సొంతింటి కల నెరవేరేది ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-10-23T05:22:06+05:30 IST

ఏళ్లు గడుస్తున్నా పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. రాష్ట్రంలోనే అధికంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాబడిన నియోజకవర్గం దుబ్బాక. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చొరవతో అడిగిందే తడువుగా సీఎం కేసీఆర్‌ ఇళ్లను మంజూరు చేశారు. అంతా బాగానే ఉన్నా నిర్మాణంలో మాత్రం వెనుకంజలో ఉంది. చాలా చోట్ల స్థల వివాదాలతో ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించ లేదు. కనీసం పూర్తయిన వాటినైనా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం లేదు.

సొంతింటి కల నెరవేరేది ఎప్పుడో?

దుబ్బాక నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లకు గ్రహణం

కొన్ని ఇళ్ల నిర్మాణాలకు స్థల సేకరణలో అవాంతరాలు

పూర్తయిన ఇళ్ల పంపిణీ ఊసేలేదు 

సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయంపై ఎదురుచూపులు


దుబ్బాక, అక్టోబరు 22 : ఏళ్లు గడుస్తున్నా పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. రాష్ట్రంలోనే అధికంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాబడిన నియోజకవర్గం దుబ్బాక. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చొరవతో అడిగిందే తడువుగా సీఎం కేసీఆర్‌ ఇళ్లను మంజూరు చేశారు. అంతా బాగానే ఉన్నా నిర్మాణంలో మాత్రం వెనుకంజలో ఉంది. చాలా చోట్ల స్థల వివాదాలతో ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించ లేదు. కనీసం పూర్తయిన వాటినైనా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం లేదు. దుబ్బాక నియోజకవర్గానికి 3,484 డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 2,762 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 691 ఇళ్లు స్థలసేకరణకు నోచుకోలేదు. 


స్థల సేకరణలో ఇబ్బందులు

దుబ్బాక పట్టణానికే సుమారు 1,135 ఇళ్లను కేటాయించారు. అందులో 972 ఇళ్లను పూర్తి చేసినా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గంబీర్‌పూర్‌ గ్రామ పరిధిలో డబుల్‌ ఇళ్లు నిర్మాణం పూర్తయిన పంపిణీ ఆలస్యం కావడంతో లబ్ధిదారులను తామే ప్రకటించుకుని గృహాలను కబ్జా చేశారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో 60 ఇళ్లకు గృహప్రవేశం జరిగినా మరో 20 ఇళ్ల నిర్మాణానికి స్థల వివాదం నెలకొన్నది. తిమ్మాపూర్‌లో 30 ఇళ్లను నిర్మించినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఈ గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లను అందించాలని డిమాండ్‌ చేయడంతో మరో 20 మంజూరు చేశారు. ఇప్పటివరకు అనువైన స్థలం లేక వాటి నిర్మాణంఆగిపోయింది. దుబ్బాక మండలంలోని పద్మశాలిగడ్డలో 24, దుబ్బాక పట్టణంలో 104, రేకులకుంటలో 15, చెల్లాపూర్‌లో 15, తొగుట మండలం మెట్టు గ్రామంలో 10, వెంకట్రావుపేటలో 30, దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లిలో 20, ముబార్‌సలో 30, పిట్టలవాడలో 5, గోవిందాపూర్‌లో 20, రాయపోల్‌ మండలం రామారంలో 15, చౌదర్‌పల్లిలో 8, అనాజీపూర్‌లో 23 ఇళ్ల నిర్మాణాలకు స్థలసేకరణకు ఇబ్బంది కావడంతో మంజూరు అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇలా చాలా చోట్ల స్థల వివాదాలతోనే అనుకున్న లక్ష్యం నెరవేరకుండా అవంతరాలు ఏర్పడుతున్నాయి. మిరుదొడ్డి మండలంలో మాత్రం మంజూరైన 450 ఇళ్లకు 420 పూర్తయ్యాయి. వాటిని లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. 


సొంత స్థలంలో నిర్మాణం కోసం ఎదురుచూపులు

ఈసారి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం పథకంపై అంతా ఎదురుచూస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 5 వేలకుపైగా కుటుంబాలు సొంతిళ్లు లేక అవస్థలు పడుతున్నారు. చాలా మందికి సొంత స్థలం ఉండడంతో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.


ప్రజల భాగస్వామ్యంతో పర్శరాంనగర్‌

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌ మండలం చిన్నచీకోడును ఆనుకుని ఉన్న దుబ్బాక మండలం పర్శరాంనగర్‌ గ్రామం మొదటి విడతలోనే డబుల్‌ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆదర్శంగా నిలిచింది. స్థల కొనుగోలుతోపాటు ఇంటికి వాడే తలుపులు, తదితర సామగ్రిని సిరిసిల్ల నియోజకవర్గం గ్రామాల్లోని ప్రజలు భాగస్వామ్యంతో సమకూర్చి ఇచ్చారు. దీంతో 25 ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకున్నది. అయితే ఒక్క ఇంటికి రూ.5.04 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ, ఆ మొత్తంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే అవకాశం లేక చాలా గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోయాయి. 

Updated Date - 2021-10-23T05:22:06+05:30 IST