ప్రాధాన్యాలు తెలియవా?

ABN , First Publish Date - 2020-07-08T05:51:26+05:30 IST

రోమ్‌ తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని నీరో చక్రవర్తిని ఇప్పటికి కూడా ఆడిపోసుకుంటూ ఉంటాము కానీ, చరిత్రలో ఎందరెందరు రాజులు, పాలకులు, ధనాఢ్యప్రభువులు సందర్భానికి తగని కులాసాలలో, విలాసాలలో, వ్యాపకాలలో మునిగి తేలలేదు?

ప్రాధాన్యాలు తెలియవా?

రోమ్‌ తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని నీరో చక్రవర్తిని ఇప్పటికి కూడా ఆడిపోసుకుంటూ ఉంటాము కానీ, చరిత్రలో ఎందరెందరు రాజులు, పాలకులు, ధనాఢ్యప్రభువులు సందర్భానికి తగని కులాసాలలో, విలాసాలలో, వ్యాపకాలలో మునిగి తేలలేదు? వారి సోదరులు వర్తమానంలో ఎందరెందరు పరధ్యానమో పరాకో చిత్తగించడంలేదు? అత్యవసరమైన స్పందన అవసరమైన చోట ఉదాసీనత, సమస్య ఒక చోట ఉంటే మరో చోట దృష్టి నిలపడం, ఆదుకోవలసినది వదిలిపెట్టి, ఆదమరిచిపోవడం- ఇవన్నీ ఆధునిక పాలకులకు కూడా అలవాటైన విషయాలే! కేంద్ర ప్రభుత్వ పెద్దలను చూడండి, కరోనా మృత్యువు నుంచి సాధ్యమైనన్ని ప్రాణాలను రక్షించడానికి ఏమి చేయాలో ఆలోచించడం మానేసి, ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీది నుంచి ఏమి ప్రకటించాలా, వచ్చే బిహార్, బెంగాల్ ఎన్నికలకు ఏమి ఉద్వేగవ్యూహం పన్నాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రాలకు కాసిన్ని వేడినీళ్లకు చన్నీళ్లలాగా సాయం చేయడం ఆపేసి, వాళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, వీలయితే, పగ్గాలు తామే చేపట్టాలని కూడా ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అయితే, కరోనా యుద్ధాన్ని అధికారులకు అప్పగించేసి, రాజ్యాంగ వ్యవస్థలను ఎట్లెట్లా బలహీనపరుద్దామా, కోర్టుల చేతిలో ఎట్లా కొత్తరకం చివాట్లు తిందామా అన్న తహతహలో ప్రభుత్వ పెద్దలు పడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ అని చెప్పి అటే వెళ్లిపోయిన నాయకుడు, అంగలు వేస్తూ పెరిగిపోతున్న కరోనా అంకెలను చూడడం మానేసి, పాతభవనాలను కూల్చివేయడంలో పారవశ్యం పొందుతున్నారు. జబ్బు వ్యాపించకుండా చూడడం మానేసి, తలుపులు బార్లా తెరిచి, అదిగో టీకా ఇదిగో టీకా అని జనరంజక విన్యాసాలెందుకు ఇప్పుడు ఢిల్లీకి? శాస్త్రంతోనే పరాచికమా? హైదరాబాద్ లాంటి మహానగరం లేదు కాబట్టి కొంచెం తక్కువ ప్రమాదంలోనే ఉన్నప్పటికీ, చిన్నపట్టణాలకు, గ్రామాలకు కూడా పాకిన కరోనాతో ఆంధ్రప్రదేశ్ సతమతమవుతున్నది. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల మీద మరో సురక్షిత రాజ్యాంగ స్థానం నుంచి విమర్శలు అవసరమా? ఎంపి అనర్హత కోసం హస్తినరాయబారం ఇప్పుడే ఎందుకు? 


