డీఆర్‌డీవో డీజీగా నారాయణ మూర్తి నియామకం

ABN , First Publish Date - 2021-07-31T00:52:10+05:30 IST

రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మిసైల్స్, స్ట్రాటజిక్

డీఆర్‌డీవో డీజీగా నారాయణ మూర్తి నియామకం

హైదరాబాద్ : రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మిసైల్స్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి నియమితులయ్యారు. ఎంఎస్ఆర్ ప్రసాద్ పదవీ విరమణ నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్లు డీఆర్‌డీవో ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపింది. 


డీఆర్‌డీవో ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ నారాయణ మూర్తి రక్షణ రంగ పరిశోధనలో విశేష కృషి చేస్తున్నారు. మన దేశంలో రక్షణ రంగం, ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం అత్యాధునిక ఏవియానిక్స్ టెక్నాలజీస్‌ను దేశీయంగా డిజైన్ చేయడం, అభివృద్ధిపరచడం కోసం విశేషంగా కృషి చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లోని ఏవియానిక్స్ లాబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)కి డైరెక్టర్, ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఆయన నేతృత్వం వహించారు. ఏవియానిక్స్, మిసైల్స్, గైడెడ్ వెపన్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, డెలివరీకి నేతృత్వంవహించారు. 


మిసైల్ సిస్టమ్స్, ఇతర రక్షణ రంగ అప్లికేషన్స్ కోసం అడ్వాన్స్‌డ్ ఆన్‌బోర్డ్ కంప్యూటర్ (ఓబీసీ) టెక్నాలజీస్ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా డాక్టర్ మూర్తి సేవలందించారు. మూడు దశాబ్దాల నుంచి ఆయన అందిస్తున్న సేవలు అడ్వాన్స్‌డ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ కంప్యూటర్స్, మిషన్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ఇతర ఏవియానిక్స్ టెక్నాలజీస్‌లో భారత దేశం స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడుతున్నాయి. 


భారత దేశపు మొదటి యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ (ఏ-శాట్) ‘‘మిషన్ శక్తి’’కి, లాంగ్ రేంజ్ మిసైల్ అగ్ని 5కు అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్ డిజైన్, డెవలప్‌మెంట్‌కు నాయకత్వం వహించారు. వీటి వల్ల భారత దేశ స్వదీశీ రక్షణ రంగం మరింత పటిష్టమైంది. BVRAAM అస్త్ర, QRSAM, ఆకాశ్ ఐఎస్, ఆకాశ్ ఎన్‌జీ, HSTDV, NGARM, లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్స్, బ్రహ్మోస్, ATGM నాగ్, HELINA, MPATGM, SANT, BMD, ANSP, అగ్ని మిసైల్ సిరీస్, ఇతర గైడెడ్ వెపన్ సిస్టమ్స్ కోసం ఏవియానిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి, డిమాన్‌స్ట్రేషన్‌లో అత్యంత కీలక పాత్ర పోషించారు. 


స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ డిజైన్, డెవలప్‌మెంట్‌కు నాయకత్వం వహించారు. వివిధ మిసైల్స్ కోసం అడ్వాన్స్‌డ్ రియల్‌టైమ్ కంప్యూటర్ టెక్నాలజీస్ కోసం విశేష కృషి చేశారు. 


డాక్టర్ నారాయణ మూర్తి సేవలకు గుర్తింపుగా అనేక విశిష్ట పురస్కారాలు లభించాయి. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆనరరీ ఫెలోషిప్, ఆస్ట్రనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు, అగ్ని అవార్డు, డీఆర్‌డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వంటివి ఆయనకు లభించాయి.


డాక్టర్ నారాయణ మూర్తి వరంగల్ ఆర్ఈసీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంటెక్ చేశారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. డీఆర్‌డీవోలో 1986లో చేరారు. 


Updated Date - 2021-07-31T00:52:10+05:30 IST