జొకో @20

ABN , First Publish Date - 2021-07-12T08:57:18+05:30 IST

డబుల్‌ డిఫెండింగ్‌ చాంప్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. వింబుల్డన్‌లో ‘సిక్సర్‌’ కొట్టాడు. ఓపెన్‌ ఎరాలో 20 గ్రాండ్‌స్లామ్‌లతో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెడరర్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌

జొకో @20

వింబుల్డన్‌ మరోసారి జొకోకే జైకొట్టింది. ఇటాలియన్‌ మాటో బెరిటినీ ఓడించి.. ఆరోసారి గ్రాస్‌కోర్టు టైటిల్‌ను నొవాక్‌ ముద్దాడాడు. ఈ క్రమంలో ఓపెన్‌ఎరాలో అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు సమంచేసి చరిత్ర సృష్టించాడు. 


లండన్‌: డబుల్‌ డిఫెండింగ్‌ చాంప్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. వింబుల్డన్‌లో ‘సిక్సర్‌’ కొట్టాడు. ఓపెన్‌ ఎరాలో 20 గ్రాండ్‌స్లామ్‌లతో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెడరర్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ సరసన చోటు దక్కించుకున్నాడు. తొలి సెట్‌లో తడబడినా.. లేచి నిలబడ్డాడు. మొదటిసారి గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలవాలనుకున్న ఇటలీ ఆటగాడు మాటో బెరెటిని కలను చెరిపేస్తూ.. మరోసారి గ్రాస్‌కోర్టులో జయభేరి మోగించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకో 6-7(4), 6-4, 6-4, 6-3తో ఏడో సీడ్‌ బెరెటినిపై 3 గంటల 23 నిమిషాలపాటు పోరాడి నెగ్గాడు. 2018, 2019 చాంపియన్‌ అయిన జొకో.. గ్రాస్‌కోర్టులో హ్యాట్రిక్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో ఐదుసార్లు వింబుల్డన్‌ నెగ్గిన సెర్బియా యోధుడు నొవాక్‌కు ఇది ఆరో టైటిల్‌. 

ఫస్ట్‌ సెట్‌లోనే షాక్‌..: తొలి సెట్‌ నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి బెరెటిని సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన నొవాక్‌ 3-1తో పైచేయి సాధించాడు. అయితే, 2-5తో వెనుకబడిన సమయంలో  గొప్పగా పోరాడిన  బెరెటిని 5-5తో నిలిచాడు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ సర్వీసులను నిలబెట్టుకోవడంతో 6-6తో సెట్‌ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. జోరుమీదున్న బెరెటిని 7-4తో నెగ్గి.. జొకోకు షాకిచ్చాడు. తొలి సెట్‌ 70 నిమిషాలపాటు సాగడం విశేషం. అయితే, విజృంభించిన నొవాక్‌ రెండో సెట్‌ను 6-4తో నెగ్గాడు. మూడో సెట్‌ కూడా హోరాహోరీగా సాగినా జొకో 6-4తో దక్కించుకున్నాడు. ఇక, నాలుగో సెట్‌ ఆరంభంలో ఇద్దరూ సర్వీసులను  నిలబెట్టుకోవడంతో 3-3తో సమంగా నిలిచారు. అయితే, రెండుసార్లు బెరెటిని సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన జొకో 6-3తో నెగ్గి.. చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 


బెనర్జీకి జూనియర్‌ టైటిల్‌ 

భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు 17 ఏళ్ల సమీర్‌ బెనర్జీ వింబుల్డన్‌లో సంచలన విజయంతో బాలుర టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికా ఆటగాళ్ల మధ్య ఫైనల్లో బెనర్జీ 7-5, 6-3తో విక్టర్‌ లిలోవ్‌పై వరుస సెట్లలో నెగ్గి.. గ్రాస్‌కోర్టులో జూనియర్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. బెంగాల్‌కు చెందిన సమీర్‌ కుటుంబం న్యూజెర్సీలో నివాసం ఉంటున్నది. 

Updated Date - 2021-07-12T08:57:18+05:30 IST