స్టాక్ ‘మాయ’లో పడొద్దు... రఘురాం రాజన్

ABN , First Publish Date - 2021-01-15T18:56:04+05:30 IST

బిట్ కాయిన్, టెస్లా ఇంక్‌ ల పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కిందటి క్యాలెండర్ ఏడాదిలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా ఎగిసిన విషయం తెలిసిందే.

స్టాక్ ‘మాయ’లో పడొద్దు... రఘురాం రాజన్

ముంబై : బిట్ కాయిన్, టెస్లా ఇంక్‌ ల పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్  కీలక వ్యాఖ్యలు చేశారు. కిందటి క్యాలెండర్ ఏడాదిలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా ఎగిసిన విషయం తెలిసిందే. ఓ సమయంలో ఐదు వేల డాలర్ల వద్ద ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 41 వేలు దాటింది. ఇక టెస్లా ఇంక్ స్టాక్స్ 750 శాతం వరకు పెరిగాయి. దీంతో నిరుడు ప్రారంభంలో 30 కి పైగా ర్యాంకులో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్... ఇప్పుడు ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకారు.  గత నెల రోజుల్లోనే టాప్ 10 లోకి, ఆ తర్వాత నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 2 దాటి జనవరిలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. 


ఇదో క్లాసిక్ బుడగ ...బిట్ కాయిన్ విలువ అంతకంతకూ పెరగడాన్ని రఘురాం రాజన్ బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో మంచి ఉదాహరణ అని, క్లాసిక్ బుడగ అని పేర్కొన్నారు. ‘ ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే... గతేడాది ప్రారంభంలో 10 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ ఈ రోజు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవానికి దీంతో ఎలాంటి విలువ ఉండదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కష్టమే. అయినప్పటికీ బిట్ కాయిన్ ఇప్పటికే 40 వేల డాలర్లకు పైగా చేరుకుంది. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బిట్ కాయిన్‌‌పై పెట్టుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఇది క్లాసిక్ బుడగ వంటిది’ అని పేర్కొన్నారు. 


ఆస్తిగా పరిగణించలేం... ఒకవేళ ప్రపంచం మరో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్‌తో పాటు టెస్లా కూడా గాలి బుడగ మాదిరి దూసుకెళతాయని రంగరాజన్ వ్యాఖ్యానించారు. బుడగ వంటి మార్కెట్ ధోరణి, ద్రవ్యపరపతి విధానం, తక్కువ వడ్డీ రేట్లు వంటివి బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణమని విశ్లేషించారు. బిట్ కాయిన్ ఎంతగా పెరిగినప్పటికీ... దానికి నిజమైన విలువ లేదని, ఒక ఆస్తిగా దీనిని పరిగణించి చెల్లింపులు జరపడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. 


ఇక స్టాక్ మార్కెట్లపై రఘురాం రాజన్ స్పందిస్తూ ‘సెన్సెక్స్ 50 వేల మార్కు దాటవచ్చు’నని  అభిప్రాయపడ్డారు. ఐటీ దిగ్గ‌జ సంస్థ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఆర్థిక ఫ‌లితాలే ఇందుకు కార‌ణమన్నారు. స్టాక్ మార్కెట్‌ల మాయ‌లో ప‌డొవద్దని రాజన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. క‌రోనా సమయంలో కొన్ని పెద్ద కంపెనీలు మాత్ర‌మే లాభప‌డ్డాయని, కానీ చిన్న ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయ‌ని, వెల్లడించారు. 

Updated Date - 2021-01-15T18:56:04+05:30 IST