ఆ దేశాలపై వీసా ఆంక్షలను పొడిగించిన ట్రంప్ !

ABN , First Publish Date - 2020-12-31T19:08:15+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో యూఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆ దేశాలపై వీసా ఆంక్షలను పొడిగించిన ట్రంప్ !

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో యూఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో చట్టాలను ఉల్లంఘించిన పౌరులను స్వదేశానికి రప్పించడానికి నిరాకరించిన దేశాలపై వీసా ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. కాగా, గతంలో అటువంటి దేశాలపై వీసా ఆంక్షలు డిసెంబర్ 31 వరకు ఉన్నాయి. అయితే, తాజాగా దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నందున ఆయా దేశాల పౌరుల వైఖరి వల్ల అమెరికన్ల ఆరోగ్య సమస్యలు మరింత జఠిలమయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ వీసా ఆంక్షలు ప్రెసిడెంట్ ఉపసంహరించుకునేంత వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 


ఇక అగ్రరాజ్యం చట్టాలను ఉల్లంఘించిన తమ పౌరులను స్వదేశానికి రప్పించడానికి నిరాకరిస్తున్న దేశాలను అమెరికా ముప్పుగా భావిస్తోంది. ఆయా దేశాల పౌరులు అనుసరిస్తున్న వైఖరి తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్ 10న ఆయా దేశాలకు వీసా జారీలో నిషేధ ఆంక్షలు విధించారు. దీనిప్రకారం ఆయా దేశాల పౌరులకు వీసాల జారీని నిరాకరించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్‌లకు కల్పించారు. తాజాగా ఈ ఆంక్షలను ట్రంప్ నిరవధికంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

Updated Date - 2020-12-31T19:08:15+05:30 IST