పరిషత్‌ తీర్పు.. పదిలమేనా?

ABN , First Publish Date - 2021-08-19T05:40:47+05:30 IST

‘పరిషత్‌’ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్‌ ముగిసి నాలుగు నెలలు పూర్తయింది. కానీ ఇంకా ఓటరు తీర్పు మాత్రం వెల్లడి కాలేదు. పోలింగ్‌ ప్రక్రియను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

పరిషత్‌ తీర్పు.. పదిలమేనా?
పురుషోత్తపురం స్ట్రాంగ్‌రూం వద్ద కాపలాకాస్తున్న పోలీసు



 పోలింగ్‌ ముగిసి నాలుగు నెలలు

 బ్యాలెట్‌ పత్రాల మనుగడపై అనుమానాలు

 వర్షాకాలం కావడంతో తడిసిపోయేందుకు అవకాశం

(ఇచ్ఛాపురం రూరల్‌)

‘పరిషత్‌’ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్‌ ముగిసి నాలుగు నెలలు పూర్తయింది. కానీ ఇంకా ఓటరు తీర్పు మాత్రం వెల్లడి కాలేదు. పోలింగ్‌ ప్రక్రియను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పు వస్తే కానీ, ఉత్కంఠకు తెరపడే అవకాశం లేదు. మరోవైపు ప్రస్తుత వర్షాకాలం వేళ.. కొన్ని స్ట్రాంగ్‌రూంల్లో బ్యాలెట్‌పత్రాలు తడిసిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పరిషత్‌ పోరుకు సంబంధించి ఉపయోగించే బ్యాలెట్‌ పత్రాలను 2020 మార్చిలో ముద్రించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న పోలింగ్‌ నిర్వహించారు. కోర్టు తీర్పు మేరకు ఓట్ల లెక్కింపు చేపట్టకుండా.. బ్యాలెట్‌ పత్రాలను స్ట్రాంగ్‌రూంల్లో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కోర్టు గత నెల 27న విచారణ చేపట్టి.. ఈ నెల 5కు వాయిదా వేసింది. తర్వాత మళ్లీ విచారణ చేపట్టి.. తీర్పును  రిజర్వులో ఉంచింది. పోలింగ్‌ జరిగి నాలుగు నెలలు కావడంతో బ్యాలెట్‌ పేపర్ల మనుగడపై ఇటు అభ్యర్థుల్లోనూ, అటు అధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముమ్మరంగా వర్షాలు కురుస్తుండడంతో.. కొన్ని స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌పత్రాలు తడిసిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల స్ట్రాంగ్‌రూంల శ్లాబ్‌లు లీకేజీలకు గురై నీళ్లు పడుతుంటాయి. ఇటువంటి గదులను కూడా ప్రోటోకాల్‌ను అనుసరించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో వీటిని భద్రపరిచారు. ప్రతి కేంద్రానికి ఒక అధికారిని పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం నియమించింది. నిరంతరం గార్డుల పర్యవేక్షణతో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేసింది. కాకపోతే వీరిపాత్ర గది బయట వరకే పరిమితం కానుంది. డోర్‌కు వేసిన సీల్‌ను తీసి లోపల ఉన్న బాక్సులను పరిశీలించాలంటే తప్పనిసరిగా ఎస్‌ఈసీ అనుమతితో పాటు కలెక్టర్‌ పర్యవేక్షణలోనే ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.

అనుమానాలుంటే పరిఽశీలిస్తాం 

ప్రస్తుతానికి స్ట్రాంగ్‌రూంల వద్ద పరిస్థితి బాగానే ఉంది. ఏ కేంద్రం వద్దనైనా వర్షపునీరు లీకేజీల విషయంలో కానీ, భద్రతాపరమైన అంశాల్లో కానీ అనుమానం వస్తే నిబంధనలను అనుసరించి తనిఖీలు చేపడతాం.

- బి.లక్ష్మీపతి, జడ్పీ సీఈవో



Updated Date - 2021-08-19T05:40:47+05:30 IST