Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుక్కల స్వైరవిహారం.. భీతిల్లుతున్న జనం!

గ్రామాల్లో గుంపులుగా సంచారం

జనావాసాల్లోకి చొరబాటు

చిన్నారులు, కోళ్లు, లేగ దూడలపై దాడులు

భయాందోళనలో వాహన చోదకులు


రావికమతం, నవంబరు 27: మండలంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఊరూరా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఒంటరిగా కనిపించే వారిని వెంటాడుతున్నాయి. చిన్నారులు, కోళ్లు, లేగ దూడలపై దాడులు చేస్తున్నాయి. ఎవరైనా ఎదురు తిరిగితే తెగబడుతున్నాయి. వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డుపైకి రావాలంటే జనం భయపడే వాతావరణం సృష్టిస్తున్నాయి. 

మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కుక్కల సంచారం ఎక్కువైపోయింది. ఒకటి, రెండు కాకుండా గుంపులుగా తిరుగుతుండడంతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలు, కోళ్లు, మేక పిల్లలు, లేగ దూడలపై దాడులు చేస్తున్నాయి. ఈ సంఘటనలు చూసిన వారెవరైనా ఎదురు తిరిగితే తెగబడి గాయపరుస్తున్నాయి. వర్షాకాలం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో కల్లాల వద్ద ఎవరూ ఉండడం లేదు. దీంతో అక్కడ లేగ పెయ్యలను కుక్కలు చంపుతున్నాయి. ఇక రహదారలపై వాహన చోదకుల వెంటపడుతున్నాయి. వారు భయపడి స్పీడ్‌ పెంచితే మరింత రెచ్చిపోతున్నాయి. దీతో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది గాయాలపాలయ్యారు. సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. కోర్టు ఆదేశాలు ఉన్నందున కుక్కల జోలికి తాము పోలేమని అధికారులు చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో గ్రామీణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వీటి బెడద తప్పడంలేదని వాపోతున్నారు. కుక్కలను చంపకపోయిన కనీసం పట్టుకుని  దూరంగా విడిచి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement