హైదరాబాద్‌లో డబుల్‌ డెకర్‌ స్కైవేలు

ABN , First Publish Date - 2020-08-02T07:48:05+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు భారీ ఆకాశ మార్గాలు రానున్నాయి. 2024 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్‌ 2 పద్ధతిలో రోడ్డు, ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో

హైదరాబాద్‌లో డబుల్‌ డెకర్‌ స్కైవేలు

  • జీ+2లో రోడ్డు, ఫ్లై ఓవర్‌, మెట్రో కారిడార్‌
  • రెండు ప్రాంతాల్లో భారీ ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం
  • జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట.. డీపీఆర్‌ సిద్ధం
  • ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి ఆర్వోబీకి మరొకటి
  • 5 వేల కోట్లు ఖర్చు చేయనున్న హెచ్‌ఎండీఏ


హైదరాబాద్‌సిటీ, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు భారీ ఆకాశ మార్గాలు రానున్నాయి. 2024 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్‌ 2 పద్ధతిలో రోడ్డు, ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌తో కూడిన డబుల్‌ డెక్కర్‌ స్కైవేల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకూ స్కైవేల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. జేబీఎస్‌-శామీర్‌పేట స్కైవేకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ఇప్పటికే సిద్ధం కాగా, మరో స్కైవే నిర్మాణానికి కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ను తయారు చేయిస్తోంది. సుమారు రూ.5వేల కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టులను సొంతంగా హెచ్‌ఎండీఏనే చేపట్టనుంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పా్‌సల నిర్మాణాలతో ట్రాఫిక్‌ సమస్యకు కొంత మేర పరిష్కారం లభించింది.


కానీ, కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఇరుకైన రోడ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకోలంటే రద్దీ వేళలో గంటకు పైగా సమయం పడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో  జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ స్కైవేను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్‌వోబీ వరకూ 18.35 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ స్కైవే సాధ్యాసాధ్యాలపై సంబంధిత కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.


ఆర్‌ అండ్‌ బీ నుంచి హెచ్‌ఎండీఏ చేతికి

హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో డబుల్‌ డెక్కర్‌ స్కైవేను నిర్మించేందుకు ఏడాది క్రితమే ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి డీపీఆర్‌ సిద్ధం చేశారు. అయితే, గ్రేటర్‌ పరిధిలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన అనుభవం ఉన్న హెచ్‌ఎండీఏ ద్వారానే ఈ ప్రాజెక్టును చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు. దీంతో సదరు డీపీఆర్‌తోపాటు పూర్తి వివరాలను ఆర్‌అండ్‌బీ అధికారులు హెచ్‌ఎండీఏకు  అప్పగించారు. దీనికి హెచ్‌ఎండీఏ అధికారులు మరిన్ని మెరుగులు దిద్ది భూసేకరణ కోసం రక్షణ శాఖకు అందించినట్లు తెలిసింది. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి వరకూ డబుల్‌ డెక్కర్‌ స్కైవే డీపీఆర్‌ రూపకల్పన కోసం టెండర్లు ఆహ్వానించగా, జేబీఎస్‌ మార్గంలో పని చేసిన కన్సల్టెన్సీనే ఎంపికైంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆ సంస్థ నివేదిక సైతం అందజేసింది. తొలుత ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకూ స్కైవేను ప్రతిపాదించగా, తాజాగా కొంపల్లి ఆర్‌వోబీ వరకూ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్వే పూర్తవ్వడంతో ఫిజిబులిటీ రిపోర్టు ఆధారంగా అలైన్‌మెంట్‌ ఖరారు కానుంది.


భూసేకరణపైనే సందిగ్ధం

ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూమి మొత్తం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులు స్థానికంగా రక్షణ శాఖ అధికారులతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా భూమికి భూమి ఇవ్వడంతోపాటు తగు వసతులను కల్పించాలని, లేదంటే తాము నిర్ణయించే విలువ ఆధారంగా చెల్లింపులు చేయాలని రక్షణశాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. మరో సమవేశంలో భూసేకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


2 ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లపైనే..

భారీ డబుల్‌ డెక్కర్‌ స్కైవే ప్రాజెక్టులను లుక్‌ ఈస్ట్‌ పాలసీకి ఊతమిచ్చేలా రూపొందిస్తున్నారు. నగరానికి అన్ని వైపులా అభివృద్ధి జరిగేందుకు తీసుకొచ్చిన లుక్‌ ఈస్ట్‌ పాలసీకి అనువుగా ట్రాఫిక్‌ లేని రోడ్లు రానున్నాయి. ఈ డబుల్‌ డెక్కర్‌ స్కైవేలో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో మధ్య మధ్యలో ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంపులు వస్తాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రోడ్డు, ఆ పైన ఫ్లైఓవర్‌, రెండో అంతస్తులో మెట్రో కారిడార్‌ వచ్చే విధంగా ప్లాన్‌ ఉండడంతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా ఉండనుంది. ఒక్కో డబుల్‌ డెక్కర్‌ స్కైవే నిర్మాణానికి రూ.1,200 కోట్లు, భూ సేకరణకు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.5,000 కోట్లకుపైనే ఖర్చు కానుంది.

Updated Date - 2020-08-02T07:48:05+05:30 IST