అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో.. కరోనానే కీలక అస్త్రం

ABN , First Publish Date - 2020-07-08T00:20:35+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో.. కరోనానే కీలక అస్త్రం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు. మరోపక్క డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ తలపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అయితే ఈ సారి ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఎక్కువ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం కరోనా మహమ్మారి చుట్టూనే రాజకీయం సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ లోపం కారణంగానే అమెరికాలో ఈ పరిస్థితి ఏర్పడిందంటూ జో బైడెన్ విరుచుకుపడుతున్నారు. మరోపక్క ట్రంప్ సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నారంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్‌ను కొనియాడుతున్నారు. కరోనా దేశాన్ని కుదిపేస్తున్నా ట్రంప్ ఎకానమీని సమర్థవంతంగా నడిపించారని రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ కరోనాను ఎదుర్కొన్న తీరుపై వ్యతిరేకత పెరిగినప్పటికి.. ఆర్థిక రంగాన్ని మాత్రం ట్రంప్ సమర్థవంతంగానే నడిపించారని అమెరికాలోని మెజారిటీ ప్రజలు చెబుతుండటం విశేషం. 


ఇదిలా ఉంటే.. ట్రంప్ కరోనాపై రోజుకో మాట చెబుతూ విమర్శల పాలవుతున్నారు. కరోనా దానంతటే అదృశ్యమైపోతుందంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను డెమొక్రటిక్ పార్టీ నేతలు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. మరోపక్క కరోనాకు చైనానే కారణమన్న దానిపై ట్రంప్ ఎక్కువగా ఫోకస్ చేయాలని రిపబ్లికన్ సెనేటర్లు, ఆ పార్టీ నేతలు ట్రంప్‌కు సూచిస్తున్నారు. ఒకపక్క చైనాను విమర్శిస్తూనే.. అమెరికా ఏ విధంగా కరోనాను ఎదుర్కొన్నది అనే దానిపైనే ట్రంప్ ఎక్కువగా మాట్లాడే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రపంచదేశాల కంటే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోందని.. వెంటిలేటర్ల కొరత కూడా లేకుండా చేస్తోందంటూ ట్రంప్ తన స్పీచ్‌లలో చెబుతుండటం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఏప్రిల్, మే నెలల్లో నిరుద్యోగ రేటు పెరగగా.. జూన్, జులైలో మళ్లీ ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నట్టు ఈ మధ్య కాలంలో ట్రంప్ ఎక్కువగా చెప్పడం గమనించవచ్చు. ఇక ట్రంప్ మైక్ అందుకున్న ప్రతిసారి చైనా కారణంగానే ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి చెందిందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మాత్రం ట్రంప్ నాయకత్వ లోపాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్రంప్ కంటే 11 పాయింట్ల లీడ్‌లో ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన నాటి నుంచి ఆయనకు అమెరికన్ ప్రజల నుంచి మద్దతు పెరుగుతూ వస్తోంది. మరి అధ్యక్ష పదవి ఎన్నికల్లో కరోనా అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి.

Updated Date - 2020-07-08T00:20:35+05:30 IST