పేదల ఆత్మగౌరవ ప్రతీక డబుల్‌ ఇళ్లు!

ABN , First Publish Date - 2021-06-17T08:39:49+05:30 IST

‘‘పేదలకు ఇళ్లంటే గతంలో పిట్టగూళ్లలా కట్టారు. తూతూ మంత్రంగా ఒక గది కట్టి దానికి మూడు రంగులు వేసి మూడు చెర్ల నీళ్లు తాగించారు.

పేదల ఆత్మగౌరవ ప్రతీక డబుల్‌ ఇళ్లు!

  • వారి ముఖంలో చిరునవ్వే మా లక్ష్యం
  • సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్‌


సిరిసిల్ల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదలకు ఇళ్లంటే గతంలో పిట్టగూళ్లలా కట్టారు. తూతూ మంత్రంగా ఒక గది కట్టి దానికి మూడు రంగులు వేసి మూడు చెర్ల నీళ్లు తాగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవారి ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేలా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం’’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సిరిసిల్లలో టీ డయాగ్నస్టిక్‌ సెంటర్‌తోపాటు బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను, రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం పేదల పక్షమన్నారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యమని.. వేరే ఉద్దేశం, అజెండా లేవని చెప్పారు.  గతంలో పిట్టగూళ్లలా ఇళ్లు కట్టారని, ఒక గదిలోనే కుటుంబ సభ్యులందరూ తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. 


తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దశల వారీగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి అవినీతికి తావు లేకుండా కేటాయించినట్లు తెలిపారు. అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించామని, ఇళ్లు రానివారికి అందజేస్తామని, అసంతృప్తి చెందవద్దని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వమే స్థలం, నిధులు కేటాయించి డబుల్‌ బెడ్‌ రూంలు నిర్మించిందని చెప్పారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ, ఉచిత కరెంటు, మురికి కాలువలు, సీసీ రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. గజం స్థలం లక్ష వరకు విలువ చేసే ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. ప్రతి కాలనీలో గజం జాగా ఉన్నా చెట్లు పెంచాలని సూచించారు. కరోనా విజృంభించిన సమయంలో ఆక్సిజన్‌ కోసం తండ్లాడిన పరిస్థితులు చూశామని, ప్రాణవాయువు అందించే చెట్లను పెంచుకుంటే ఈ అడ్డమైన రోగాలు కూడా రావని అన్నారు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రూ.200 పింఛన్‌ వచ్చేదని, దానికే గొప్పలు చెప్పుకొన్నారని.. తెలంగాణ ప్రభుత్వంలో పింఛన్‌ పది రెట్లు పెరిగి రూ.2 వేలు అయిందని చెప్పారు. 


కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, త్వరలోనే 4.70 లక్షల మందికి కార్డులు రాబోతున్నాయని తెలిపారు. బీడీలు చుట్టే అక్కాచెల్లెళ్లకు పింఛన్‌ ఇవ్వాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రీ చేయలేదని, కేసీఆర్‌ 4.50 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛన్‌ అందిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఫార్మా హబ్‌గా మారబోతోందని, 19 వేల ఎకరాల్లో రూ.75 వేల కోట్లతో ఫార్మా కంపెనీలు రాబోతున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పేదలకు  రూ.19 వేల కోట్లతో 2.67 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, కేటీఆర్‌ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.  


బాలుడికి వైద్యం చేయిస్తాం 

నిర్మల్‌ జిల్లా చించోళ్లకు చెందిన రెండేళ్ల చిన్నారి శ్రీశాంత్‌రెడ్డి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు బుధవారం ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఇప్పటికే రూ.12 లక్షలు ఖర్చు చేశామని, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.


అరె్‌స్టలు.. నిరసనలు 

జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో నిరసనలు, అరె్‌స్టలు తప్పలేదు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దక్కని వారు మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వినతిపత్రాలతో ఆందోళన చేస్తుండగా మంత్రి కేటీఆర్‌ వారి వద్దకు వెళ్లి ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన స్థలం తమదంటూ రాజిరెడ్డి, పద్మ కేటీఆర్‌ను కలవడానికి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరకు కేటీఆర్‌ను కలిసి తమకు పరిహారం ఇవ్వాలని కోరారు. బోయినపల్లి మండలంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా నిరసనలు తెలుపుతారని మిడ్‌ మానేరు నిర్వాసితులను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-06-17T08:39:49+05:30 IST