అపకారికి ఉపకారం

ABN , First Publish Date - 2020-10-02T08:05:04+05:30 IST

పెరుగును కవ్వంతో చిలికినా అది ఓర్పుతో వెన్ననిచ్చినట్టుగా.. గొప్ప గుణవంతునికి ఇతరులు కీడు చేసినా అతడు వారికి మేలే చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుచేయడని కవి హృదయం...

అపకారికి ఉపకారం

  • ఉరుగుణవంతుఁడొడ్లు తనకొండపకారము సేయునప్పుడున్‌
  • బరహితమే యొనర్చు నొక పట్టున నైనను కీడు సేయగా
  • నెరుగడు నిక్కమే గద! యదెట్లన కవ్వము బట్టి యెంతయున్‌
  • దరువగ జొచ్చినం బెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా!


 పెరుగును కవ్వంతో చిలికినా అది ఓర్పుతో వెన్ననిచ్చినట్టుగా.. గొప్ప గుణవంతునికి ఇతరులు కీడు చేసినా అతడు వారికి మేలే చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుచేయడని కవి హృదయం. సమాజంలో వ్యక్తులు మంచి లక్షణాలు కలిగినవారు, చెడ్డ లక్షణాలు కలిగినవారని రెండు విధాలుగా ఉంటారు. సుగుణవంతులు అహర్నిశలూ ఎదుటి వారి మంచి కోరి వర్తిస్తారు. దుర్గుణాలు కలిగినవారు.. ఎల్ల వేళలా ఇతరులను కష్టపెట్టడానికే యత్నిస్తారు. మనకు ఉపకారం చేసినవారికి తిరిగి మంచి చేయడం గొప్ప కాదని.. మనకు చెడు తలపెట్టినవారికి సైతం ఉపకారం చేసేవాడే గొప్ప (అపకారికినుపకారము నెపమెన్నక చేయువాడె నేర్పరి) అని సుమతీ శతక కర్త బద్దెన ఏనాడో చెప్పాడు. ఇది పాండవులకు అతికినట్టు సరిపోతుంది. భారతంలో పలు ఘట్టాల్లో, సందర్భాల్లో పాండవుల్లో కనిపించే ఈ గుణం వారి సమర్థతను, సుగుణ సంపదను నిరూపిస్తుంది.


ఉదాహరణకు.. పాండవులు అరణ్యవాసంలో భాగంగా ద్వైతవనంలో ఉండి ధర్మాచరణ చేస్తూ జీవిస్తున్నప్పుడు..  తన వైభవాన్ని ప్రదర్శించడం ద్వారా వారిని పరిహసించి, బాధించాలనే దురుద్దేశంతో దుర్యోధనుడు పటాటోపంతో, సకల పరివారంతో, స్త్రీజనంతో అక్కడికి వెళ్లాడు. అందుకోసం.. ‘గో రక్షణ’ కోసం అడవికి వెళ్తానని సాకు చెప్పి తన తండ్రియైున ధృతరాష్ట్రుణ్ని మోసం కూడా చేశాడు. కానీ.. అక్కడికి వెళ్లి చిత్రసేనుడనే గంధర్వుడితో తలపడి ఓడిపోయాడు. దుర్యోధనుడితోపాటు దుశ్శాసనుడు, కర్ణుడు తదితరులంతా గంధర్వుని చేతిలో బందీలైతే పరివార జనం వెళ్లి ధర్మరాజును వేడుకున్నారు. కౌరవులు తమకు అంత అన్యాయం చేసినా.. అడవులపాలు చేసినా.. ఉపకారమే కర్తవ్యంగా భావించే ధర్మరాజు వారి పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాయాదుల బాధను పోగొట్టడానికి సిద్ధమయ్యాడు. అందుకు భీముడు ససేమిరా అంటే.. ‘ఇది మన వంశానికే అపఖ్యాతి’ అని చెప్పి తమ్ములతో కలిసి వెళ్లి గంధర్వరాజును ఓడించి దుర్యోధనుణ్ని, అతడి సోదరులను విడిపించాడు. దురాలోచనతో చేయరాని పనులు చేసేవారు తమకు తామే దుఃఖాన్ని కొనితెచ్చుకుంటారనడానికి కౌరవులు నిదర్శనమైతే.. అపకారం చేసినవారికి సైతం ఉపకారం చేయడం ద్వారా ధర్మానికి కట్టుబడేవారు అంతిమంగా విజయం సాధిస్తారనడానికి పాండవులు ఉదాహరణ.  సాటివారికి ఉపకారం చేయడమే మానవత్వం. ఎదుటివారికి అపకారం తలపెట్టడమే దుఃఖానికి మూలం.

- వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-10-02T08:05:04+05:30 IST