎంహెచ్‌ఓ, 108 కో-ఆర్డినేటర్‌ కూర్చున్నారు. వైద్యఆరోగ్యశాఖకు ఉన్నతాధికారి, అందులోనూ ఆయన చాంబర్‌లో ఆయనకు కుర్చీ లేకుండా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కంటే కిందిస్థాయి అధికారులు కూర్చున్నపుడు డీఎంహెచ్‌ఓ స్థాయి అధికారిని నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితి అక్కడ ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే కొవిడ్‌-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల్లో అలసత్వమే ఈ వివాదం తెరలేపడానికి ప్రధాన కారణమై ఉండొచ్చన్న వాదన  వినిపిస్తోంది.


పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులను ఆస్పత్రులకు తరలించటం, డిశ్చార్జ్‌ అయిన వ్యక్తులను ఇళ్లకు చేర్చే విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఏ పాజిటివ్‌ వ్యక్తిని ఏ ఆస్పత్రికి తరలించాలనే జాబితాను రూపొందించటంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. రెండ్రోజుల కిందట ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 24 గంటలు గడిచినా ఆ వ్యక్తిని ఏ ఆస్పత్రికి తరలించాలి? లేదంటే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచాలా? అనే విషయంలో సందిగ్ధత కొనసాగింది. ఉన్నఫలంగా రావడం, ఆస్పత్రులన్నీ తిప్పటం, ఏదో ఒక ఆస్పత్రిలో చేర్చడం ఇదీ జరుగుతోంది. ఒక్కో అంబులెన్స్‌లో నలుగురైదుగురు పాజిటివ్‌ వ్యక్తులను ఎక్కించటం, అర్ధరాత్రి వరకూ తిప్పటం, ఏ ఆస్పత్రిలో ఖాళీ ఉంటే అక్కడ చేర్చటం, మరి కొందరిని వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ వివాదం తెరపైకి వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది.


పెత్తనం కోసమేనా?

కరోనా నేపథ్యంలో పెత్తనం కోసమే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యఆరోగ్యశాఖ గుప్పిట్లోనే ఈ వ్యవహారమంతా సాగాలన్న అభిప్రాయంతోనే ఆ శాఖ వర్గాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో లావాదేవీలు ఆ శాఖ పరిధిలోనే ఉండాలన్న అభిప్రాయమే ఈ వివాదానికి కారణమైఉంటుందన్న అభిప్రాయం మెజార్టీ వర్గాల నుంచి వినబడుతోంది. డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలోనే శస్త్ర చికిత్సలకు ఉపయోగించే ద్రావకం తాగి అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రిలో చేరకుండా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ఆ మేరకు సౌకర్యాలు లేవా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చాయి.


సమన్వయలోపమే కారణమా?

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆరంభం నుంచి వైద్యఆరోగ్య శాఖ, ఇతర శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేయడంలో శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ, వైద్యవర్గాల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శాఖలన్నింటినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉంది. ఆ దిశగా చర్యలు చేపడితేనే జిల్లాలో కరోనాను కట్టడి చేయొచ్చు. లేదంటే పరిస్థితులు చేజారే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement