తూకం తగ్గితే మాకొద్దు..!

ABN , First Publish Date - 2022-08-21T09:13:57+05:30 IST

కార్డు దారుడు రేషన్‌ బియ్యం తీసుకోవాలంటే బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఆ తర్వాతే కార్డుపై ఎన్ని కేజీల బియ్యం ఇవ్వాలో కాటాపెట్టి ఇస్తారు.

తూకం తగ్గితే మాకొద్దు..!

  • బియ్యం తరుగుతో నెలనెలాచాలా నష్టపోతున్నాం
  • కాటా లేకుండా సెప్టెంబరునెల సరుకులు తీసుకోం
  • నేరుగా రేషన్‌ షాపులకు పంపినాదిగుమతి చేసుకోం
  • ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో అక్రమాలపై డీలర్ల తిరుగుబాటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : కార్డు దారుడు రేషన్‌ బియ్యం తీసుకోవాలంటే బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఆ తర్వాతే కార్డుపై ఎన్ని కేజీల బియ్యం ఇవ్వాలో కాటాపెట్టి ఇస్తారు. మరి.. మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచి డీలర్లకు చేరే బియ్యానికి మాత్రం తూకం వేయడం లేదు. ప్రతినెలా రేషన్‌ షాపులకు పంపిస్తున్న పీడీఎస్‌ బియ్యంలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. 50 కేజీల బస్తాకు 2-3 కేజీలు తగ్గుతుండడంతో డీలర్లు భారీగా నష్టపోతున్నారు. ఇక ఈ నష్టాన్ని భరించలేని పరిస్థితుల్లో వచ్చే నెల నుంచి తూకం లేకుండా సరుకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ‘‘రేషన్‌ డీలర్లు ఎవరూ ఈనెల డిస్పాచ్‌ సమయంలో సెప్టెంబరు నెల సరుకులు తీసుకోవద్దు. మండల స్థాయి నిల్వ కేంద్రాల (ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు)లో తూకం వేయకుండా షాపుల వద్దకు సరుకులు పంపించినా కూడా దిగుమతి చేసుకోవద్దు’’ అని స్పష్టంచేస్తూ రాష్ట్ర డీలర్ల సంఘం రేషన్‌ షాపుల డీలర్లందరికీ మొబైల్‌ సందేశం పంపించింది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి ప్రతినెలా రేషన్‌ షాపులకు పంపిస్తున్న పీడీఎస్‌ బియ్యంలో భారీగా తరుగు వస్తున్నాయని, ఆగస్టు నెల బియ్యంలో భారీగా తరుగు కనిపించిందని, అందుకే డీలర్ల సమక్షంలో తూకం వేసి ఇస్తేనే సెప్టెంబరు నెలకు పీడీఎస్‌ బియ్యం, పంచదార తీసుకుంటామని డీలర్ల సంఘ నాయకులు స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో జరుగుతున్న అక్రమాలను వ్యతిరేకిస్తూ రేషన్‌ డీలర్లు తిరుగుబాటు ప్రకటించడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చేనెలలో పేదలకు అందించాల్సిన కిలో రూపాయి బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దనే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.


50 కేజీల బస్తాకు 2-3 కేజీల తరుగు 

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే.. వారు మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి ఇస్తారు. ఎఫ్‌సీఐ నుంచి పీడీఎ్‌సకు కేటాయిస్తారు. ఎఫ్‌సీఐ గొడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరిన బియ్యాన్ని రేషన్‌ షాపులకు తరలిస్తారు. ఎఫ్‌సీఐ గొడౌన్ల వద్ద తూకం వేసి పూర్తిస్థాయిలోనే బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వస్తుండగా.. ఇక్కడ పనిచేస్తున్న సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి తూకం వేయకుండా రేషన్‌ షాపులకు తరలిస్తున్నారని, 50 కేజీల బియ్యం బస్తాలో 2 నుంచి 3 కేజీలు తక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 30 వేల రేషన్‌ షాపులున్నాయి. ఒక్కో షాపునకు కనీసం రెండు క్వింటాలు చొప్పున తరుగు వేసుకున్నా.. 60 వేల క్వింటాళ్ల బియ్యం పక్కదారిపడుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారం గురించి ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారంటే.. ఏ స్థాయిలో లాబీయింగ్‌ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని డీలర్లు వాపోతున్నారు. తరుగు రూపంలో మిగిలించుకుంటున్న బియ్యాన్ని దళారుల ద్వారా వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆ రేషన్‌ బియ్యం తిరిగి మిల్లర్ల వద్దకే చేరుతుండటంతో మిల్లర్లు వాటిని రీసైక్లింగ్‌ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ. 24 నుంచి 28 వరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. రెండోసారి పాలిష్‌ పట్టిన బియ్యాన్నే పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 


ఇలాగైతే బతికేదెలా..?: డీలర్ల ఆవేదన

రేషన్‌ సరకుల అమ్మకాల ద్వారా తమకు నెలకు సరాసరిన రూ.7 వేలు వస్తుందని డీలర్లు చెబుతున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకం వేయకుండా బియ్యం ఇవ్వడం వల్ల అమ్మకాలు మొదలు పెట్టకుండానే తరుగు రూపంలో రూ. 2 నుంచి 3 వేలు నష్టపోతున్నామని, ఇక షాపు అద్దె, కరెంటు బిల్లులు పోను నెలకు రూ. 500 నుంచి 1000 కూడా మిగలడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలంటూ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో రేషన్‌ షాపుల్లో పీడీఎస్‌ బియ్యంతోపాటు కందిపప్పు, మినపప్పు, గోధుమ, చింతపండు, వేరుశెనగ గుళ్లు తదితర 15 రకాల నిత్యావసర సరకులు అమ్ముకునేవాళ్లమని, ప్రభుత్వం ఎండీయూలను ప్రవేశపెట్టిన తర్వాత ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకం వేయకుండా రేషన్‌ బియ్యం ఇస్తుండటం వల్ల డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారనే విషయాన్ని ఇప్పటికే పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ దృష్టికి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఎండీ దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లామని, కానీ వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకటరావు అన్నారు. రేషన్‌ డీలర్లకు కూడా బయోమెట్రిక్‌ తీసుకుని, వారి సమక్షంలోనే తూకం వేసి అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-21T09:13:57+05:30 IST