అతిగా తినొద్దు..

ABN , First Publish Date - 2020-09-20T09:23:43+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలామార్పులు చోటుచేసుకున్నాయి.

అతిగా తినొద్దు..

సమతుల ఆహారమే ముద్దు

కరోనా నేపథ్యంలో మారిన ఆహారపు అలవాట్లు

వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంపై దృష్టి

కొంతమంది అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటున్న వైనం

భారీగా పెరిగిన గుడ్లు, చికెన్‌, మటన్‌, డ్రైఫ్రూట్స్‌ వినియోగం

ఒక్క రోజులోనో, నెలలోనే తినే ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగదంటున్న నిపుణులు

ఇది నిరంతరం సాగాల్సిన ప్రక్రియగా పేర్కొంటున్న వైద్యులు



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

కరోనా నేపథ్యంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలామార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎన్నోరకాల వ్యాధుల బారినపడకుండా వుండేందుకు అవకాశముందంటున్నారు. 


కరోనా ఎఫెక్ట్‌..

కరోనా వైరస్‌ రాకముందు వరకూ ఏదో తిన్నాం...అన్నట్టుగానే చాలామంది ఆహారపు అలవాట్లు ఉండేవి. ఉద్యోగ, వ్యాపారరీత్యా వేళకు తినకపోవడం, ఆ తరువాత బయట ఏది దొరికితే అది తినేయడం చేస్తుండేవారు. అయితే వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తరువాత నిపుణులు పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని, తద్వారా వైరస్‌ బారినపడకుండా వుండవచ్చునని, ఒకవేళ పడినా ఎటువంటి ఇబ్బందీ లేకుండా కోలుకోవచ్చునని చెప్పడంతో అంతా ఆ దిశగా ఆహార నియమాలు మార్చుకోవడం ప్రారంభించారు.


నిత్యం ఉండేలా చూసుకోవాలి..

ఆహారంలో ఆకుకూరలు తీసుకుంటే..విటమిన్‌ ఏ, నిమ్మ, ఉసిరి వంటి వాటి ద్వారా విటమిన్‌ సి, నువ్వులు, గుడ్లు, చికెన్‌, మటన్‌ వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్‌ డితోపాటు ప్రొటీన్లు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటి ద్వారా జింక్‌ శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకమని చెబుతున్నారు. ఇంకా రోజూ పండ్లు తీసుకోవాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.


అతితో ఇబ్బందే.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తరువాత కొంతమంది ఆహారాన్ని అతిగా తీసు కుంటున్నారు. ముఖ్యంగా గుడ్లు, చికెన్‌, డ్రై ఫ్రూట్స్‌ వంటివి రోజూ తీసుకుంటూ ఒక్కసారిగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్క రోజులోనో, నెలలోనో అయ్యే పని కాదని...అతి నిరంతరంగా జరగాల్సిన పనిగా నిపుణులు చెబుతున్నారు. అతిగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడం మాట అటుంచితే...లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం వున్నదని హెచ్చరిస్తున్నారు. 


అతిగా మాంసాహారం తీసుకోవడం ప్రమాదకరం..- డాక్టర్‌ కె.సాగర్‌బాబు, కార్డియో థొరాసిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కేజీహెచ్

సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేందుకు అవకాశముంది. కరోనా తరువాత చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం, డ్రైప్రూట్స్‌ అధికంగా తీసుకుంటున్నారు. వీటివల్ల కొలెస్ర్టాల్‌ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంది. కరోనా బారినపడినవారు రికవరీ క్రమంలో ప్రొటీన్లు అధికంగా లభించే మాంసాహారంతోపాటు ఇతర పదార్థాలను కొంతవరకూ తీసుకోవచ్చు.


ముఖ్యంగా రోజువారీ ఆహారంలో అన్నిరకాల విటమిన్లు లభించేలా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు ఇప్పుడు, ఎప్పుడూ దూరంగా ఉండాలి. జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది. అన్నిరకాల కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల రక్తం చిక్కాగా మారుతుంది. కరోనా వైరస్‌ బారినపడిన చాలామందిలో రక్తం గడ్డకట్టడం అనేది సమస్యగా కనిపిస్తోంది. కాబట్టి, అతిగా మాంసాహారం, డ్రైఫ్రూట్స్‌ వంటివి తీసుకోవడం వల్ల కొన్నిరకాల ఇబ్బందులూ ఉన్నాయి. 


నిరంతర ప్రక్రియగా కొనసాగాలి..- డాక్టర్‌ ఆర్‌ రేఖ, పోషకాహార నిపుణురాలు

రోగ నిరోధక శక్తి పెరగడమనేది ఒక్క రోజులోనో, నెలలోనో అయ్యే పని కాదు. అది నిరంతరం జరగాలి. కరోనా తగ్గిన తరువాత మళ్లీ అలవాట్లు మొదటికి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. సమతుల ఆహారాన్ని తీసుకోవడమనేది అలవాటుగా మార్చుకోవాలి. అతిగా తీసుకున్నా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కొన్ని విటమిన్లు కీలకంగా ఉంటాయి. ఆ విటమిన్లు లభించే ఆహారం రోజువారీ డైట్‌లో వుండేలా చూసుకోవాలి. 


Updated Date - 2020-09-20T09:23:43+05:30 IST