ఐటీడీఏపై నీలినీడలు

ABN , First Publish Date - 2022-01-28T04:31:05+05:30 IST

మన్యం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సీతంపేట ఐటీడీఏ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీనిలో భాగంగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట కేంద్రంగా ఐటీడీఏ కొన సాగుతోంది. తాజాగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పా టు కానుండడం, పాలకొండ నియోజకవర్గాన్ని అందులో విలీనం చేయనున్న నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ కొనసాగింపుపై సందే హాలు నెలకొన్నాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని పార్వతీపు రం కేంద్రంగా ఐటీడీఏ కార్య కలాపాలు నిర్వహిస్తోంది. ఒక జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు ఉండేందుకు వీలులేదు. ఈ నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ కొన సాగింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమవుతోంది.

ఐటీడీఏపై నీలినీడలు
సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

- మన్యం జిల్లా ఏర్పాటుతో సీతంపేటలో కనుమరుగయ్యే సూచనలు

- ఆందోళన చెందుతున్న గిరిజనులు 

(సీతంపేట/మెళియాపుట్టి)

మన్యం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సీతంపేట ఐటీడీఏ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీనిలో భాగంగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట కేంద్రంగా ఐటీడీఏ కొన సాగుతోంది. తాజాగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పా టు కానుండడం, పాలకొండ నియోజకవర్గాన్ని అందులో విలీనం చేయనున్న నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ కొనసాగింపుపై సందే హాలు నెలకొన్నాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని పార్వతీపు రం కేంద్రంగా ఐటీడీఏ కార్య కలాపాలు నిర్వహిస్తోంది. ఒక జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు ఉండేందుకు వీలులేదు. ఈ నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ కొన సాగింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమవుతోంది. 

సీతంపేట ఐటీడీఏను 1983లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2 లక్షల మందికిపైగా గిరిజనులు ఉన్నారు. ప్రస్తుతం ఏడు మండలాలు ట్రైబల్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌  ఆర్గనైజేషన్‌ పరిధిలో(టీపీఎంయూ)  ఉన్నాయి.  వీటిలో మెళియాపుట్టి, పాతపట్నం, మందస శ్రీకాకుళం జిల్లా కొనసాగనున్నాయి. పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలను మన్యం జిల్లాలో విలీనం చేశారు. వీటితోపాటు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ  నుంచి 11 గిరిజన మండలాలు  కూడా చేర్చారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ కార్యకలాపాలు నిర్వహించకుండా 11 మండలాలకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఉంది. సీతంపేట కేంద్రంగా ఉన్న ఐటీడీఏ శ్రీకాకుళం పరిధిలోని మందస, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోకి తరలించే అవకాశం ఉందని సమాచారం. పార్వతీపురంలో నిర్వహిస్తున్న ఐటీడీఏను ఎత్తివేసి మన్యం జిల్లాలో విలీనమైన సీతంపేట ఐటీడీఏను ఇక్కడే కొనసాగించే అవకాశమూ లేకపోలేదనే వాదన ఉంది. మరోవైపు షెడ్యూల్‌ ప్రాంతాల గ్రామాలు లేకుండా నాన్‌షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు మైదాన ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇలా ఏర్పాటు చేస్తే ప్రభుత్వపరంగా ఎటువంటి రాయితీలు, అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉండదని గిరిజనులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఐటీడీఏను అనివార్య కారణాల వల్ల తరలిస్తే మరింత వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించినా, ఐటీడీఏల విధి విధానాల అంశంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో ఆదివాసీల్లో ఉత్కంఠ నెలకొంది.


మన్యం జిల్లా ఏర్పాటు ఇలా..  

విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం విడిపోయి ‘మన్యం’ జిల్లాగా ఏర్పాటు కానుంది. మొత్తం రిజర్వుడ్‌ స్థానాలుగా.. ఎస్టీ జనాభా కలిగిన జిల్లా కావడంతో ‘మన్యం’ జిల్లాగా నామకరణం చేసి పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిని రెండు జిల్లాలుగా విభజిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ(ఎస్టీ), కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ) నాలుగు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఇవి కొనసాగుతాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడతో పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజవర్గ పరిధిలోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలతో నూతనంగా పార్వతీపురం జిల్లా ఏర్పాటు కానుంది. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు ఇంతవరకు పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. అవి పాలకొండ డివిజన్‌కు వెళ్లనున్నాయి. దీంతో వీరికి పాలకొండ దూరాభారం కానుంది. అయితే జిల్లా కేంద్రం దగ్గర కానుంది. 


మెళియాపుట్టిలో ఏర్పాటు చేయాలి

కొత్త జిల్లాల ప్రతిపాదనలతో సీతంపేట ఐటీడీఏ పరిస్థితి ఏమవుతుందో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తే.. గిరిజనులు అధికంగా నివసిస్తున్న మెళియాపుట్టి మండలానికి ప్రాధాన్యమివ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  మెళియాపుట్టి మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉండడంతో.. ఇక్కడే ఏర్పాటు చేస్తే స్థల సమస్య ఉండదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


అభిప్రాయాలు తీసుకోకుండానే   

కనీసం గిరిజనుల అభిప్రాయాలు తీసుకోకుండా జిల్లాలు విభజించడం అన్యాయం. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ కొనసాగుతుందో? లేదో కూడా స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయం. గిరిజనులకు అన్యాయం చేస్తే ఆందోళన బాట పడతాం. 

- జి.శాంతరావు, జిల్లా గిరిజన సంఘం నాయకులు 

 

స్పష్టత ఇవ్వాలి

గిరిజనులు ఐటీడీఏ వల్ల కొద్దిగొప్పో అభివృద్ధి చెందుతున్నారు. ఐటీడీఏ లేకపోతే గిరిజనాభివృద్ధి కేటాయించిన నిధులు ఇతర కులాలకు తరలించే అవకాశం ఉంది. ఐటీడీఏపై స్పష్టత ఇచ్చిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి. 

- వి.కృష్టారావు, జిల్లా ఆదివాసీ గిరిజన చైతన్యవేదిక అధ్యక్షులు 

Updated Date - 2022-01-28T04:31:05+05:30 IST