కోవిడ్-19 ప్రత్యేక ఎయిమ్స్ కేంద్రంలో నిలకడగా రోగుల పరిస్థితి : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-04-05T21:15:04+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ హర్యానాలోని జజ్జర్‌లో ఏర్పాటు చేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన

కోవిడ్-19 ప్రత్యేక ఎయిమ్స్ కేంద్రంలో నిలకడగా రోగుల పరిస్థితి : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ హర్యానాలోని జజ్జర్‌లో ఏర్పాటు చేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) ప్రత్యేక కోవిడ్-19 చికిత్సా కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఇక్కడి రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందితోనూ, రోగులతోనూ ఆయన మాట్లాడారు. 


అనంతరం డాక్టర్ హర్షవర్థన్ మీడియాతో మాట్లాడుతూ జజ్జర్‌లోని ఎయిమ్స్‌లో ప్రత్యేక కోవిడ్-19 చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆసుపత్రిలో 162 మంది రోగులు ఉన్నారన్నారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ఇక్కడ 310 మంది రోగులకు చికిత్స చేసే అవకాశం ఉందని చెప్పారు. 


తాను ఇద్దరు రోగులతో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడానని తెలిపారు. ఆ ఇద్దరూ చాలా ఉత్సాహంగా, చికిత్స పట్ల, అందుతున్న సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రోగులు సంతృప్తి వ్యక్తం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి రోగులకు అత్యంత శాస్త్రీయ విధానంలో అంకితభావంతో పని చేసే వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స చేస్తున్నారన్నారు. 


దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రాలకు అన్నివిధాలుగా సహాయం అందజేస్తామని తాను హామీ ఇచ్చానన్నారు. తాను స్వయంగా రాష్ట్రాల మంత్రులతో మాట్లాడానన్నారు. రాష్ట్రాలకు కావలసిన సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 



Updated Date - 2020-04-05T21:15:04+05:30 IST