Biryani తో పోటీగా మనసు ‘దోశే’లా.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌..

ABN , First Publish Date - 2022-01-02T05:26:47+05:30 IST

సాధారణంగా మధ్యాహ్నమో, సాయంత్రమో ఆకలిగా ఉంటే మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాం.. లేదా బిర్యానీ కోసం వెతుకుతాం.. ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి వచ్చాక అందరి చూపు బిర్యానీ వైపే ఉంటుంది.

Biryani తో పోటీగా మనసు ‘దోశే’లా.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌..

  • బిర్యానీతో పోటీగా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ 
  • దక్షణాది సంప్రదాయ వంటకాల్లో రెండో స్థానం
  • అన్ని సమయాల్లో దోశ తినడానికే ఇష్టపడుతున్న ప్రజలు
  • దోశ తరువాత పన్నీర్‌ బట్టర్‌ మసాల, బటర్‌నాన్‌
  • ఉత్తమ స్నాక్స్‌గా సమోసా, స్వీట్‌ గులాబ్‌జామ్‌
  • ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల వార్షిక నివేదికల్లో ఆసక్తికర విషయాలు


ఫుడ్‌ ఆర్డర్లలో బిర్యానీదే అగ్రపీఠం. కాకపోతే ఈసారి ఆ బిర్యానీకి పోటీగా నేనున్నాను అంటూ మన దోశ వచ్చిందండోయ్‌.. అదేనండీ మన పుల్లట్టు... ఉదయం అల్పహారంగానే కాక.. మధ్యాహ్నం, సాయంత్రం ఇలా అన్ని వేళలా ఆహార ప్రియులు దీనిని ఆర్డర్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలీవరీ సంస్థలు తమ వార్షిక నివేదికల్లో కూడా వెల్లడించాయి.


దోశ మనదే..

దోశ పుట్టింది మన పక్కనున్న తమిళనాడులోనేని చరిత్ర చెబుతోంది. ఒకటో శతాబ్దంలో తమిళనాడులో ఆచార్య అనే వ్యక్తి దోశ  ఆకారాన్ని, వాటిలో వేసే మిశ్రమాన్ని కనుగొన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. కాకపోతే దీనిని క్రమేపీ ఉడిపి హోటళ్ల ద్వారా కర్ణాటకకు చెందిన పి.ధంకప్పన్‌ నాయర్‌ అనే వ్యక్తి మరింత అభివృద్ధి చేశారు. ఆ తరువాత క్రమేపీ 53 రకాల దోశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతేనా ఊతప్పం, అప్పా, చికూలిపైతా, జాన్‌బింగ్‌ అనేవి కూడా మన దోశ నుంచి వచ్చిన వంటలే. అంతేగాక భారతదేశ  వంటకాలపై ఎటువంటి పుస్తకాలు వచ్చినా మన దోశకు రెండు పేజీలు ఉంటాయి. మన దోశకు అంత గొప్ప చరిత్ర ఉంది.


 గుంటూరు(తూర్పు), జనవరి1: సాధారణంగా మధ్యాహ్నమో, సాయంత్రమో ఆకలిగా ఉంటే మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాం.. లేదా బిర్యానీ కోసం వెతుకుతాం.. ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి వచ్చాక అందరి చూపు బిర్యానీ వైపే ఉంటుంది. ఆ బిర్యానీకి దోశ కూడా పోటీ ఇస్తోందని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలీవరీ సంస్ధలు తమ వార్షిక నివేదికల్లో కూడా వెల్లడించాయి. దోశ స్వచ్ఛమైన దక్షిణాది సంప్రదాయ వంటకం కావడం.. మనం గర్వించదగ్గ విషయం కూడా..! మన మధ్యలో పుట్టిన దోశ, అంత పెద్ద బిర్యానీకి పోటీ ఇస్తుందంటే కాలర్‌ ఎగురవేసే విషయమే!


అంచనా ఇలా..

135 కోట్లమంది ఉన్న మన దేశంలో ఎవరేం తింటారు.. ఎక్కువమంది ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు అనే విషయాన్ని చెప్పడం కష్టం. కానీ ఆన్‌లైన్‌ డెలివరీ విధానం వచ్చాక ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చిందనే చెప్పాలి. ఏ ఫుడ్‌ ఐటమ్‌ ఆర్డర్‌ ఎక్కువగా ఉంటే దానినే ఇష్టపడుతున్నారని చెప్పుకోవాలి. దీని ఆధారంగా దేశ ప్రజలు ఇష్టపడే ఆహార పదార్ధాలను ఆయా డెలివరీ సంస్థలు అంచనా వేయగలిగాయి.


దోశల్లో ఎన్నో రకాలు..

సాధారణంగా ఇడ్లీ, పూరీ, చపాతీల్లో వంటివి ఒకే విధంగా ఉంటాయి. వీటి  రంగులు మారినా రుచిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దోశ అలాకాదు దోశలో దాదాపు 53 రకాలు ఉంటాయని అంచనా. మసాలదోశ, ఉల్లిదోశ, ఉప్మాదోశ, పెసరదోశ, 60ఎంఎం దోశ.. లాగా అన్నమాట. అంతేగాక దోశలో ఏ పదార్ధం ఉంచుతామో దాని రుచితో పాటు దోశరుచి కూడా మన నాలుకకు అందుతుంది. అందుకేనేమో దోశను ఇంతమంది ఇష్టపడుతున్నారు.


