కొనరు.. కొననివ్వరు

ABN , First Publish Date - 2021-11-26T09:46:50+05:30 IST

కొనరు.. కొననివ్వరు

కొనరు.. కొననివ్వరు

రైతుకు సంకటంగా సర్కారు వైఖరి 

ఆర్బీకేల్లోనే ధాన్యం అమ్మాలని నిబంధన 

మిల్లర్లు నేరుగా కొనరాదని ఆంక్షలు

పట్టించుకోని ఆర్బీకే సిబ్బంది 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు రైతులకు సంకటంగా మారాయి. ఈ ఏడాది నుంచి ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మకుండా, రైతుభరోసా కేంద్రాల్లోనే అమ్ముకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి, ఇంతవరకు అత్యధిక ఆర్బీకేల్లో ధాన్య సేకరణ మొదలు కాలేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ధాన్యం సత్వరం అమ్ముకోకపోతే, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. గత నెల రోజులుగా కోతకొచ్చిన వరిపైరును కోయడానికి వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు కాస్త తెరపుగా ఉన్నందున కోసి నూర్పిడి చేసి, ఆరబెట్టి, అమ్మకానికి సిద్ధం చేస్తే, అత్యధిక ఆర్బీకేలు ఇంకా సన్నద్ధం కాలేదు. ఆర్బీకే సిబ్బంది కనీసం ధాన్యం చూడటానికి కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనడానికి గోనె సంచుల కొరత ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఇప్పటికే కోసి, నూర్పిడి చేసిన రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఎక్కువ రోజులు ఆరబోయలేక, ఇళ్లల్లో నిల్వ చేసుకోకలేక సతమతమవుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇంకా వరి కోయని రైతులు కూడా మళ్లీ భారీ వర్షాలు కురిస్తే, చేలోనే పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.  ఇన్నాళ్లు రైతు పండించిన ధాన్యంలో 35-40ు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, స్థానికంగా వ్యాపారుల ద్వారా మిల్లర్లు మరో 35ు కొనుగోలు చేసేవారు. మిగిలిన ధాన్యం పండించిన రైతులే కుటుంబ అవసరాలకు వినియోగించుకునే వారు. అయితే మిల్లర్లు, స్థానిక వ్యాపారులు రైతులకు సొమ్ము ఎగ్గొడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నందున ఈ ఏడాది నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనటానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఆర్బీకేల్లోనే  ధాన్యం అమ్ముకోవాలని  ప్రభుత్వం నిర్దేశించింది. ఖరీ్‌ఫలో పండించిన ధాన్యం నూర్పిడి చేసి, అమ్ముకునే ప్రస్తుత తరుణంలో అటు మిల్లర్లను సేకరించనీయకుండా, ఇటు ఆర్బీకేల్లో ధాన్య సేకరణ ప్రక్రియ మొదలు పెట్టకుండా పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌ మీనమేషాలు లెక్కిస్తున్నాయ రైతులు మండిపడుతున్నారు. 

Updated Date - 2021-11-26T09:46:50+05:30 IST