ప్రజానైతికతను రాజ్యాంగం పెంచుతుందా?

ABN , First Publish Date - 2021-04-15T07:43:46+05:30 IST

కొంతకాలంగా సుప్రీంకోర్టు ‘రాజ్యాంగ నైతికత’ అనే పదప్రయోగాన్ని చేస్తూ ఉంది. ఈ నైతికతను రాజ్యాంగానికి మనసాక్షిగా, ఆత్మగా వర్ణించింది...

ప్రజానైతికతను రాజ్యాంగం పెంచుతుందా?

కొంతకాలంగా సుప్రీంకోర్టు ‘రాజ్యాంగ నైతికత’ అనే పదప్రయోగాన్ని చేస్తూ ఉంది. ఈ నైతికతను రాజ్యాంగానికి మనసాక్షిగా, ఆత్మగా వర్ణించింది. శబరిమల తీర్పు లోనూ, పదిహేనేళ్ల వయసున్న భార్యతో సంభోగం అత్యాచారం కాదనే భారతీయ నేర స్మృతి సెక్షన్ 375ను సవరించడంలోనూ, స్వలింగ సంపర్కం నేరమనే సెక్షన్ 377ను తొలగించడంలోనూ రాజ్యాంగ నైతికతను న్యాయస్థానం ప్రమాణంగా తీసుకుంది. న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రకారం శబరిమలకు స్త్రీలు వెళ్ళకూడదు అనే అభిప్రాయం, సెక్షన్ 375 పితృస్వామిక భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. స్వలింగ సంపర్కం నేరమనే సెక్షన్, చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ భావనకు వ్యతిరేకం. ఈ సమస్యల విషయంలో న్యాయస్థానం పోవాల్సినంత దూరం పోలేదనే చర్చను అటుంచితే ప్రజాస్వామ్య భావనకు, సమానత్వ భావనకు సమానార్థకంగా రాజ్యాంగ నైతికతను వాడుతున్నారు. 


రాజ్యాంగ నైతికత అనే ప్రమాణాన్ని న్యాయస్థానాలు లేవనెత్తి, చట్టాల విలువలను అంచనా కట్టడం అనేది చాలా ప్రమాదకరమైన పరిణామంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వర్ణించారు. సర్వోన్నత న్యాయస్థానం మూడో సభగా చలామణి కావడానికి జరుగుతున్న ప్రయత్నంగా ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాభిప్రాయం, ప్రజా నైతికత (పబ్లిక్ మొరాలిటీ) పేరుతో, ఓట్ల ద్వారా ఎన్నికయ్యే ప్రభుత్వాలు, అసమానతను, పితృస్వామ్య భావజాలాన్ని కొనసాగిస్తాయని, కానీ పబ్లిక్ మొరాలిటీని కాన్‌స్టిట్యూషనల్ మొరాలిటీగా మార్చే సామర్థ్యం, ఎన్నిక కాని న్యాయవ్యవస్థకు మాత్రమే ఉందని చంద్రచూడ్ అంటారు. అంటే ప్రజాజీవితంలోకి నైతికత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా పైనుంచి కిందికి ప్రవహిస్తుంది అన్నమాట. 


రాజ్యాంగ నైతికత అనే మాట రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అంబేడ్కర్ 1948 నవంబర్ 4న, మొదటిసారి  రాజ్యాంగం చిత్తుప్రతిని రాజ్యాంగసభలో ప్రవేశ పెట్టినప్పుడు ఆయన ఆ పదప్రయోగం చేశారు. ప్రభుత్వ వ్యవస్థను ఎలా నిర్వహించాలనే సాధారణమైన విషయాలను రాజ్యాంగంలో విస్తృతంగా పొందుపరచాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆయన భారతదేశ సమాజం సారాంశంలో అప్రజాస్వామికమైనదని, రాజకీయ ప్రజాస్వామ్యం అనేది పై మెరుగుగా మాత్రమే రూపొందుతూ ఉందని అన్నారు. ఈ అంశం మనందరికి తెలిసిన విషయమే. అయితే బ్రిటిష్ చరిత్రకారుడు జార్జ్ గ్రోట్ 19వ శతాబ్దం చివరలో వాడిన ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను అంబేడ్కర్ ప్రస్తావిస్తూ, అది భారత దేశంలో వేళ్లూనుకోవాలంటే, పాలకులు, పాలితులు రాజ్యాంగ చట్రం (constitutional mechanism) పట్ల నిబద్ధత కలిగి ఉండాలని అన్నారు. 