తెలంగాణ సంగతి చెప్పనక్కరలేదు. ప్రజలలో గందరగోళం, భయం. ఏవేవో దయనీయమైన దారుణ సంఘటనలు రోజూ వినవస్తూనే ఉన్నాయి. ఇన్నిన్నై కేసుల సంఖ్య పెరిగిపోతున్నా, నిర్లిప్తంగా ఉన్నదనలేము కానీ, ప్రభుత్వం నిస్సహాయంగా మారిపోయింది. సకాలంలో స్పందన దొరకక రోగుల ఆక్రందనలు, అంతిమ క్షణాల ఆర్తనాదాలు, చివరకు అంత్యక్రియల వివాదాలు- మొత్తం పరిస్థితిని దయనీయంగా దీనంగా మార్చివేస్తున్నాయి. వేగంగా పరిణమిస్తున్న పరిస్థితిని చూసి బెంబేలు పడ్డారో, ఏమీ చేయలేమన్న బాధనో, ఏమీ చేయాలన్న ఉద్దేశ్యంలేదో.. కానీ ఆశావహమైన ఒక్క నిర్ణయం, ఒక్క పరిణామం కూడా కనిపించలేదు. ఢిల్లీలో పదివేల పడకల ఆస్పత్రి రక్షణశాఖ సంస్థలు నిర్మించాయట. అంతటి శక్తి లేకపోయినా, అందరినీ కలుపుకొని ఏదో యుద్ధం చేస్తున్నట్టు కనీసం అభినయించవచ్చును కదా? తిరువనంతపురంలో ఒకరోజు 80 కేసులు వచ్చేసరికి, అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. మూడంచెల లాక్‌డౌన్‌. ఇక్కడ రోజుకు రెండువేల లెక్క సమీపిస్తున్నప్పటికీ, ఎటువంటి ప్రత్యేక చర్యలూ లేవు. కేరళ ఏమి చేస్తున్నది, ఢిల్లీలో ఏమి చేస్తున్నారు, తమిళనాడు నుంచి నేర్చుకోదగ్గవేమిటి? ఆంధ్రప్రదేశ్‌లో సహితం, పరీక్షల సంఖ్య, నాణ్యత విషయంలో విమర్శలు ఉన్నాయి కానీ, వ్యాధిగ్రస్తులను, వారి కాంటాక్టులను గుర్తించడంలో, ఇతర ప్రాంతాల వారిని కట్టడి చేయడంలో మంచి పద్ధతులను పాటిస్తున్నారన్న మాటలు వింటున్నాము. ప్రజలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ప్రజల నుంచి, సమాజం నుంచి సహకారం అర్థించకుండా, తమ వ్యూహం ఏమిటో దాని సమర్థన ఏమిటో చెప్పకుండా, అగమ్యంగా పాలన పయనిస్తున్నది. ఈ స్థితిలో సచివాలయం కూల్చివేత అంత అత్యవసరంగా అవసరమా? న్యాయస్థానం తీర్పు సానుకూలంగా వచ్చిన తరువాత, తొందర ఎందుకు? ప్రతిపక్షాలు సచివాలయం కూల్చివేతను, కొత్త సచివాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించాయి కాబట్టి, వారిపై సాధించిన విజయాన్ని వేడుక చేసుకోవడానికి తప్ప, ఇప్పుడంత అవసరం ఏమిటి? మహా నిర్మాణాలు చేయగలిగిన సమర్థులకు కూడా కూల్చివేతలలో ఈ ఆనందం ఏమిటి? తెలుగురాష్ట్రాధినేతలకు, కేంద్ర ప్రభువులకు కూడా కూల్చివేతలలో ఏదో ఉమ్మడి అభిరుచి దాగి ఉన్నది. 


