డోర్‌ డెలివరీకి సరికొత్త యాప్‌

ABN , First Publish Date - 2020-03-26T14:34:47+05:30 IST

కరోనా నియంత్రణకు యువత నడుం బిగించింది..

డోర్‌ డెలివరీకి సరికొత్త యాప్‌

కరోనా నియంత్రణకు మంగళగిరి యువత వినూత్న ఆలోచన

మునిసిపల్‌ అధికారుల సహకారంతో కార్యరూపం


మంగళగిరి టౌన్‌(గుంటూరు): మంగళగిరిలో కరోనా నియంత్రణకు యువత నడుం బిగించింది. కరోనా నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలు అందడం కష్ట సాధ్యంగా మారింది. వివిధ కారణాలతో నిత్యం ప్రజలు రోడ్లపైకి వస్తూనే వున్నారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా ఫలితం లేకుండా పోతుంది. కరోనాపై అటు అధికారుల ఆందోళన... ఇటు ప్రజల అవసరాలను గుర్తించిన మంగళగిరి యువత కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వినూత్న ఆలోచన చేసింది. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను నేరుగా వారి ఇళ్ల వద్దకే చేర వేయాలని భావించింది. ఇందుకోసం ఓ యాప్‌ను రూపొందించింది.


ఈ విషయాన్ని మునిసిపల్‌ అధికా రుల దృష్టికి తీసుకువెళ్లారు. తాము చేపట్టబోయే కార్యచరణ ఉద్దేశాలను వివరించారు. ఇప్పటికే ప్రజలను కట్టడి చేయడం కష్టసాధ్యంగా మారిన తరుణంలో మునిసిపల్‌ అధికారులు వెంటనే ఓకే చెప్పేశారు. దీంతో ఈ ప్రతిపాదన కేవలం రెండు రోజుల్లోనే కార్యరూపం దాల్చింది. టోటల్‌ ఫ్రెష్‌ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను మంగళగిరి మునిసిపల్‌ కమిషనరు కే.హేమమాలినిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో పనిచేయాలని ఆమె సూచించారు.


టోటల్‌ ఫ్రెష్‌ పనితీరు

టోటల్‌ ఫ్రెష్‌ పేరిట రూపొందించిన ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో లభ్యమవుతుంది. అయితే మీరు టైపు చేసేటప్పుడు టోటల్‌కి ఫ్రెష్‌కి మధ్యన గ్యాప్‌ లేకుండా రాయండి. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత మీ అడ్రస్‌ ఎంటర్‌ చేసి, మీకు కావలసిన వస్తువులను ఎంచుకుని ఆర్డరు చేసుకోవచ్చు. లేదా కింద తెలిపిన నెంబర్లకు వాట్సాప్‌ ద్వారా టైపు చేసి పంపించినా లేక పేపరుపై పెన్నుతో రాసి లిస్టును ఫోటో తీసి పంపించినా ఆర్డరు తీసుకుంటారు. అన్నిరకాల నిత్యావసరాలు, మందులు వెంటనే తెచ్చి ఇస్తారు. ప్రతి డెలివరీపై రూ.15చార్జీని వసూలు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెబుతున్నారు.

Updated Date - 2020-03-26T14:34:47+05:30 IST