జార్జ్ గ్రోట్ ప్రకారం రాజ్యాంగ నైతికత అనే భావనలో ఐదు అంశాలు ఉన్నాయి. అవి: పౌరులందరూ రాజ్యాంగం పట్ల గౌరవంగా ఉండాలి; రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వం పట్ల గౌరవం ప్రదర్శించాలి; రాజ్యాంగ విధులు నిర్వర్తించే అధికారులను విమర్శించే హక్కు ప్రజలకు అపరిమితంగా ఉండాలి; అధికారులు రాజ్యాంగం గీసిన పరిధిలో మెలగాలి; చివరగా, అధికారానికి పోటీపడే వారు రాజ్యాంగాన్ని గౌరవించడమే కాక, తమ ప్రత్యర్థులకు కూడా రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని నమ్మాలి. సారాంశంలో రాజ్యాంగ నైతికత అంటే రెండు రాజ్యాంగ సూత్రాలకు పౌరులు, పాలకులు నిబద్ధులు కావడమే. ఇవీ ఆ రాజ్యంగ సూత్రాలు: ప్రజాస్వామ్య విలువలైన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మొదలైన వాటి పట్ల నిబద్ధత; పాలనతో విభేదించే హక్కులు. ఈ రెండు సూత్రాలు కలగలిసి సాగడమే రాజ్యాంగ నైతికత. ప్రాచీన గ్రీసు చరిత్రకారుడైన జార్జ్ గ్రోట్, గ్రీకు ప్రజాస్వామ్యాన్ని ప్లేటో (ఈయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం) లాంటి తత్త్వవేత్తల నుంచి రక్షించడానికి రాజ్యాంగ నైతికత అనే భావనను ప్రతిపాదించాడు. ఈ రెండు సూత్రాలు ఆధునిక కాలంలో ఏ దేశంలోనైనా ఒక ప్రజాస్వామ్య వైఖరిగా రూపొందాయా అనేది ప్రశ్న. సామ్రాజ్యవాదాన్ని, వలసవాదాన్ని సమర్థించుకున్న పాశ్చాత్యదేశాలు ఏనాడూ రాజ్యాంగనీతికి కట్టబడలేదు. ఇరవయ్యో శతాబ్దంలో కానీ, ప్రస్తుతం కానీ, పై రెండు సూత్రాలకు ఏ దేశ పాలకులు, పాలితులు పూర్తిగా నిబద్ధులు కాలేదు. బహుశా ప్రజాస్వామిక నైతికతను రాజ్యాంగంలో వెతకడం వల్ల ఫలితం లేదనిపిస్తుంది. 


ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ రూపంలో రాసుకున్నంత మాత్రాన సమాజంలో అవి ప్రజాస్వామ్య వైఖరులుగా, ఆచరణగా మారిపోవు అని 1909 నుంచి నమ్మిన మనిషి గాంధీ. అంతిమంగా బలప్రయోగం మీద ఆధారపడిన రాజ్యానికి ప్రజాస్వామిక నైతికతను ప్రోది చేసే నైతికశక్తి లేదని ఆయన విశ్వసించారు. సామాజిక ప్రయోజనాల్ని రక్షించడం కోసం వ్యక్తుల మీద, గ్రూపుల మీద బలప్రయోగం చేయడం సమర్థనీయమే అని నమ్మిన ఏ సమాజమైనా, హక్కుల హననానికి పాల్పడతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో టాల్‌స్టాయ్ లాంటి వారి తాత్విక ప్రభావం గాంధీ మీద బలంగా ఉంది. ముఖ్యంగా వ్యక్తి కేంద్రంగా నడిచే ఆధునిక సమాజానికి మనుషుల భౌతిక సంక్షేమం పట్ల తప్ప వారి నైతికత పట్ల, మనసాక్షి పట్ల, పట్టింపు లేదు కాబట్టి ఇతరుల హక్కులను గౌరవించే సంస్కారం దానికి లేదని భావించారు. ఆయన దృష్టిలో, పాశ్చాత్య రాజకీయాల నుంచి నైతికత వేరుపడిన తర్వాతే, ముఖ్యంగా 16 శతాబ్దం తర్వాత, ఆ అవకాశం మరింత సన్నగిల్లింది. మతంలోని మూఢనమ్మకాలను దునుమాడే పేరిట సైన్సు, పెట్టుబడిదారీ వ్యవస్థ చేసిన దౌర్జన్యం కొనసాగడానికి, నైతికతను రాజకీయాల నుంచి వేరుచేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వ్యక్తిగత, సామాజిక రంగాలలో అంతకంతకు పెరుగుతున్న హింస, అసమానతలను ఫార్మల్ రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యంగానే భావించారు గాంధీ. అందుకే బ్రిటిషు రాజ్యాంగం పట్ల విధేయత, ఇతరులకు సేవ (nursing) చేయడం తనకున్న రెండు ముఖ్యమైన అభిరుచులుగా (passions) చాలాకాలం ముందే ప్రకటించుకున్నప్పటికీ, దక్షిణాఫ్రికాలో అనుభవించిన వలసవాద దౌష్ట్యం తర్వాత, చట్టం పట్ల నిబద్ధత కంటే నైతికమైన మనసాక్షికి నిబద్ధుడుగా ఉండడమే ముఖ్యమని భావించారు ఆయన. అన్యాయమైన రాజ్యాంగానికి, చట్టానికి లొంగడం కంటే మనసాక్షి ప్రకారం జైలుకు వెళ్లడమే న్యాయమనుకున్నారు. (న్యాయమూర్తితో మీ చట్టం ప్రకారం నాకు శిక్ష వెయ్యండి, కానీ దాని కన్నా ఉన్నతమైన నా మనసాక్షి ప్రకారం నేను శిక్ష అనుభవిస్తాను అనడం మనం గాంధీలో చూస్తాము. ఈ రోజుల్లో సుప్రీంకోర్టుకు లొంగడం కంటే జైలుకే వెళ్తానని ప్రశాంతభూషణ్ కానీ, ఆయన మద్దతుదారులు కానీ అనలేకపోయారు. ఇక సగటు పౌరుల నుంచి ఆ స్పందనను ఊహించలేము) మొత్తం మీద రాజ్యాంగం పట్ల నిబద్ధత, రాజకీయ ఆచరణ, నైతికత వేరు వేరు విషయాలుగా గాంధీ భావించలేదు. అవి కలగలసి, నిత్య జీవితాచరణలో ముందుకు సాగాలని ఆయన భావించారు. ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు అనుకుంటే అవి ఆచరణలో సాధించాల్సిందే తప్ప రాజ్యాంగంలో రాసుకుంటే మనుషులు యథావిధిగా ప్రజాస్వామీకరించబడరు. గాంధీకి ఉన్న ఈ మొత్తం అవగాహనలో మనుషులు- తనతో సహా- నైతికంగా చాలా బలహీనులు అనేది ప్రధాన అంశం. నైతికతను జీవితంలో ఆచరించడం ద్వారా మాత్రమే సమాజాన్ని కూడా ప్రజాస్వామ్యీకరించగలం. అంతే తప్ప, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామిక సమాజం ఆకాశం నుంచి ఊడిపడవనే అవగాహన ఆయనకు స్పష్టంగా ఉండింది. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారికి, ముఖ్యంగా నెహ్రూకు, పటేల్‌కు ఈ అవగాహనతో ఏకీభావం లేదని ఆయనకు స్పష్టంగా తెలుసు. 