మనకూ చైనాకూ మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం సంగతి పక్కనపెడితే, వైరస్ వ్యాప్తి మొదట జరిగిన ఆ దేశం, ఎట్లా అతి తక్కువ కాలంలో కట్టడి చేయగలిగింది? ఆ దేశంలో నియంతృత్వం ఉన్నది, అక్కడ కఠిన శిక్షలు విధిస్తారు, అందుకే సాధ్యపడుతుంది- అని చెప్పే సమాధానాలకు ఎటువంటి చెల్లుబాటు లేదు. అంతగొప్ప ప్రజాస్వామ్యమేదీ ఏ దేశంలోనూ అమలు కావడంలేదు. కరోనా కాలంలోనే కదా జార్జి ఫ్లాయిడ్ ఉదంతం జరిగింది? పావుగంట సేపు దుకాణం అదనంగా తెరిచి ఉంచితేనే, తండ్రీకొడుకులకు లాకప్‌లో మరణశిక్ష విధించిన సంఘటనలు చూశాము. ఊపా కేసుల విజృంభణ, అనారోగ్యబాధితులకు, వయోవృద్ధులకు కూడా సడలింపులు లేని నిర్బంధాలు- అవన్నీ ఈ కాలంలోనే కదా జరుగుతున్నాయి? చైనాలో నిర్బంధ విధానాల వల్లనే విజయం సాధించారన్నది చేతకాని నెపమే తప్ప, అందులో వాస్తవం తక్కువ. అక్కడ ప్రభుత్వ విధానాలకు ప్రజల సహకారం లభించడం వల్లనే కట్టడి సాధ్యమైంది. వియత్నాంలో, న్యూజీలాండ్‌, క్యూబాలో, మన దేశంలోని కేరళలో- అనుసరించిన విధానాల వెనుక రాజకీయ దృఢ సంకల్పం ఉన్నది. తాత్కాలికంగా నష్టపోయి అయినా, దీర్ఘకాలంలో ప్రయోజనం పొందాలన్న వ్యూహం ఉన్నది. అన్నిటికి మించి సొంతంగా ఆలోచించే సృజనాత్మకత ఉన్నది. ఎందుకు ఇతరుల నుంచి మంచిని నేర్చుకొనకూడదు? ఈ ప్రళయ కాలంలోనే రాజకీయ స్వార్థాలను, రాజకీయ ప్రతీకారాలను నెరవేర్చుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? 


ప్రభుత్వాల వల్ల, పాలకుల వల్ల అయ్యేదేదో అవుతుంది, కానిదేదో కాదు. దాన్ని పక్కనబెట్టి, దేశంలోని పౌరసమాజం ఈ సమయంలో ఏమి చేయనున్నది అన్నది ప్రశ్న. ఎందుకు ప్రతిపక్షాలు, ఉద్యమపార్టీలు, సంఘాలు పరిస్థితిని తమ చేతిలోకి తీసుకోవడం లేదు? తమ తమ రాజకీయాల సానుభూతిపరులైన వైద్య, ఆరోగ్య నిపుణులను, కార్యకర్తలను ఎందుకు సమీకరించడం లేదు? ప్రజలలో భయాన్ని పోగొట్టి, జాగ్రత్తలను మరింత జాగ్రత్తగా పాటించేట్టు ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాయి? ఉన్న సదుపాయాలు కావలసినవారికి న్యాయమైన రీతిలో అందేటట్టు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలలో ఉండే స్థానిక నాయకులు, చట్టసభల ప్రతినిధులు ఎందుకు ప్రయత్నించడం లేదు? నాయకులు చెబితే మొక్కలను నాటడానికి పరిగెత్తుకు వచ్చే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు- ఎందుకు తమను తాము ప్రజాకార్యకర్తలుగా మలచుకోవడం లేదు? వామపక్షాలతో సహా, అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి, ఉద్యోగ సంఘాలు కరోనా కట్టడి, చైతన్యం, ప్రచారం, ఆరోగ్యసేవల అందుబాటు వంటి అంశాలపై పూనుకోవలసిన సమయం వచ్చింది. లేకపోతే, భవిష్యత్తు క్షమించదు.

Updated Date - 2020-07-08T05:51:26+05:30 IST