నీ ముఖం చూపించకు!

ABN , First Publish Date - 2021-02-13T05:30:00+05:30 IST

విజయనగర సామాజ్య్రంలో కవులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అందులో తెనాలి రామకృష్ణ

నీ ముఖం చూపించకు!

విజయనగర సామాజ్య్రంలో కవులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అందులో తెనాలి రామకృష్ణ అంటే శ్రీకృష్ణదేవరాయలకు ప్రత్యేక అభిమానం ఉండేది. సభలో అందరూ తెనాలి రామకృష్ణను పొగుడుతూ ఉండేవారు. అది ఆ రాజ్య ప్రధాన పూజారికి నచ్చేది కాదు. ఎలాగైనా రాజు ముందు తెనాలి రామకృష్ణను తక్కువ చేయాలని అనుకున్నాడు.


ఒకరోజు ఏడుస్తూ రాజు దగ్గరకు వెళ్లి తెనాలి రామకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా రాజు పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు చెప్పాడు. పూజారి చెప్పిన మాటలు నమ్మిన శ్రీకృష్ణదేవరాయలు వెంటనే తెనాలి రామకృష్ణను సభకు రమ్మని ఆదేశించాడు. రామకృష్ణ సభలో అడుగుపెట్టగానే ‘‘మీ ముఖం మాకు ఎప్పుడూ చూపించొద్దు!’’ అని శ్రీకృష్ణదేవరాయలు ఆజ్ఞాపించాడు. తెనాలి రామకృష్ణ ఏదో చెప్పబోతుండగా ‘‘ఇక చాలు! మీరు చెప్పేది మేం వినదలచుకోలేదు. మీరు మా ఆదేశాలు పాటించాల్సిందే’’ అన్నాడు కోపంగా. దాంతో చేసేదిలేక తెనాలి రామకృష్ణ సభలో నుంచి బయటకు వచ్చేశాడు.


కొద్దిరోజుల తరువాత వేగుల ద్వారా రాజు నిజం తెలుసుకున్నాడు. తెనాలి రామకృష్ణ ఎలాంటి తప్పు చేయలేదని, పూజారి లేనిపోనివి కల్పించి చెప్పాడని అర్థమైంది. వెంటనే రామకృష్ణను వెతికి పట్టుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. ఒకరోజు రామకృష్ణ ముఖం కనిపించకుండా కుండ బోర్లించుకుని సభలో అడుగుపెట్టాడు. అది చూసిన శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యంగా ‘‘ముఖంపై ఆ కుండ ఎందుకు రామా?’’ అని అడిగాడు.


‘‘మహారాజా! విజయనగర పౌరుడిగా రాజు ఆదేశాలను పాటించడం నా బాధ్యత. అందుకే నా ముఖం కనిపించకుండా ఈ కుండ పెట్టుకున్నాను’’ అన్నాడు. రామకృష్ణ సమాధానం విన్న రాజు బిగ్గరగా నవ్వి, కుండ తీయమని అన్నాడు. తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణలు చెప్పాడు.


Updated Date - 2021-02-13T05:30:00+05:30 IST