25 శాతం రాబడులు హాంఫట్‌

ABN , First Publish Date - 2020-03-23T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ దెబ్బతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు విపరీతంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల రూపాయల నష్టంవాటిల్లింది. ఇదేతరుణంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లో ...

25 శాతం రాబడులు హాంఫట్‌

  • ఈక్విటీ ఎంఎఫ్‌ పథకాలపై కరోనా దెబ్బ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు విపరీతంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల రూపాయల నష్టంవాటిల్లింది. ఇదేతరుణంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌  (ఎంఎఫ్‌) పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారికీ నష్టాలు తప్పలేదు.  గత నెల రోజుల కాలంలో ఈక్విటీ ఎం ఎఫ్‌ పథకాలు దాదాపు 25 శాతం ప్రతికూల రాబడులను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశీయంగా 44 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కోవిడ్‌-19కు ఈ సంస్థలు ఏమీ అతీతంగా లేవు. రానున్న కాలంలో కూడా మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండవచ్చని, ఫలితంగా స్వల్పకాలం నుంచి మధ్యకాలంలో చిన్న, మధ్యకాలిక ఈక్విటీ పథకాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని ఐఫాస్ట్‌ ఫైనాన్షియల్‌ ఇండియా సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్టు కృష్ణ కర్వా తెలిపారు. అన్ని ఈక్విటీ స్కీమ్‌ కేటగిరీల్లో (ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎ్‌సఎస్‌), మిడ్‌క్యాప్‌, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, లార్జ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, మల్టీ క్యాప్‌) ప్రతికూల రాబడులు వచ్చాయని, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు ఇవి 25-26 శాతం శ్రేణిలో ఉన్నట్టు మార్నింగ్‌స్టార్‌ ఇండియా గణాంకాల ద్వారా వెల్లడైంది. లార్జ్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ 26.63 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ 26.58 శాతం, ఈఎల్‌ఎ్‌సఎస్‌ 26.47 శాతం, మల్టీ క్యాప్‌ 26.45 శాతం, స్మాల్‌ క్యాప్‌ 26.32 శాతం, మిడ్‌ క్యాప్‌ 24.84 శాతం ప్రతికూల రాబడులనిచ్చాయి. బేర్‌ మార్కెట్‌ కారణంగా అన్ని ఫండ్స్‌ కూడా వాటి బెంచ్‌మార్క్‌ సూచీలకన్నా దిగువకు పడిపోయాయి. ఇంతకు ముందు కూడా మార్కెట్లో ఇలాంటి పతనాలను చూశామని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో నిరాశావాదం కొంత కాలం కొనసాగే అవకాశం ఉందని మా ర్నింగ్‌ స్టార్‌ ఇండియా డైరెక్టర్‌ (మేనేజర్‌ రీసెర్చ్‌) కౌస్తుబ్‌ బెలాపుర్కర్‌ తెలిపారు.


సిప్‌లపై కన్నేయండి

ఇన్వెస్టర్లు ఆస్తుల కేటాయింపు, పెట్టుబడులు, క్రమానుగత పెట్టుబడి ప్లాన్ల (సిప్స్‌)పై దృష్టిని కొనసాగించాలన్నారు. రిస్క్‌ను బట్టి ఇప్పటిదాకా ఈక్విటీలకు తక్కువ కేటాయింపులు జరిపిన ఇన్వెస్టర్లు ప్రస్తుత తక్కువ వాల్యుయేషన్లలో ఈక్విటీలో పెట్టుబడులు పెంచుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు 7-10 ఏళ్ల పెట్టుబడుల కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇటీవలి కాలంలో నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ) తగ్గినప్పటికీ లార్జ్‌ క్యాప్‌, బ్లూచిప్‌ ఫండ్స్‌ వేగంగా పూర్వస్థాయికి చేరుకోవచ్చన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది వరకు కాలపరిమితి కలిగిన డెట్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టవచ్చని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. 

Updated Date - 2020-03-23T05:30:00+05:30 IST