బెడ్లు కష్టమే!

ABN , First Publish Date - 2021-04-10T08:16:15+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నాలుగు రోజులకే రెట్టింపు అవుతున్నాయి.

బెడ్లు కష్టమే!

  • నాలుగు రోజుల్లోనే రెట్టింపు కేసులు
  • పాజిటివ్‌ల్లో 5% ఆస్పత్రుల్లో చేరిక
  • గత సెప్టెంబరులో తారస్థాయిలో కొవిడ్‌
  • అప్పుడు పడకల ఆక్యుపెన్సీ 36.7 శాతం
  • ఇప్పుడు సెకండ్‌వేవ్‌ ప్రారంభంలోనే 20%
  • పరిస్థితి ఇలాగే కొనసాగితే మేలో కష్టమే!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నాలుగు రోజులకే రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమే! ప్రజలు ఇలాగే నిర్లక్ష్య ధోరణితో ఉంటే మున్ముందు పడకలు దొరకవని నాలుగు రోజుల క్రితమే ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఆ పరిస్థితులు నెలకొనేలా కనిపిస్తున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.


రాష్ట్రంలో గత 4 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. ఏప్రిల్‌ 4న 1097 పాజిటివ్‌లు వస్తే, 8 నాటికి ఆ సంఖ్య 2478కి చేరింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో 5 శాతం మంది ఆస్పత్రుల పాలవుతారని, అందులో 1ు మందికి వెంటిలేటర్‌ అవసరమవుతుందని కొవిడ్‌ వైద్య చికిత్సా నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది మార్చి 2న తొలి కేసు నమోదవగా, ఆగస్టు 22 నాటికి ఒక్క రోజు పాజిటివ్‌ల సంఖ్య 2474కు చేరింది. అంటే 5 నెలల 20 రోజులకు ఆ స్థాయిలో కేసులు రాగా, ప్రస్తుతం 4 రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక రోజులో అత్యధికంగా 3018 కేసులు గత ఆగస్టు 25న వచ్చాయి. అప్పటికి రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 25685కు పెరిగింది. అదే ఏడాది సెప్టెంబరు 4 నాటికి అత్యధికంగా 32915 యాక్టివ్‌ కేసులు వచ్చాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఆ రోజుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20396 పడకలు ఉండగా.. 2730 మంది రోగులున్నారు. అలాగే ప్రైవేటులో 10253 పడకలు ఉండగా.. 4456 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 


ఇప్పటికే 20 శాతం..

ప్రస్తుతం రాష్ట్రంలో 15472 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8559 పడకలుండగా.. 1579 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటులో 11902 బెడ్లు ఉంటే అందులో 4219 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. గత ఏడాది కొవిడ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్న సెప్టెంబరు 4 నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో అన్ని పడకల్లో 42.28 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, తాజాగా ఈ నెల 6న 31.15 శాతం పడకల ఆక్యుపెన్సీ ఉన్నట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రమంతా గత ఏడాది సెప్టెంబరు 3 నాటికి పడకల ఆక్యుపెన్సీ 36.70 శాతం ఉండగా, ప్రస్తుతం 20.26గా నమోదైంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, పీక్‌ స్టేజ్‌కు వెళితే పెద్దపెద్ద స్టేడియాలను కూడా ఆస్పత్రులుగా మార్చాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యనిపుణులంటున్నారు. 


మేలో కష్టమే..!

కేసులు ఇలాగే కొనసాగితే, మే 20 నాటికి సరిగ్గా 25 లక్షలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న బులెటిన్‌ ప్రకారమే ఈ లెక్క. ఇక క్షేత్రస్థాయిలో అంతకు నాలుగు రెట్లు కేసులు వస్తున్నట్లు సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివ్‌లకు 8 వేల ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అంటే పాజిటివ్‌లు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ‘‘సర్కారు విడుదల చేస్తున్న లెక్కల ప్రకారం చూసినా.. మే మూడో వారానికి 25 లక్షల కేసులు నమోదవుతాయి. అందులో ఐదు శాతం ఆస్పత్రుల పాలు అవుతారనుకుంటే 1.25 లక్షల మందికి చికిత్స అవసరం అవుతుంది. ఇందులో ఒక శాతం మందికి సీరియస్‌ అయితే వారికి వెంటిలేటర్‌ అవసరం అవుతుంది. అలాగే ఆస్పత్రుల పాలయ్యేవారిలో సగటున 7-10 రోజుల పాటు చికిత్స అవసరం అవుతుంది’’ అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నెల రోజుల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్క పడక కూడా దొరకని పరిస్థితులు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పడకలు ఎన్ని ఉన్నాయంటే..

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ కోసం 8559 పడకలు, ప్రైవేటులో 11902 కలిపి మొత్తం 20461 పడకలు అందుబాటులో ఉన్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో కొవిడ్‌ కోసం కేటాయించిన పడకలన్నింటినీ తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే సర్కారీ ఆస్పత్రుల్లో 21 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మరో 10 వేల పడకలను కూడా వినియోగించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 42 వేల పడకలు అందుబాటులో ఉంటాయి. అందులో సర్కారీలో ఆక్సిజన్‌ బెడ్స్‌ 11 వేల వరకు ఉండగా, 1711 వరకు వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రైవేటులో కూడా 3186 వరకు వెంటిలేటర్లు, 4 వేల ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. 



Updated Date - 2021-04-10T08:16:15+05:30 IST