పరిశ్రమలపై కనికట్టు వద్దు!

ABN , First Publish Date - 2020-06-06T09:34:10+05:30 IST

వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ పెడుతున్నవారికి.. అది అనుకున్న సమయంలో ప్రారంభమయ్యేలా చూడాలని, వారి కార్యకలాపాలకు ఇదే పెద్ద ప్రోత్సాహం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పరిశ్రమలపై కనికట్టు వద్దు!

  • సకాలంలో ప్రారంభమైతే అదే పెద్ద ప్రోత్సాహం
  • పెట్టుబడికి రిస్కు లేకుండా చూడాలి
  • మాట నిలబెట్టుకునేలా కొత్త విధానం
  • ఎస్‌ఐపీబీపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ 


అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ పెడుతున్నవారికి.. అది అనుకున్న సమయంలో ప్రారంభమయ్యేలా చూడాలని, వారి కార్యకలాపాలకు ఇదే పెద్ద ప్రోత్సాహం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల విషయంలో కనికట్టు వద్దన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పి.. రూ.4 వేల కోట్ల మేర ప్రోత్సాహక బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ఈ బకాయిలు తీర్చేందుకు తాము అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ఇందులో ఇప్పటికే ఎంఎ్‌సఎంఈలకు రూ.450 కోట్లు చెల్లించామని.. మిగతాది దఫాలవారీగా చెల్లిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శుక్రవారమిక్కడ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పెట్టుబడులకు రిస్కు లేకుండా చూడాలన్నారు.


పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకొచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్న విషయమై ఆయన పలు అంశాలను నిర్దేశించారు. నిజాయితీగా ఉండాలని, విధానంలో ఉన్న నిబందనలను అమలుచేసి తీరాలని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చామని, దానికోసం యువతకు అవసరమైన నైపుణ్యాలను కల్పించాలన్నారు. ‘కాలుష్య నియంత్రణ మండలిలో నిపుణులైన వారితో ఒక కమిటీ ఏర్పాటుచేయాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో కాలుష్య నియంత్రణ బోర్డును టై-అప్‌ చేయాలి. పరిశ్రమ ఏర్పాటుచేస్తామని ముందుకొచ్చినవారి ప్రతిపాదనను ముందుగా ఈ కమిటీకి పంపించాలి. దాని సిఫారసులు సానుకూలంగా వస్తే.. పెట్టుడుల ప్రోత్సాహక బోర్డు ముందుకు ఈ ప్రతిపాదన వెళ్తుంది. బోర్డు ఆ ప్రతిపాదనపై ప్రజెంటేషన్‌ ఇచ్చాక ప్రభుత్వం అనుమతులిస్తుంది. తర్వాత సింగిల్‌విండో వ్యవస్థ వారికి అండగా నిలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటులోనే గాక.. తర్వాత కాలంలో కూడా అండగా నిలుస్తాం. ఈ విధానం కారణంగా పెట్టుబడిదారులకు రిస్కు తగ్గుతుంది’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, జయరాములు, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌ పాల్గొన్నారు.


సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ

సీఎం జగన్‌తో సినీనటుడు మంచు విష్ణు బేటీ అయ్యారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌తో కలసి మర్యాదపూర్వకంగా విష్ణు కలిశారు. వైఎస్‌ కుటుంబంతో ఆయనకు బంధం ఉండడంతో ఈ కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - 2020-06-06T09:34:10+05:30 IST