Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ బియ్యం తినకండహో..!

ఆలయ మైకు ద్వారా టాంటాం

వెంకటగిరిలో కల్తీ రేషన్‌ కలకలం


కోడుమూరు(కర్నూల్): రేషన్‌ దుకాణాలలో ఈ నెల కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎవరూ తినవద్దని, తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెంకటగిరి గ్రామంలో ప్రజలు టాంటాం వేశారు. చాలామంది అజీర్తితో, కడుపునొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలోని గిడ్డాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మైకు ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. రేషన్‌ బియ్యాన్ని నానబెడితే బొరుగుల తరహాలో తేలుతున్నాయని, అన్నం వండితే ముద్ద అవుతోందని, ఆ ముద్ద పల్లెంలో కొడితే బంతిలా ఎగురుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ నెల ఆరంభంలో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం వండితే ఇలా జరుగుతోందన్నారు.


బియ్యం నానబెట్టి ప్రత్యక్ష్యంగా చూపించారు. పాత్రలో కొన్ని గింజలు తేలియాడుతూ కనిపించాయి. పాఠశాలలో రేషన్‌ బియ్యంతో వండిన అన్నం తిన్న తరువాత తన కూతురు కడుపునొప్పితో బాధపడిందని గిడ్డయ్య అనే వ్యక్తి వాపోయాడు. గ్రామంలోని పాఠశాలకు సరఫరా చేసిన బియ్యం నానబెట్టినా కొన్ని గింజలు తేలుతున్నాయి. ఇలాంటి బియ్యం తింటే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


నీటిపై తేలుతున్నాయి..

ఈ నెల మొదట్లో పంపిణీ చేసిన బియ్యాన్ని వాడుకుంటున్నాం. అన్నం తయారు చేయడానికి ముందు నీటిలో నానబెడితే బొరుగుల మాదిరి తేలుతున్నాయి. అన్నం వండితే ముద్దగా అవుతోంది. డబ్బులు ఇచ్చి ఇలాంటి బియ్యమేనా తెచ్చేది అని నా భార్య నిర్మల ప్రశ్నించింది. విచారిస్తే అందరికీ ఇదే సమస్య ఉందని తెలిసింది. సామాన్యుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఇలాంటి బియ్యాన్ని అధికారులు తింటారా?                  

- శివుడు, వెంకటగిరి

కడుపునొప్పితో ఆస్పత్రికి.. 

కూలీనాలీ చేసుకుని జీవనం గడుపుతున్నాం. ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నాను. నా భర్త సంపాదనతో నెట్టుకొస్తున్నాం. అన్నం తిన్న తరువాత కడుపు నొప్పి వస్తోంది. నాలుగు రోజుల్లో రెండుసార్లు ఆసుపత్రిలో చూపించుకున్నాను. జీర్ణం కాక ఇబ్బంది పడుతున్నాను. అధికారులు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి.   

 - పద్మావతి, గర్భిణి, వెంకటగిరి

మా దృష్టికి తేవాలి..

రేషన్‌ బియ్యంలో సమస్యలు ఉంటే ప్రజలు మా దృష్టికి తేవాలి. వెంకటగిరిలో ప్లాస్టిక్‌ బియ్యం సంగతి మా దృష్టికి రాలేదు. గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే విచారిస్తాం. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళతాం.

- ఉమామహేశ్వరమ్మ, తహసీల్దారు, కోడుమూరు

బియ్యం చూపుతున్న గ్రామస్థులు


Advertisement
Advertisement