సమోసాలు, గులాబ్‌జామ్‌ కూడా..

దేశవ్యాప్తంగా ఉన్న రెండు ఫుడ్‌ డెలివరీ సంస్థలు ప్రజలు ఎక్కువుగా ఏఏ ఫుడ్‌ను ఆర్డర్‌ చేశారనే విషయంపై 2021 డిసెంబరు28న తమ వార్షిక నివేదికల ద్వారా వెల్లడించాయి. నివేదిక ప్రకారం ఎక్కువమంది బిర్యానినే ఆర్డరు చేశారు. ఈ రెండు సంస్థల ద్వారా ప్రతి సెకనుకు 5 బిర్యానీల ఆర్డర్లు జరిగాయి. ఇక దోశల విషయానికోస్తే ప్రతి సెకనుకు 3 దోశలు ఆర్డర్లు జరిగాయి. అంటే నెలకు దాదాపు 86 లక్షల వరకు వివిధ రకాల దోశల ఆర్డరు జరిగిందన్నమాట. ఆ తరువాత స్థానంలో పన్నీరుబట్టర్‌ మసాల, బట్టర్‌నాన్‌లు ఉన్నాయి.


36 లక్షల సమోసాల ఆర్డర్‌

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కువమంది ఫుడ్‌ కింద బిర్యానీని ఎలా ఇష్టపడుతున్నారో.. స్నాక్స్‌ విషయంలో సమోసాను అంతే ఇష్టపడుతున్నారు. నివేదిక ప్రకారం ప్రతి నెల దాదాపు 36లక్షల వరకు సమోసాల ఆర్డర్లు జరిగాయి. అలాగే స్వీట్‌లలో ఎక్కువమంది గులాబ్‌జామ్‌ను ఇష్టపడుతుండగా, రెండోస్థానంలో రసమలై, ఆ తరువాత రసగుల్లా ఉంది. రసగుల్లాను ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలిసి ఈ మఽధ్య పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలు ఆ స్వీటు మా దగ్గర పుట్టింది అంటే మాదగ్గర పుట్టింది అంటూ.. కోర్టులకెక్కడం మరో ఆసక్తికర విషయం.


చద్దన్నం కోసం వెతికారు...

ఏదైనా రెస్టారెంట్లు, హోటళ్లలో సంప్రదాయ వంటలు అంటే చద్దన్నం, రాగి, జొన్నసంకటి వంటివి దొరుకుతాయా.. అని ఎక్కువమంది వెతికినట్టు నివేదికలో వెల్లడైంది. చద్దన్నం తోపాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాంబినేషన్‌ కోసం ఎక్కువమంది వెతికారు. కొత్త వంటలను రుచి చూడటానికి మాత్రమే ఒకసారి తింటున్నారని, చిన్నప్పటి నుంచి ఏవైతే  తింటున్నారో అలాంటి వాటికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని నివేదికలో వెల్లడించారు.


 ఏ భాషలోనైనా దోశే...

దోశ గురించి మరో విశేషం చెప్పుకోవాలి. స్వల్ప మార్పులు ఉంటాయేమోగాని ఏ భాషలోనైనా దోశను దోశ అనే పలుకుతారు.. కాకపోతే మనవాళ్లే దానిని అట్టు అని కూడా అంటారు. మన ఆడపిల్లలకు తద్దె తీర్చుకునే సమయంలో అట్లను వాయినాలుగా ఇస్తాం. ఇదే క్రమేపీ అట్లతద్దెగా మారిపోయింది. అంటే మన ఆహారంలోనే కాదు సంప్రదాయంలోనూ కూడా దోశ పాత్ర ఉందనే చెప్పుకోవాలి.


ఆరోగ్యం కూడా..

దోశ నోటిరుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. బియ్యం, మినపగుండ్లు మిశ్రమంతో దోశను తయారు చేస్తారు. ఈ రెండింటిలో ఉండే కార్పొహైడ్రేట్స్‌, చక్కెర, ప్రొటీన్లు జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తాయి. ఇంట్లో తయారుచేసే ఒక దోశ తినడం వల్ల శరీరానికి 112 క్యాలరీల శక్తి సమకూరుతుంది. వీటిద్వారా 84శాతం కార్బొహైడ్రేట్లు, 16శాతం ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. వీటితోపాటు విటమిన్‌ సీ, బీలు కూడా శరీరానికి అందుతాయి. మినపగుండ్లు పొట్టు తీయకుండా దోశల్లో వాడితే ఇంకా ప్రయోజనాలు ఉంటాయి. దోశల్లో పెసరదోశ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికించిన కూరగాయలు దోశల మధ్యలో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యం, నోటి రుచి రెండు లభిస్తాయి.  - చందు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, న్యూట్రీషియన్‌, గుంటూరు.

Updated Date - 2022-01-02T05:26:47+05:30 IST