Abn logo
Sep 15 2020 @ 12:59PM

ఉచిత వైద్యశిబిరం.. డాక్టర్ గుడారు జగదీష్ ఔన్నత్యం

క్రీడలు, ప్రమాదాల్లో గాయపడిన యువకులు, మధ్యవయస్కులు లిగమెంట్ తెగిన కారణంగా మోకాళ్ల సమస్య ఎదుర్కోనే వారి సంఖ్య పెరుగుతోందని బర్డ్ మాజీ డైరక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ తెలిపారు. తిరుపతి ఆలిండియా రేడియో రోడ్డులోని రాష్ట్రీయ సేవా సమితి (రాస్) అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన పాల్గొన్నారు. పేదలు, దివ్యాంగులకు చిత్తూరు జిల్లా తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి (రాస్) భవనంలో డాక్టర్ గుడారు జగదీష్ ఉచిత ఓపి ద్వారా వైద్యసేవలు అందించారు. 


రాయలసీమ ప్రాంత ప్రజలకు కోవిడ్ సంక్షోభ సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకొని ప్రతి నెల ఉచిత ఓపి ద్వారా రాస్ భవనంలో సేవలను డాక్టర్ జగదీష్  అందించడం జరుగుతుంది. ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని, తమ ఎముకలు, కీళ్ళు, వెన్నెముక, అంగవైకల్య సమస్యలకు వైద్యం చేయించుకుని, ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ జగదీష్ అపాయింట్ మెంట్ కావాల్సిన వారు 9390560025 నెంబరులో ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.


రాయలసీమ వాసులకు తన సేవలు అందించడానికి ప్రతినెలా 10 రోజులకొక పర్యాయం తిరుపతి ఆలిండియా రేడియో బైపాస్ రోడ్డులోని రాష్ట్రీయ సేవాసమితి (రాస్) ఆధ్వర్యంలో ఎముకలు, వెన్నెముక, కీళ్ల వ్యాధిగ్రస్తులకు, పుట్టుకతో ఏర్పడిన అంగవైకల్యంతో బాధ పడే చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ 19 నేపధ్యంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మార్గనిర్దేశకాలను పాటిస్తూ ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజులపాటు ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో పాటు చెన్నై నుంచి వచ్చిన మొత్తం 96 మంది రోగులను ఆయన పరీక్షించి వారికి అవసరమైన వైద్య సహాయం ఉచితంగా అందించారు. పుట్టుకతో వచ్చే ఆంగవైకల్యంతో బాధపడుతన్న దాదాపు 28 మంది చిన్నారులు ఈ వైద్య శిబిరానికి వచ్చారు. వంకరకాళ్లతో పుట్టిన వారిని, సెరిబ్రల్ పాల్సీతో బాధపడేవారిని  పరీక్షించి శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ద్వారకా తిరుమలలోని విర్డ్ ఆసుపత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు ఎంపిక చేశారు.

ముఖ్యంగా 25 నుంచి 43 సంవత్సరాల మధ్యవయస్కులు ఎక్కువగా మోకాలి లిగమెంట్ సమస్యతో బాధపడుతూ ఈ వైద్యశిబిరానికి వచ్చారు.  వారిని పరీక్షించిన డాక్టర్ జగదీష్ అవరమైన సూచనలు, సలహాలతో పాటు చికిత్స చేసుకునేందుకు మార్గనిర్ధేశం చేశారు. వెన్నెముక, తుంటికీలు, కీళ్లవ్యాధులతో బాధపడే వారికి ఆయన ఉచిత చికిత్స అందించారు. మోకాలు, తుంటి కీలు మార్పిడి అవసరమైన వారికి అతితక్కువ వ్యయంతో అధునాతన విదేశీ పరికరాలు అమర్చి  శల్యవైద్య సేవలను అందించేందుకు ఎంపిక చేశారు. త్వరలో రాస్ ఆధ్వర్యంలో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో తక్కువ రుసుముతో ఫిజియోథెరపి సేవలను అందించేందుకు చర్యలు చేపట్టారు.


ఈ సందర్బంగా డాక్టర్ జగదీష్  మాట్లాడుతూ.. మోకాలి లిగమెంట్ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారని చెప్పారు. ప్రమాదాల్లోనూ, క్రీడలు ఆడే క్రమంలోనూ, ఎక్కువగా మోకాలి నరాలు తెగిపోతున్నాయని తెలిపారు. ఆ సమస్యను చిన్నదిగా భావించి నిర్లక్ష్యం చేయడం ద్వారా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. మోకాలి నొప్పి వచ్చినప్పుడే సకాలంలో పరీక్షలు చేయించుకుని చికిత్స పొందితే సమస్య తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చని వెల్లడించారు. దీంతో పాటు వెన్నుమక సమస్యలు కూడా అధికమైయ్యాయని వివరించారు. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వారు, వాహనాలను నడిపే వారు ఈ సమస్యతో అధికంగా బాధపడుతున్నారని వెల్లడించారు. ఎక్కువసేపు కుర్చుని ఉండటం వల్ల నడుము భాగంలో ఉండే నరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అది సయాటికా రూపంలో పాదాల వరకూ నొప్పి రావడం జరుగుతుంది. వీరు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందడం ద్వారా స్వస్ధత పొందవచ్చన్నారు. 

Advertisement
Advertisement
Advertisement