డబుల్‌ ధమాకా

ABN , First Publish Date - 2022-01-27T06:15:50+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ రథసారధులను ఖరారు చేసింది. ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న వారికే పార్టీ పగ్గాలను అప్పగిస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు.

డబుల్‌ ధమాకా
హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన పార్టీ జిల్లా నూతన అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రవీంద్ర నాయక్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, మంత్రి జగదీష్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల ఖరారు

పదవుల్లో ఉన్న వారికే పార్టీ పగ్గాలు

అధిష్ఠానం నిర్ణయంపై సీనియర్ల నిర్వేదం

నల్లగొండకు రవీంద్రనాయక్‌, 

సూర్యాపేటకు లింగయ్యయాదవ్‌, 

యాదాద్రి భువనగిరికి రామకృష్ణారెడ్డి

త్వరలో మంత్రి,ఎమ్మెల్యేల భేటీలో జిల్లా కమిటీ 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ రథసారధులను ఖరారు చేసింది. ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న వారికే పార్టీ పగ్గాలను అప్పగిస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పార్టీ సీనియర్లు, పదవిని ఆశించిన వారిలో నిర్వేదం కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల కనుసన్నల్లో అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగుతుండగా, తిరిగి వారి గుప్పిట్లోనే పార్టీ పదవులు ఉండటంపై నాయకుల్లో చర్చ సాగుతోంది. పార్టీ అధిష్టానం బుధవారం జిల్లా అధ్యక్షుల జాబితాను ప్రకటించింది. 


టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌నాయక్‌ను, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కంచర్ల రామకృష్ణారెడ్డిలను నియమించారు. త్వరలో జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్నారు. రెండేళ్ల పదవీకాలనికి వీరిని నియమించారు. రాబోయే సాధారణ ఎన్నికలు వీరి సారధ్యంలోనే జరగనున్నాయి. జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆధునిక కార్యాలయాల నిర్మాణం తుదిదశకు చేరింది. త్వరలో సీఎం కేసీఆర్‌ ఈ కార్యాలయాలను ప్రారంభించనుండగా ఆ వేదికలే కేంద్రంగా ఈ అధ్యక్షులు సంస్థాగత కార్యకలాపాలు చేపట్టనున్నారు. 


అధ్యక్షుల ఎంపికపై విస్తృత చర్చ

ఉమ్మడి జిల్లాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులుగా రవీంద్రనాయక్‌, బడుగు ల లింగయ్యయాదవ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి ఎంపికపై విస్తృత చర్చ సాగుతోంది. ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీ నేతల అంచనాలు తలకిందులు చేస్తూ అధినేత నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నాయకుడు ఈ నిర్ణయం తీసుకోవడాని కి కారణం ఏమై ఉంటుంది, జిల్లా జాబితా ఖరారులో ఎవరి ముద్ర ఉంది, తాజా నిర్ణయంతో పార్టీకి కలిగే లాభనష్టాలను బేరీజు వేయడం ప్రారంభించారు. మొత్తంగా చూస్తే సీనియర్లు అధినేత నిర్ణయంపై నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు అంటే గట్టి స్థాయి ఉన్న వ్యక్తులు అవసరమని, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని తాజా జాబితా విడుదల చేసి ఉం టారన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్డి, యాద వ, లంబాడ బలమైన సామాజిక వర్గాలు, ఆ నేపథ్యంలోనే ఎస్టీ(లంబాడ) జనాభా అధికంగా ఉన్న నల్లగొండ జిల్లాకు రవీంద్రకుమార్‌నాయక్‌, బీసీ(యాదవ) సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ సూర్యాపేటకు, యాదాద్రిభువనగిరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డిని ఖరారు చేసి ఉంటారన్న వాదన ఉంది. ఇప్పటికే ప్రధాన పదవుల్లో ఉన్న వారికి మరో కీలక పదవి అప్పగించడం సరైంది కాదని, ఒక ఎమ్మెల్యే తన సహచర ఎమ్మెల్యేలను ఏ మేరకు నియంత్రించగలడన్న వాదనా లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలో కీలక పదవి దక్కక కనీసం పార్టీలో కీలకస్థానం కోసం ఎదురు చూసిన, వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకున్న సీనియర్లు అధిష్ఠానం నిర్ణయంతో నిరాశలో ఉన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌ కుమార్‌, సుంకరి మల్లే్‌షగౌడ్‌ సూర్యాపేట జిల్లా నుంచి మందుల సామేలు, యాదాద్రి నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ వంటి వారు అధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. 


అన్నీ ఎమ్మెల్యే కేంద్రంగానే గులాబీ మంత్రాంగం

ఇప్పటికే ఎమ్మెల్యే కేంద్రంగానే అన్ని కార్యకలాపాలు సాగాలన్న సూత్రంపైనే టీఆర్‌ఎస్‌ రాజకీయం, పాలన వ్యవస్థ కొనసాగుతోంది. అయితే జిల్లా అధ్యక్షులుగా ఆది నుంచి పార్టీలో ఉంటూ అధిష్ఠానం విశ్వాసం పొందిన వారికి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేల ఏకపక్ష, పెడధోరణులకు చెక్‌ పెట్టే అవకాశం ఉంటుందని, అదే జరగబోతోందని పార్టీ నేతలు భావించారు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలే కేంద్రంగా అధ్యక్షుల ఎంపిక నిర్ణయం జరగడంతో పార్టీ నేతలు నిర్వేదంలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధ్యక్ష పదవి ఇవ్వడం మూలంగా ఇతర నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి ఏంటి? అన్న విషయాల్లో లోతుల్లోకి వెళ్లి పార్టీ పెద్దలకు నివేదించే వాతావరణం ఉండదు. దీంతో ఎమ్మెల్యేలు కేంద్రంగా పాలన వ్యవస్థ ఉండటంతో ఏకపక్ష ధోరణులు పెరిగి సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. అధికారుల పోస్టింగ్‌లు, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో తమ నియోజకవర్గం నుంచి ఎవరు ఉండాలి? అత్యంత విశ్వసనీయ వ్యక్తులకే అభివృద్ధి పనుల్లో అవకాశం కల్పిస్తుండటం, అధిష్ఠానం సైతం ఎమ్మెల్యేల తీరుకు ఒకే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుటుండటంతో గులాబీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


నమ్మకాన్ని వమ్ము చేయను : కంచర్ల రామకృష్ణారెడ్డి

సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికలో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తా. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం.



అంకితభావానికి గుర్తింపుగా..

మోత్కూరు : టీఆర్‌ఎస్‌ జిల్లా తొలి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి దక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఆయన్ను అధిష్ఠానం అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. 2019లో పార్టీ సంస్థాగత ఎన్నికల సమయంలోనే జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చినా; అప్పట్లో నియామకాలు చేపట్టలేదు. తాజా ఎంపికతో అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్లయింది. 

పార్టీ ఆవిర్భావం నుంచి...

రామకృష్ణారెడ్డి 1976 నుంచి 2001 వరకు సీపీఐలో కీలకంగా పనిచేశారు. 2001లో జలదృశ్యంలో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌స లో చేరారు. నాటి నుంచి పార్టీ అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తూ అధినేత కేసీఆర్‌ వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు సింగిల్‌విండో చైర్మన్‌గా, నాలుగేళ్లుగా రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌గా చేస్తూ రైతు సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారు. జిల్లాలో పార్టీ పటిష్ఠతకు, అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. 

Updated Date - 2022-01-27T06:15:50+05:30 IST