చదువుల తల్లిని చంపేస్తారా?

ABN , First Publish Date - 2021-08-05T06:27:33+05:30 IST

అమరరాజా సంస్థపై ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైందనే ముద్ర వేయడం ప్రజల్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది.

చదువుల తల్లిని చంపేస్తారా?
పేటమిట్టలోని రాజన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

రాజన్న ట్రస్టు సేవలు గుర్తు చేసుకుంటున్న జనం


చిత్తూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అమరరాజా అన్నది  ఒక పరిశ్రమ మాత్రమే కాదు. చిత్తూరు జిల్లా ప్రజలకు ఉపాధిలోనే కాదు, బహుళ రంగాల్లో సేవలందిస్తున్న సంస్థ కూడా. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతను నియమాలతో నిమిత్తం లేకుండా ఆపన్న హస్తం అందిస్తున్న సంస్థ. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, పూతలపట్టు, తవణంపల్లె ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర సామాజిక సేవలను అందిస్తున్న ఈ సంస్థపై హఠాత్తుగా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైందనే ముద్ర వేయడం ప్రజల్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. రాజగోపాల నాయుడు ఆదర్శాల బాటలో ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ గురించి జరుగుతున్న దుష్ప్రచారం ఈ ప్రాంతాల ప్రజలను కలత పెడుతోంది. రాజకీయ ద్వేషంతో ఒక సంస్థ సేవలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే బాధ వ్యక్తమవుతోంది. కాలుష్యం పేరుతో అమరరాజా పరిశ్రమలను మూసేయమంటూ ప్రభుత్వం ఆదేశించడంతో సంస్థ విస్తరణ చెన్నైకి తరలిపోతోందనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ప్రజలు అమరరాజా సేవలను గుర్తు చేసుకుంటున్నారు. రాజన్న ట్రస్టు పేరుతో వీరు విద్యారంగంలో చేస్తున్న సేవలపై ప్రత్యేక కథనమిది.


నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్య

   రాజన్న ట్రస్టు ఆధ్వర్యంలో నాలుగు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. తిరుపతిలోని కరకంబాడి, పూతలపట్టు మండలంలోని పేటమిట్ట, తవణంపల్లె మండలంలోని దిగువమాఘం ప్రాంతాల్లో మూడు పాఠశాలలతో పాటు పేటమిట్టలో జూనియర్‌ కళాశాల ఉంది. అవన్నీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ఏ మాత్రం తగ్గకుండా నామమాత్రపు ఫీజులతో పేదపిల్లలకు, ఉద్యోగుల పిల్లలకు విద్యను అందిస్తున్నాయి. సెంట్రల్‌ సిలబస్‌ ఉన్న పదో తరగతి పిల్లలకు ఏడాదికి రూ.10వేలు, ఇంటర్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు మాత్రమే ఇక్కడ ఫీజులుంటాయి. స్కూల్‌ బస్సులు నడిపే డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పిల్లలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లల నుంచి కూడా అవే ఫీజులు తీసుకుంటున్నారు. పేటమిట్టలోని విద్యాసంస్థల్లో చదివే బాలురు, బాలికలకు విడివిడిగా హాస్టల్‌ వసతి  ఏర్పాటుచేశారు. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు మించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నాలుగు విద్యాసంస్థల్లో సుమారు 3500 మంది విద్యార్థులకు పైగా చదువుకుంటున్నారు. కరకంబాడిలో ప్రీప్రైమరీ నుంచి పదో తరగతి వరకు, పేటమిట్టలోని మంగళ విద్యాలయలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అందిస్తున్నారు. అన్నిచోట్లా ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలాలను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా పాకాల, చంద్రగిరి, పీలేరు, దామలచెరువు, అరగొండ, కరకంబాడి, ఎర్రచెరువుపల్లె ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కూడా ఏర్పాటుచేశారు.


పరిశ్రమ ప్రాంగణంలో విద్యా కుసుమం

   కరకంబాడిలోని అమరరాజా పరిశ్రమ ప్రాంతంలో అధునాతన వసతులతో 1995లో అమరరాజా విద్యాలయను ఏర్పాటుచేసింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో సిబ్బంది పిల్లలతో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్‌ సౌకర్యాలు ఉన్నప్పటికీ అందరికీ అందుబాటులో లాభాపేక్ష లేకుండా సాధారణ ఫీజులతో స్కూల్‌ నడుస్తోంది. ప్రస్తుతం 990 మంది విద్యార్థులు ఈ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారు.  



Updated Date - 2021-08-05T06:27:33+05:30 IST