Oct 17 2021 @ 01:13AM

‘మా’లో రాజకీయాలు వద్దు

‘‘మేం అంతమంది ఉన్నాం ఇంతమంది  ఉన్నామని బెదిరించారు. కానీ ‘మా’ సభ్యులు భయపడలేదు. నా బిడ్డను గెలిపించారు. ఏవైనా సమస్యలు ఉంటే అధ్యక్షుడికి చెప్పండి. టీవీలకు ఎక్కకండి. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలపై వారి సాయం కోరతాం’’ అని నటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు మంచు స్వీకారోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘నటుల్లో కొందరు రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ‘మా’లో మాత్రం రాజకీయాలు ఉండకూడదు. కళాకారులంతా ఒకే తల్లి బిడ్డలు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు తన బాధ్యతలను ఎలా నిభాయిస్తాడో అని భయంగా ఉంది’’ అన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ ‘‘విష్ణు మంచు గెలుస్తాడని పది రోజులు ముందే చెప్పాను. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు ‘మా’కు అందిస్తాం’’ అని చెప్పారు. విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘మోహన్‌బాబు గారి కొడుకుగా నేను ఏం చేయగలనో ఈ రెండేళ్లలో చూపిస్తాను. ప్రత్యర్థి ప్యానల్‌ వారు రాజీనామా చేయడం దురదృష్టం. వారి సలహాలను నేను గౌరవిస్తాను. ఇకపైన జరగబోయే పనుల గురించి మాత్రమే మాట్లాడతాం’’ అని తెలిపారు. వీకే నరేష్‌ మాట్లాడుతూ ‘‘మా’ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరిది. మేం అంతా అందులో భాగం. ఆఖరి శ్వాస వరకూ ‘మా’ కోసం పని చేస్తాను’’ అని చెప్పారు. నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మా’కు మచ్చలేని ప్రెసిడెంట్‌ రావాలని కోరుకున్నాను. రేపు ‘మా’కు అధ్యక్షుడిగా వేరేవాళ్లు వస్తే విష్ణు ఉంటే బాగుండేది అనుకుంటారు. మళ్లీ ఎలక్షన్లు వద్దు అని విష్ణు మీతోనే చెప్పిస్తాడు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.