బైడెన్‌పై ఎందుకంత ప్రేమ.. మీడియాపై ట్రంప్ మండిపాటు !

ABN , First Publish Date - 2020-10-29T23:49:05+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ, సోషల్ మీడియాపై మండిపడ్డారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించిన అవినీతి వార్తలను ఇరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నాయని దుయ్యబట్టారు.

బైడెన్‌పై ఎందుకంత ప్రేమ.. మీడియాపై ట్రంప్ మండిపాటు !

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయ, సోషల్ మీడియాపై మండిపడ్డారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించిన అవినీతి వార్తలను ఇరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నాయని దుయ్యబట్టారు. మీడియా వాళ్లు బైడెన్‌, ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి సిద్ధంగా లేరని ట్రంప్ ఆరోపించారు. బైడెన్‌పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. మాస్కో మాజీ మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన జో బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్‌ డాలర్లు అందినట్లు ట్రంప్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా, ఉక్రెయిన్ నుంచి కూడా బైడెన్ కుటుంబానికి భారీగా నగదు అందిందని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. 


బైడెన్‌ నుంచి లబ్ధి పొందిన మీడియా సంస్థలు, టెక్‌ కంపెనీలు ఆయనను రక్షించేందుకు తెగ ఆరాట పడుతున్నాయని ట్రంప్ మీడియాపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి పరిస్థితిలో మీడియా ముందెన్నడూ లేదని పేర్కొన్నారు. ప్రజలకు నిజాలను తెలియజేయాల్సిన మీడియా ఇలా చేయడం బాధాకరం అని అన్నారు. బైడెన్ గెలిస్తే అమెరికా ఉద్యోగాలను కొల్లగొట్టడానికి చైనాను అనుమతించడం ఖాయమని మరోసారి ట్రంప్ విమర్శించారు. అంతేగాక ఈ ఎన్నికలు  ప్రభుత్వ సూపర్‌ ఎకనామిక్‌ రికవరీకి, బైడెన్‌ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్నాయని... ప్రజలు తమకు ఏది కావాలో నిర్ణయించుకోవాలని అధ్యక్షుడు అన్నారు. అరిజోనాలోని బుల్‌హెడ్ నగరంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మొన్న తన అభిమాన న్యూస్ ఛానల్ ఫాక్స్ న్యూస్‌పై కూడా ట్రంప్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. డెమొక్రటిక్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు మద్దతుగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ఫాక్స్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆ ఛానల్‌పై మండిపడ్డారు.   

Updated Date - 2020-10-29T23:49:05+05:30 IST