క‌రోనా వ్యాక్సిన్ కోసం అమెరికా మ‌రో భారీ డీల్ !

ABN , First Publish Date - 2020-08-12T18:38:08+05:30 IST

అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అగ్ర‌రాజ్యం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ముమ్మ‌రంగా ప్ర‌త్నిస్తోంది.

క‌రోనా వ్యాక్సిన్ కోసం అమెరికా మ‌రో భారీ డీల్ !

వాషింగ్ట‌న్ డీసీ: అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అగ్ర‌రాజ్యం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ముమ్మ‌రంగా ప్ర‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే దేశంలోని ప‌లు కంపెనీల‌తో భారీ డీల్స్ కుదుర్చుకుంటోంది. తాజాగా యూఎస్ బయోటెక్ కంపెనీ మోడెర్నాతో 100 మిలియన్ మోతాదుల కోవిడ్‌ వ్యాక్సిన్ కోసం ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మే నెల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ కోసం కుదిరిన ఆరో డీల్‌గా దీనిని ఆయ‌న‌ పేర్కొన్నారు. మోడెర్నాతో కుదిరిన ఈ భారీ ఒప్పందం గురించి ప్ర‌క‌టించ‌డం త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌ని వైట్ హౌస్ వ‌ద్ద జ‌రిగిన మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు. "ఫెడరల్ ప్రభుత్వం ఈ టీకా మోతాదులను కలిగి ఉంటుంది. మేము వాటిని కొనుగోలు చేస్తున్నాము. టీకా ఆమోదించబడిన వెంటనే 100 మిలియన్ మోతాదులను వేగంగా ఉత్పత్తి చేయడానికి డీల్ కుదిరింది. కొంతకాలం తర్వాత ఈ మోతాదుల‌ను 500 మిలియన్ల వరకు పెంచుతాం. కాబట్టి మా వ‌ద్ద‌ 600 మిలియన్ డోసులు ఉంటాయి" అని ట్రంప్ తెలిపారు. 


ఇక మోడెర్నా, యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) కలిసి ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. MRNA-1273 అని పిలువబడే ఈ వ్యాక్సిన్‌ను మోడెర్నా, ఎన్ఐహెచ్‌కు చెందిన‌ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్(ఎన్ఐఏఐడీ) కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. దీనికి డాక్టర్ ఆంథోనీ ఫౌసీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు టీకా యొక్క సామర్థ్యాన్ని పరిశోధకులు తెలుసుకునే అవకాశం ఉంద‌ని ఫౌసీ చెప్పారు. అయితే, నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే... అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే లక్ష 67 వేల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. అలాగే 53 లక్ష‌ల మందికి ప్ర‌బ‌లింది. 

Updated Date - 2020-08-12T18:38:08+05:30 IST