జగిత్యాల జిల్లాలో ‘డబుల్‌’ గుబుల్‌

ABN , First Publish Date - 2022-01-18T06:00:22+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై పేదల ఎదురు చూపులు తప్పడం లేదు. ఏళ్లుగా నిర్మాణాలు కొనసాగుతుండటంతో తమ సొంతింటి కళ నెరవేరుతుందో లేదోనని ఆందోళనలో ఉన్నారు.

జగిత్యాల జిల్లాలో ‘డబుల్‌’ గుబుల్‌

- డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై పేదల ఆశలు

- లబ్ధిదారుల ఎంపికలో జాప్యం

- ఏళ్లుగా కొనసాగుతున్న నిర్మాణాలు

- పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

జగిత్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై పేదల ఎదురు చూపులు తప్పడం లేదు. ఏళ్లుగా నిర్మాణాలు కొనసాగుతుండటంతో తమ సొంతింటి కళ నెరవేరుతుందో లేదోనని ఆందోళనలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగిన్పటికీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతుండటంతో పంపిణీ కావడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అటు అధికారులుగానీ ఇటు ప్రజా ప్రతినిఽధులు కానీ పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో...ఎప్పుడు పంపిణీ చేస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో 8,465 ఇళ్లు కేటాయించారు. ఇందులో 7,385 ఇళ్ల నిర్మాణాలు టెండర్లు పిలవడం, అగ్రిమెంట్లు అందించడంతో పాటు నిర్మాణ దశల్లో ఉన్నాయి. 1,080 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో ఇప్పటివరకు 580 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడం, ముహూర్తం కుదురకపోవడం తదితర కారణాల వల్ల 500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ కేటాయింపులు జరపలేదు. 

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో...

సెగ్మెంట్‌లో 5,500 ఇళ్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతలో 400, రెండవ విడతలో 5,100 మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 280 ఇళ్లు పూర్తయ్యాయి. 5,220 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్తయిన వాటిలో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో జగిత్యాల మండలంలోని దరూర్‌లో, నర్సింగాపూర్‌, తిప్పన్నపేట గ్రామంలో ఇళ్లను పంపిణీ చేశారు.

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో...

కోరుట్ల సెగ్మెంట్‌లో 1,400 ఇళ్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతలో 400, రెండవ విడతలో 1,000 మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 492 ఇళ్లు పూర్తయ్యాయి. 908 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్తయిన వాటిలో ఇప్పటివరకు సుమారు రెండు వందల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో, కోరుట్ల మండలంలోని మాదాపూర్‌లో, అయిలాపూర్‌లో, కల్లూరులో, జోగినిపల్లిలో, నాగులపేటలో, ఇబ్రహీంపట్నం మండలంలోని సత్తక్కపల్లిలో, మల్లాపూర్‌ మండలంలోని సాతారంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో...

ధర్మపురి సెగ్మెంట్‌లో 1,100 ఇళ్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతలో 305, రెండవ విడతలో 795 మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 110 ఇళ్లు పూర్తయ్యాయి. 990 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్తయిన వాటిలో ఇప్పటివరకు 60 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరులో 20, ల్యాగలమర్రి 20, చంకోలిలో 20 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

చొప్పదండి నియోజకవర్గంలో...

చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 360 ఇళ్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతలో 130, రెండవ విడతలో 230 మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 130 ఇళ్లు పూర్తయ్యాయి. 230 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్తయిన వాటిలో ఇప్పటివరకు 150 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో రామన్నపేట, పోతారం, నాచుపల్లి, పూడూరు, కొడిమ్యాల, నల్లగొండ, తిప్పాయిపల్లి గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

వేములవాడ నియోజకవర్గంలో...

వేములవాడ సెగ్మెంట్‌లోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 395 ఇళ్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతలో 165, రెండవ విడతలో 230 మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 68 ఇళ్లు పూర్తయ్యాయి. 327 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పూర్తయిన వాటిలో ఇప్పటివరకు 60 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో బీమారంలో 15, గోవిందారంలో 15, కలికోటలో 15, మన్నెగూడంలో 15 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

జిల్లాలో 154 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు

జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 154 ప్రాంతాలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు జరుపుతున్నారు. ఇందులో జగిత్యాల సెగ్మెంట్‌లో 39, ధర్మపురిలో 44, కోరుట్లలో 47, వేములవాడలో 21, చొప్పదండి నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభించారు. జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో 4,920 ఇళ్లకు టెండర్లను ఆహ్వానించగా, ధర్మపురిలో 410 ఇళ్లు, కోరుట్లలో 603, వేములవాడలో 165, చొప్పదండిలో 130 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు నిర్వహించారు. ఇందులో జిల్లాలో 6,228 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేసి 5,911 ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు అందించారు. జగిత్యాల పట్టణంలోని పేదలకు 4,160 ఇళ్లు నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో నిర్మిస్తున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల కొరకు రూ. 452.41 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ. 103.04 కోట్లు నిధులు వినియోగించారు. ఇందులో జగిత్యాల నియోజకవర్గంలో రూ. 58.26, ధర్మపురి నియోజకవర్గంలో రూ. 8.29, కోరుట్ల నియోజకవర్గంలో రూ. 26.45 కోట్లు, వేములవాడ నియోజకవర్గంలో రూ. 4.25 కోట్లు, చొప్పదండి నియోజకవర్గంలో రూ. 5.76 కోట్ల నిధులు వ్యయం చేశారు.

ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేస్తాం

- రాజేశ్వర్‌, డీఈ, జిల్లా గృహ నిర్మాణ శాఖ, జగిత్యాల

జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నాం. సాధ్యమైనంత తొందరలో లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

Updated Date - 2022-01-18T06:00:22+05:30 IST