డబుల్‌.. ట్రబుల్‌!

ABN , First Publish Date - 2022-01-22T05:27:10+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సొంతిల్లు లేని నిరుపేదలకు ఇంకా నిరీక్షణ త ప్పడం లేదు.

డబుల్‌.. ట్రబుల్‌!


  • పనుల్లో మందగమనం.. పూర్తయ్యేది ఎన్నడో..
  • కులకచర్లలో  పూర్తి కాని స్థలం కేటాయింపు! 
  • పరిగి, మోమిన్‌పేటలో వేగంగా కొనసాగుతున్న పనులు
  •  సొంతిల్లు లేని నిరుపేదల ఎదురుచూపులు 

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సొంతిల్లు లేని నిరుపేదలకు ఇంకా నిరీక్షణ త ప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌  ఇళ్ల నిర్మాణ పథకం పనులు వికారాబాద్‌ జిల్లాలో ముందుకు సాగడం లేదు. డబుల్‌ ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా పనుల్లో వేగం పెరగడం లేదు.

వికారాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు వికారాబాద్‌ జిల్లాలో ముందుకు సాగడం లేదు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించక ఆశించిన ప్రగతి కనిపించడం లేదు.  సొంతిల్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో కూడిన ఆధునాతన డబుల్‌ బెడ్‌రూం నిర్మించి ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆశయం ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. పట్టణ ప్రాంతంలో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం నిర్మాణానికి రూ.5.30 లక్షలు, గ్రామాల్లో నిర్మించే ఇంటికి రూ.5.04 లక్షలుగా నిర్ణయించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పనులకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసిన ప్రజాప్రతినిధులు ఆ తరువాత వాటి ప్రగతి గురించి పట్టించుకోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.  వికారాబాద్‌ జిల్లాకు ఇప్పటి వరకు 3,873 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, ఆ ఇళ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 3,632 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా, వాటిలో 2,477 ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైన 2,187 ఇళ్లలో 210 ఇళ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోగా, మిగతా ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 

ఇళ్ల నిర్మాణం జరిగేది ఎక్కడంటే..

తాండూరు నియోజకవర్గానికి 1,761 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, వాటిలో తాండూరులో మునిసిపాలిటీ పరిధిలో 1,001, గ్రామీణప్రాంతాలకు 760 ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ ప్రజల కోసం కోకట్‌ వద్ద నిర్మిస్తున్న ఇళ్లలో 641 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, 360 ఇళ్ల నిర్మాణం పనులు నిలిచిపోయాయి. నిర్మాణం పనులు కొనసాగుతున్న ఇళ్లలో 180 ఇళ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. యాలాలలో 20, బెన్నూరు10, చెన్నారంలో 10 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఆ పనులకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. వికారాబాద్‌ నియోజకవర్గానికి 1,001 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో జిల్లా కేంద్రంలో 401 ఇళ్లు, గ్రామీణప్రాంతాలకు 600 ఇళ్లు మంజూరయ్యాయి. వికారాబాద్‌లో చేపట్టాల్సిన 401 ఇళ్లలో 48 ఇళ్ల నిర్మాణం పనులు బేస్‌మెంట్‌ (ప్లింత్‌ బీమ్‌) వరకు వచ్చి నిలిచిపోయాయి. ధారూరులో చేపట్టిన 120 ఇళ్ల నిర్మాణం పైకప్పు వరకు పూర్తయింది. వాటిలో 72ఇళ్లకు గోడల నిర్మాణం పూర్తి కాగా, 36 ఇళ్లకు ప్లాస్టరింగ్‌ పనులు కూడా పూర్తి చేశారు. మర్పల్లిలో 120 ఇళ్ల పైకప్పు పనులు పూర్తవగా, వాటిలో 60 ఇళ్లకు ఇటుక పని పూర్తయింది. మోమిన్‌పేట్‌లో 130 ఇళ్లలో 84 ఇళ్ల నిర్మాణం ప్లింత్‌బీమ్‌ వరకు పూర్తి చేశారు. పరిగి నియోజక వర్గానికి మొత్తం 510 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో పరిగి పట్టణంలో 300, గ్రామీణ ప్రాంతాలకు 210 ఇళ్లు కేటాయించారు. అర్బన్‌కు కేటాయించిన 300 ఇళ్లలో 180 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించగా, ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఇళ్లలో 118 ఇళ్లు పైకప్పు స్థాయికి చేరుకుని గోడల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. దోమ మండలంలో 50 ఇళ్లలో 24 ఇళ్ల పైకప్పు పూర్తి కాగా, కులకచర్ల మండలం, అడవి వెంకటాపూర్‌లో చేపట్టిన 30 ఇళ్ల నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా, ఇదే మండలంలో ఇప్పాయిపల్లిలో 10 ఇళ్ల నిర్మాణానికి పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. కులకచర్లలో ఇంకా స్థల కేటాయింపు పూర్తి కాలేదు. కొడంగల్‌ నియోజకవర్గానికి 373 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో అర్బన్‌కు 300, గ్రామీణ ప్రాంతాలకు 73 ఇళ్లు కేటాయించారు. కొడంగల్‌కు కేటాయించిన 300 ఇళ్ల నిర్మాణం పనులు ఫుటింగ్‌ దశలో ఉన్నాయి. కాగా, గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేవు. చేవెళ్ల నియోజకవర్గంలో నవాబుపేట మండలం, చిట్టిగిద్దలో 100 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, 24 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. 

ఇళ్ల నిర్మాణ బాధ్యతలు

 తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పనుల పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌శాఖ ఎస్‌ఈకి, పరిగి, చేవెళ్ల (నవాబుపేట మండలం) నియోజకవర్గాలకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి అప్పగించారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణం పనులను ఇరిగేషన్‌ అండ్‌ పరివాహక అభివృద్ధి శాఖ ఎస్‌ఈకి, అర్బన్‌లో మునిసిపల్‌ కమిషనర్‌కు అప్పగించారు. 

ఆశ నెరవేరేదెప్పుడో... 

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంతో ఇక త్వరలో తమ సొంతింటి కల నెరవేరుతుందని ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలు ఆశించారు. సంవత్సరాలు గడుస్తున్నా చాలా వరకు గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణం పనులు కొనసాగకపోవడంతో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేద ప్రజలు నిరాశకు గురవుతున్నారు.  రెండుపడకల ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుపేద లబ్ధ్దిదారులకు ఇంకా ఎదురు చూపులు త ప్పడం లేదు.

Updated Date - 2022-01-22T05:27:10+05:30 IST