బాధ్యతగా విధులు నిర్వహించండి

ABN , First Publish Date - 2021-07-31T06:43:46+05:30 IST

సచివాలయ సిబ్బంది బాద్యతాయుతంగా విధులు నిర్వహించాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ పేర్కొన్నారు.

బాధ్యతగా విధులు నిర్వహించండి
పీసీపల్లిలో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సబ్‌కలెక్టర్‌

ఉద్యోగులకు సబ్‌కలెక్టర్‌ దిశానిర్దేశం

పలుగ్రామాల్లో సచివాలయాల పరిశీలన 

సిబ్బంది తీరుపై ఆగ్రహం

కనిగిరి, జూలై 30: సచివాలయ సిబ్బంది బాద్యతాయుతంగా విధులు నిర్వహించాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని 2, 4 సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉన్న ఏఎన్‌ఎంను హైరిస్క్‌ పర్సన్ల గురించి ప్రశ్నించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎం తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు ఫోన్‌ చేసి సిబ్బంది విధి నిర్వహణలో బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, వాటిని సరిచేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా 5వ సచివాలయ పరిధిలోని ఒక వ్యక్తి సబ్‌ కలెక్టర్‌ ఉన్న సమయంలో 4వ సచివాలయానికి వచ్చి తనకు చేయూత పథకం అందలేదన్నారు. తనకు సిబ్బంది తప్పుగా, ఆన్‌లైన్‌ చేయడం వల్ల తాను పథకానికి దూరం అయ్యానన్నారు. దీంతో సంబంధిత 5వ సచివాలయ అడ్మిన్‌ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ పుల్లారావును ఆదేశించారు. అదేవిధంగా శంఖవరం గ్రామంలోని 2వ సచివాలయంలో బయోమెట్రిక్‌ ద్వారా సచివాలయ ఉద్యోగుల హజరు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. 

పీసీపల్లి : సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు నిర్లక్ష్యం వీడి విఽధులు నిర్వహించాలని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ అన్నారు. మండలంలోని గుదెవారిపాలెం, పెదఅలవలపాడు సచివాలయాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.తొలుత గుదేవారిపాలెం సచివాలయాన్ని తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదఅలవలపాడు సచివాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ కార్యదర్శి, సర్వేయర్‌లు విఽధులకు హాజరు కాలేదు. వీరు ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. సర్వేయర్‌ సెలవులో వెళ్లారని సిబ్బంది తెలిపారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించగా వలంటీర్లు కొందరు హాజరు వేసుకుని కార్యాలయానికి రావడం లేదని ఆమె గుర్తించారు. ఒకవైపు ఆమె కార్యాలయంలో తనిఖీ చేస్తుండగా మరోవైపు అప్పుడే వచ్చిన వలంటీర్లు కొందరు బయోమెట్రిక్‌ ద్వారా హాజరు వేసుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ నిర్ణీత గడువులోగా ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి జవాబుదారిగా పనిచేయాలని సూచించారు.ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పఽథకాలు అందించడంతోపాటు రేషన్‌కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని ఆమె వారిని ఆదేశించారు. ఈమె వెంట తహసీల్దార్‌ పోపూరి సింగారావు, మండల పరిషత్‌ పర్యవేక్షణ  అధికారి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-31T06:43:46+05:30 IST