మనుషులు ప్రజాస్వామ్యీకరించబడాలంటే ఆధునిక మనిషికి మూడు లక్షణాలు ఉండాలని గాంధీ ప్రతిపాదించారు. ఒకటి- స్వచ్ఛందంగా పేదరికాన్ని స్వీకరించడం, అంటే సంపద పట్ల దురాశ లేకపోవడం. రెండు- స్వచ్ఛందంగా జీవితాన్ని సరళంగా (voluntary simplicity) ఉంచుకోవడం, అంటే, సంక్లిష్ట జీవితానికి బానిసగా మారకపోవడం; జీవితాన్ని నెమ్మదింపచేయడం (slowness), అంటే జీవన మార్గంలో కనిపించే వారిని పట్టించుకోవడం. ఇవాళ పరుగుల జీవితం ఎవరినీ పట్టించుకోదు అని వాపోవడం ఆధునికుల తాత్వికత అయిపొయింది కానీ, ఆ మాటే అన్న గాంధీని ఇవాళ్టికీ ఛాందసుడిగానే చూస్తున్నాం. 


17, 18వ శతాబ్దాలలో రాజ్యాంగాల ప్రధాన ఉద్దేశం భిన్న అధికార కేంద్రాల మధ్య ఒక సమతౌల్యాన్ని, రాజకీయ స్థిరత్వాన్ని కాపాడడమే తప్ప, సమాజంలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కాదు. ఆనాటి బ్రిటన్‌లో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రధాన లక్ష్యం, సమాజ సంప్రదాయ చట్రాన్ని, పార్లమెంటు చట్టాల ద్వారా చేసే దురాక్రమణ నుంచి కాపాడడమే. ఇవాళ ఈ రెండు వ్యవస్థలు తమ చారిత్రక కర్తవ్యాల్ని పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ నాడు సంప్రదాయ నిబద్ధమైన ప్రభుత్వం నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే పేరుతో, రాజ్యాంగ నైతికత పేరుతో అధికారాన్ని చెలాయించడానికి న్యాయవ్యవస్థ ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు వ్యవస్థలు వేరువేరు అని ఇవాళ సగటు మనిషి భావించడం లేదు. వేరైనా కాకపోయినా ఆ వ్యవస్థలకు సమాజంలో ప్రజాస్వామిక విలువలను పెంపొందించే సామర్థ్యం లేదనేది స్పష్టం. బలమైన రాజ్యాంగ వ్యవస్థ బలమైన మార్పును తెస్తుందని విశ్వసించిన వారందరికీ ఎరుకలోకి వచ్చిన విషయమేమంటే, వ్యవస్థలు రోజురోజుకి బలంగా మారాయే తప్ప, నికార్సైన ప్రజాస్వామిక మార్పు కొంతైనా రాలేదని. స్త్రీలకు, ఆదివాసులకు, దళితులకు న్యాయస్థానంలో ఎంత స్థానం ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకేం చేయాలో పాలుపోని సామాజిక శాస్త్రవేత్తలు చరిత్రలో మార్పులు సరళంగా లేవని సర్ది చెప్పడానికి సిద్ధపడిపోతున్నారు. 


కొసమెరుపు: ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక (2003) కేసులో, రాజ్యాంగ నైతికత పేరు మీద దేశ సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్లను వ్యతిరేకించింది. రాజ్యాంగ నైతికత రాజ్యాంగంలోని అమూర్తమైన (formal) సమానత్వానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు భావించింది. అమూర్తమైన సమానత్వ సూత్రాన్ని, రాజ్యాంగ నైతికత పేరిట, నిజమైన (substantial) సమానత్వానికి వ్యతిరేకంగా న్యాయవ్యవస్థ ప్రయోగించగలదని అంబేడ్కర్ ఊహించి ఉండరు. రాజ్యాంగ నైతికత ఒక విలువగా వాస్తవరూపం ధరించాలంటే సహాయనిరాకరణ, సత్యాగ్రహం లాంటి రాజకీయ ప్రయోగాలను ప్రజలు వదులుకోవాలి అని ప్రకటించిన అంబేడ్కర్ ఈనాటి పరిణామాలకు ఎలా స్పందించేవారో ఉహించడం కష్టం. 

కే. మురళి

నల్సార్ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-04-15T07:43:46+05:30 IST