Aug 1 2021 @ 11:20AM

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘దోస్తీ...’ సాంగ్ రిలీజ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను అక్టోబ‌ర్ 13న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి దోస్తీ అనే సాంగ్‌ను ఐదు భాష‌ల్లో రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను తెలుగులో హేమచంద్ర ఆల‌పించారు. 

‘‘పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి

కదిలే కార్చిచ్చుకి.. కసిరే వడగళ్లకి

రవికీ మేఘానికీ..దోస్తీ

ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ..’’ అంటూ సాగే ఈ పాట ఇద్ద‌రు భిన్న‌మైన మ‌న‌స్కుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని తెలియ‌జేసేలా సాగింది. 

ఇదే పాట‌ను తమిళంలో అనిరుధ్‌, హిందీలో అమిత్ త్రివేది, మ‌ల‌యాళంలో విజ‌య్ యేసుదాస్‌, క‌న్న‌డంలో యాజిన్ న‌జీర్ పాడారు. ఈ పాట‌లో కీర‌వాణితో పాటు ఐదు భాష‌ల్లో పాట‌ను పాడిన సింగ‌ర్స్‌తో పాటు చివ‌ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ కూడా క‌నిపించ‌డం విశేషం. 


ఇందులో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ సన్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి ఇలా బాలీవుడ్‌, హాలీవుడ్ తార‌ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.