నిరసనల అణచివేతకు సైన్యాన్ని దింపడంపై వెనక్కు తగ్గిన డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2020-06-03T22:08:05+05:30 IST

అమెరికాలో పెల్లుబికిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని దింపుతానని

నిరసనల అణచివేతకు సైన్యాన్ని దింపడంపై వెనక్కు తగ్గిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికాలో పెల్లుబికిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని దింపుతానని హెచ్చరించిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. స్థానిక ప్రభుత్వాలు శాంతిభద్రతలను సాధారణ స్థితికి తేవాలని వైట్ హౌస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. 


నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ‌హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి వైట్ హౌస్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నిరసనలను నిలువరించేందుకు సైన్యాన్ని దింపుతానని ట్రంప్ హెచ్చరించారు. 


ఇదిలావుండగా మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసాత్మక సంఘటనలు తగ్గడంతో ట్రంప్ కాస్త మెత్తబడినట్లు వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. సైన్యాన్ని దింపి, నిరసనలను అణచివేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపాయి. 


వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం మాట్లాడుతూ దేశ రాజధాని నగరంలో నిరసనలను అణచివేయడం ద్వారా మిగతా రాష్ట్రాలకు ఓ ఉదాహరణగా నిలవాలని ట్రంప్ భావించినట్లు తెలిపారు. అవసరమైతే సైన్యాన్ని ఏ విధంగా మోహరించాలో డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రణాళికను కూడా రూపొందించిందన్నారు. 


మిన్నెపోలీస్‌లో ఓ శ్వేత జాతి పోలీసు అధికారి తన మోకాలితో నొక్కిపెట్టడం వల్ల  నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మరణించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. గత పదేళ్ళలో ఈ స్థాయిలో అశాంతి అమెరికాలో కనిపించలేదు. 


Updated Date - 2020-06-03T22:08:05+05:30 IST