టీయూపై పట్టింపేది?

ABN , First Publish Date - 2022-03-09T06:53:07+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్ని వనరులు ఉన్నా.. ఎవరి పట్టింపు లేదు. విశ్వవిద్యాలయంలో అనుకున్న విధంగా అభివృద్ధి జరగడం లేదు. విశ్వ విద్యాల యం ఏర్పాటు చేసి పదహారు ఏళ్లు దాటుతున్నా.. ఖాళీల భర్తీ ఇంకా అసంపూర్తిగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు రాకపోవడంతో

టీయూపై పట్టింపేది?
తెలంగాణ యూనివర్సిటీ

అన్ని వనరులు ఉన్నా.. నిధుల విడుదల కరువే..
అనుమతులు ఉన్నా.. శాశ్వత నియామకాలూ శూన్యమే..
సరిపడా నిధులు రాక.. కానరాని మౌలిక వసతుల కల్పన
అభివృద్ధికి ఆమడ దూరంలో చదువుల విశ్వవిద్యాలయం
టీయూ నెలకొల్పి 16ఏళ్లు పూర్తి
విస్తరించనున్న విశ్వవిద్యాలయం  
టీయూ పరిధిలోకి నిర్మల్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల కళాశాలలు
జాతీయ స్థాయిలో పరిశోధనలకు ఉన్నతాధికారుల ఆదేశాలు
ఉపాధినిచ్చే కొత్త కోర్సుల కోసం పాలకుల ప్రయత్నాలు

నిజామాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్ని వనరులు ఉన్నా.. ఎవరి పట్టింపు లేదు. విశ్వవిద్యాలయంలో అనుకున్న విధంగా అభివృద్ధి జరగడం లేదు. విశ్వ విద్యాల యం ఏర్పాటు చేసి పదహారు ఏళ్లు దాటుతున్నా.. ఖాళీల భర్తీ ఇంకా అసంపూర్తిగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు రాకపోవడంతో మౌలిక వసతుల కల్పన లేదు. ఉన్నత విద్యలో అనుకున్న విధంగా ఇతర విశ్వవిద్యాలయాలతో పోటి పడటం లేదు. అకాడమిక్‌ క్యాలెండర్‌పై నజర్‌ పెట్టి తరగతులు నిర్వహిస్తున్నా.. పాసైన విద్యార్థులకు కొన్ని విభాగాలలో మినహా.. ఇతర డిపార్ట్‌మెంట్‌లలో ప్లేస్‌మెంట్‌ రావడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జాతీయ స్థాయిలో పరిశోధనలకు గుర్తింపు వచ్చే విధంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
టీయూలో పరిధిలో 22 కోర్సులు
తెలంగాణ విశ్వవిద్యాలయం అప్పటి సీఎం వైస్‌ రాజశేఖర్‌రడ్డి హయాంలో నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడి విద్యార్థుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. మొదట జిల్లాకేంద్రంలోని గిరిరాజు కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని.. ప్రస్తుతం డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన నూతన క్యాంపస్‌కు మార్చారు. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 22 కోర్సులను అందిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం పెట్టినప్పుడే అన్ని టీచింగ్‌ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చినా.. ఇప్పటికీ చాలా పోస్టులు భర్తీ కాలేదు. అన్ని విభాగాలలో టీచింగ్‌ పోస్టులు 70 వరకు ఉండగా.. నాన్‌ టీచింగ్‌ పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయం పరిధిలో శాశ్వత నియామకాలు చేపట్టకపోవడంతో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌కు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసు కొని తరగతుల నిర్వహణ కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పీజీ  కోర్సు లతో పాటు పరిధిలోని 103 కళాశాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్‌, ఆదిలాబా ద్‌, మెదక్‌ జిల్లాల కళాశాలలను ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురా నుండటంతో మరింత విస్తరించనుంది. కొత్త కోర్సులను కూడా వచ్చే యేడాది నుంచి ప్రవేశ పెట్టనుండటంతో ఇంకా శాశ్వత సిబ్బంది నియమిస్తే తప్ప పాలన గాడిలో పడే పరిస్థితి లేదు.
సరిపడా మంజూరు కాని నిధులు
 ఈ విశ్వవిద్యాలయం పెట్టినప్నటి నుంచి ఇప్పటి వరకు నిధులు ఎక్కువ గా రావడం లేదు. పాలనకు అవసరం అయిన నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. యూజీసీ నుంచి కూడా తక్కువగానే నిధులు వస్తున్నాయి. అన్ని విభాగాలలో ఎక్కువగా పరిశోధనలు జరుగకపోవడం వల్ల ఎక్కువగా నిధులు రావడం లేదంటున్నారు. విశ్వవిద్యాలంలో పీజీ కోర్సులను 12వందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో వసతి గృహాలు లేవు. ఉన్న వాటిలోనే సర్దుబాటు చేస్తున్నారు. మిగితావారు బయటఉండి తరగతులకు హాజరవుతున్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు తగినంతగా రాకపోవడం వల్ల అన్ని వసతులు అందడం లేదు. అకాడమిక్‌లో బాగానే ఉన్నా.. పరిశోధనలు, కెరియర్‌కు ఉపయోగపడే శిక్షణలో విద్యార్థులు వెనుకబడుతున్నారు. పట్టాలు పొందుతున్నా.. ప్లేస్‌మెంట్‌ మాత్రం కొన్ని విభాగాలలో మాత్రమే వస్తున్నా యి. విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకులు ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి వచ్చివెళ్లడంతో పర్యవేక్షణ కరువవుతోంది. ఉన్నత విద్యాధికారులు, ఈసీ సభ్యులు, వీసీ నజర్‌ పెట్టడంతో ఇపుపడిప్పుడే పాలన గాడిన పడుతోంది.
పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం
తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించుతూనే.. పాలనను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వవిద్యాలయం పరిధిని పెంచడంతో పాటు ఉఫాధిని ఇచ్చే కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లను చేస్తు న్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో వచ్చే సం వత్సరం ఈసీ, ప్రభుత్వ అనుమతి తో పీజీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నానో సైన్సు, సైబర్‌ నెట్‌వర్క్స్‌, ఎంటెక్‌ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిపడా సిబ్బంది కోసం అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.
పాలనను గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు
: ప్రొపెసర్‌ రవీందర్‌ గుప్తా, తెలంగాణ యూనివర్సిటీ వీసీ
విశ్వవిద్యాలయం పరిధిలో అకాడమిక్‌తో పాటు పాలనను గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విశ్వవిద్యాలం పరిధిలో  అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ వచ్చే విధంగా శిక్షణను ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులను విశ్వవిద్యాలయంలో ప్రవేశ పెడతాం. ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించాం.

Updated Date - 2022-03-09T06:53:07+05:30 IST