సుప్రీం కోర్టు జడ్జి నియామకంపై మాట మార్చిన ట్రంప్ !

ABN , First Publish Date - 2020-09-22T18:41:51+05:30 IST

పాన్‌క్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించిన అమెరికా సుప్రీం కోర్టు జడ్జి రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) స్థానంలో కొత్త జడ్జిని నియమించే విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు.

సుప్రీం కోర్టు జడ్జి నియామకంపై మాట మార్చిన ట్రంప్ !

వాషింగ్టన్‌ డీసీ: పాన్‌క్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించిన అమెరికా సుప్రీం కోర్టు జడ్జి రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) స్థానంలో కొత్త జడ్జిని నియమించే విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. రెండు రోజుల ముందు రూత్ స్థానంలో కొత్త జడ్జి కోసం ఇద్దరు మహిళా న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెప్పిన ట్రంప్... సోమవారం ఏకంగా ఐదుగురు మహిళా న్యాయవాదులను ఈ పదవి కోసం పరిశీలిస్తున్నామని అన్నారు. అంతేగాక శనివారం వీరిలో ఒకరిని నామినేట్ చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కంటే ముందే జడ్జి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. 


శ్వేతసౌధం నుంచి ఒహియో ఎన్నికల ప్రచార ర్యాలీకి బయల్దేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. "గిన్స్‌బర్గ్‌ తన చివరి కోరికగా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత తన స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని కోరినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు." అని అన్నారు. అయితే, నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్) మాత్రం ఫెమినిస్ట్ గిన్స్‌బర్గ్‌ ఈ విషయాన్ని తన మునిమనవరాలితో చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు డెమొక్రాట్లు మాత్రం అధ్యక్ష ఎన్నికల తర్వాత... కొత్త అధ్యక్షుడు సుప్రీం కోర్టు జడ్జిని నియమించాలని పట్టుబడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ట్రంప్ జడ్జి నియామకం విషయమై తొందరపడుతున్నారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ సైతం‌ విమర్శించిన సంగతి తెలిసిందే.


ఇదిలాఉంటే... ట్రంప్ మరో దఫా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన ప్రత్యర్థి జో బైడెన్‌ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల వెలువడిన సర్వే ఫలితాలు మాత్రం ఈసారి ట్రంప్‌కు పరాభవం తప్పకపోవచ్చని తేల్చాయి. అమెరికన్ ఓటర్లు అధికంగా బైడెన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది. 

Updated Date - 2020-09-22T18:41:51+05:30 IST