పీచుపదార్థాలు మరవద్దు!

ABN , First Publish Date - 2020-02-20T05:57:51+05:30 IST

పిల్లల చదువులు, లక్ష్యాలు మాత్రమే కాదు... అనుకున్నది సాధించాలంటే వాటికి అనువుగా వాళ్ల ఆరోగ్యం కూడా బాగుండాలి. శరీరం శక్తివంతంగా, నిర్మలంగా ఉండాలి. అందుకే శరీరానికి

పీచుపదార్థాలు మరవద్దు!

పిల్లల చదువులు, లక్ష్యాలు మాత్రమే కాదు... అనుకున్నది సాధించాలంటే వాటికి అనువుగా వాళ్ల ఆరోగ్యం కూడా బాగుండాలి. శరీరం శక్తివంతంగా, నిర్మలంగా ఉండాలి. అందుకే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ సంపూర్తిగా అందాలి. ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలతో పాటు శరీరాన్ని నిర్మలంగా ఉంచే పీచు పదార్థాలు తప్పనిసరిగా అందాలి. కీరా లాంటి పీచుపదార్థాలతో పాటుగా విటమిన్లు, లవణాలు ఉండే పండ్లు ఇవ్వాలి. అయితే సమస్య ఏమిటంటే, పరీక్షల వేళ పిల్లల నిద్రా సమయం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. దాంతో మలబద్దకం ఏర్పడుతుంది. మలినాలు బాగా పేరుకుపోయిన వారిలో జీవశక్తి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం మొదలవుతాయి. శరీరం నీరసించి అసహనం, చిరాకు పెరుగుతాయి. సమస్య మరీ ఎక్కువైతే, ఒళ్లంతా దురద, మంట మొదలవుతుంది. పరీక్షల సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే, ఇక వాళ్లు ఏం చదువుతారు? పరీక్షల్లో ఏం రాస్తారు? చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు బలవర్థక ఆహారం ఇవ్వడం మీదే దృష్టి పెడతారు.


కానీ, శరీరంలో నిలిచిపోయే వ్యర్థపదార్థాలను బయటికి పంపే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. ఇది పిల్లలను తరచూ జబ్బుల బారిన పడేలా చేస్తుంది. ఫలితంగా బాగా చదివి మంచి ర్యాంకులు సాధించగలిగే పిల్లలు కూడా అతి తక్కువ మార్కులతో డీలా పడిపోతారు. సరైన తిండి లేకపోతే ఎంత చదివినా విషయాన్ని ఆకళింపు చేసుకుని, గుర్తుంచుకునే శక్తి ఉండదు. ఎంతో కొంత గుర్తున్నా, రాయడంలో ఒక అశక్తత ఏర్పడుతుంది. అందుకే పౌష్టికాహారానికి సరిసమానంగా పీచుపదార్థాలను కూడా ఇస్తూ ఉండాలి. అప్పుడే శరీరం మలినాలు లేకుండా శుభ్రమవుతుంది. అప్పుడే చదివింది గుర్తుంచుకుని పరీక్షలు బాగా రాస్తారు. ఆశించిన మార్కులూ, ర్యాంకూ సాధిస్తారు.

Updated Date - 2020-02-20T05:57:51+05:30 IST