పీఎస్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన కుక్క.. ఫిదా అయిన పోలీసులు

ABN , First Publish Date - 2020-02-27T01:08:45+05:30 IST

'నేను తప్పిపోయాను.. నా యజమాని దగ్గరకు చేర్చరు ప్లీజ్' అంటూ ఓ శునకం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ కంప్లైంట్ చేసింది.

పీఎస్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన కుక్క.. ఫిదా అయిన పోలీసులు

టెక్సాస్: 'నేను తప్పిపోయాను.. నా యజమాని దగ్గరకు చేర్చరు ప్లీజ్' అంటూ ఓ శునకం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ కంప్లైంట్ చేసింది. ఇదేదో హాలీవుడ్ సినిమాలోని స్టోరీలా ఉందే. లేకపోతే కుక్క తప్పిపోయానని పోలీసులకు కంప్లైంట్ చేయడం ఏంటి.. ఇది అసలు సాధ్యమేనా? చోద్యం కాకపోతే మరేంటి అనుకుంటున్నారా కదా. కానీ నిజంగా ఇది జరిగింది. ఈ వింత ఘటన ఈ నెల 11న టెక్సాస్‌లోని ఒడెస్సా పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది.


అసలేం జరిగిందంటే... అమెరికాలో టెక్సాస్‌ రాష్ట్రం ఒడెస్సా పోలీస్ స్టేషన్‌కు ఈ నెల 11న అర్థరాత్రి సమయంలో ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వెళ్లింది. పీఎస్‌లోకి దూసుకొచ్చిన ఆ శునకాన్ని చూసి మొదట పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. పైగా అది ఏవేవో సైగలు కూడా చేస్తోంది. కుక్క అలా వింత సైగలు చేయడం మొదటిసారి చూసిన పోలీసులు కాసేపు దానిని అలాగే చూస్తూ ఉండిపోయారు. అలా చాలాసేపు చేసింది. ఆ సైగలకు అర్థం ఏమిటో మొదట వారికి ఏమాత్రం అర్థం కాలేదు. ఆ శునకం వింత ప్రవర్తనతో చేస్తున్న ఆ సైగలను అర్థం చేసుకోవటానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. చివరకు ఆ సైగలను అర్థం చేసుకున్న ఒడెస్సా పోలీసులకు ఆశ్చర్యపోవడం వారి వంతైంది.


కుక్క విశ్వాసం గల జంతువే కాదు... ఇతర ఏ జంతువులకూ లేని తెలివి శునకాలకు ఉంటుందని అప్పుడు వారికి అర్థమైంది. అందులోనూ జర్మన్ షెపర్డ్ కుక్కకు తెలివి కూసింత ఎక్కువే ఉంటుంది కదా. దానికి ఈ శునకం చేసిన సైగలే ఉదాహరణ అనుకున్నారు. అప్పటి వరకు అది చేస్తున్న సైగల అర్థం..."తాను తప్పిపోయిన విషయాన్ని పోలీసులకు వివరించడమే." అది తెలుసుకున్న పోలీసులు ఆ కుక్క తెలివికి ఫిదా అయిపోయారు. రాత్రంతా దానిని తమ వద్దనే ఉంచుకున్నారు. దానితో సంతోషంగా ఆడుకున్నారు.


అయితే, ఆ కుక్కను దాని యజమాని వద్దకు చేర్చడం పోలీసులకు కాస్తా కష్టమైంది. ఎందుకంటే కుక్క మెడలో ఎటువంటి గుర్తింపు ట్యాగ్‌ లేదు. దాంతో శునకం ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అవికాస్తా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు దాని యజమాని దృష్టికి కూడా వెళ్లడంతో వెంటనే అతను పోలీస్ స్టేషన్ వచ్చి కుక్కను తీసుకెళ్లారు.

 

"గత రాత్రి యాదృచ్చికంగా మా స్టేషన్‌లోకి వచ్చిన ఈ తెలివిగల కుక్క.. రాత్రంతా మాతో సరదాగా గడిపింది. మాపై ఎంతో ప్రేమను చూపించింది. అది సురక్షితంగా యాజమాని దగ్గరకు చేరినందుకు సంతోషంగా ఉంది" అని పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాని యజమాని మాట్లాడుతూ... రాత్రి పడుకునే సమయంలో కుక్క బయటకు వెళ్లిపోయిందని.. దారి తప్పిపోవడంతో అది మైళ్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందన్నారు. తప్పిపోయానంటూ రక్షణ కోసం తన పెంపుడు కుక్క ‘చికో’ పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చికో తెలివిని యజమాని కొనియాడారు.   




Updated Date - 2020-02-27T01:08:45+05:30 IST